మోడీజీ.. మౌనంగా ఎందుకున్నారు?

మోడీజీ.. మౌనంగా ఎందుకున్నారు?

న్యూఢిల్లీ: లఖీంపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ ఘటనకు కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కొడుకు ఆశిష్‌ కారణమని.. అతడ్ని వెంటనే అరెస్టు చేయాలన్నారు. అలాగే అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరును చూస్తుంటే.. ఈ ఘటనకు కారకులైన వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లే ఉందన్నారు. 

ఎందుకు అరెస్ట్ చేయలే?

‘దేశ ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు అడగుతున్నా.. లఖీంపూర్ ఘటనకు కారకులైన నిందితుల్ని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిని ఎందుకు రక్షిస్తున్నారు. అంతమంది చూస్తుండగా రైతులపై కార్లను ఎక్కించారు. అయినా వారిని ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదు? అలాంటి నిందితుల ముందు మొత్తం వ్యవస్థ మోకాళ్లపై కూర్చుని వాళ్లను రక్షించడంలో బిజీ అయిపోయింది. ఇలాంటివి హిందీ సినిమాల్లో చూసుంటాం. ప్రధాని మంత్రి గారు.. ఒక వాహనం వచ్చి రైతుల మీద నుంచి వెళ్లడాన్ని దేశం మొత్తం చూసింది. డబ్బు ఉందని, లీడర్ అయినంత మాత్రాన వాహనంతో ఎవర్ని అయినా తొక్కేస్తారా? అసలు లఖీంపూర్‌లో ఏం జరిగిందనేది అందరికీ తెలియాలి. ఎవరు కారును ఎక్కించారనే నిజం ప్రజలందరికీ తెలియాలి’ అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 

రైతులపై ఎందుకంత అక్కసు?

‘ఏడాది కాలంగా దేశ రాజధానిలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ కాలంలో 600 మందికి పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. అయినా వారిపై వాహనాలను ఎక్కిస్తున్నారు. అసలు ప్రభుత్వానికి రైతులు అంటే ఎందుకంత కోపం? మీకేం నష్టం చేశారని వారితో అలా ప్రవర్తిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కారులో మంత్రి కొడుకు లేడని అంటున్నారు. కొన్నాళ్లకు అసలు అక్కడ వాహనమే లేదంటారు. మరికొన్నాళ్లకు అసలు అక్కడ రైతులే లేరంటారు. నిజం ఏంటంటే.. ఇక్కడ న్యాయం జరగదు. ప్రజలందరూ న్యాయం కోరుకుంటున్నారు. దీనిపై ప్రధాని నిర్ణయం తీసుకోవాలి. మోడీజీ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమారుడ్ని అరెస్ట్ చేయించండి. సంబంధిత మంత్రిని బాధ్యతల నుంచి తప్పించండి. బాధితులను వెంటనే పరామర్శించండి’ అని కేజ్రీవాల్ సూచించారు. 

మరిన్ని వార్తలు: 

‘మా’ను నడపడం మనకు చేతకాదా?: డైరెక్టర్ రవిబాబు

ఆ కారు నాదే.. అందులో నా కొడుకు లేడు: మంత్రి అజయ్ మిశ్రా

మరోసారి పెట్రో వాత.. రూ.100 దాటిన డీజిల్ ధర

ఫోన్​ స్క్రీన్​ ఇక పగలదు!