ఇయ్యాల తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ

ఇయ్యాల తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
  • రాగానే హైదరాబాద్​లో అధికారులతో భేటీ
  • 7, 8వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల విజిట్​
  • 9న హైదరాబాద్​లో అధికారులతో రివ్యూ
  • 19 అంశాలపై సమాచారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విజిట్ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్ఏ) టీమ్ బుధవారం రాష్ట్రానికి వస్తున్నది. మొదటి రోజు ఈ టీమ్ హైదరాబాద్​లో నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ కానుంది. 7వ, 8వ తేదీల్లో మూడు బ్యారేజీల క్షేత్ర స్థాయి పరిశీలన కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లనుంది. తర్వాత హైదరాబాద్ వచ్చి 9వ తేదీన మళ్లీ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతోపాటు బ్యారేజీ నిర్మాణ సమయంలో పని చేసిన అధికారులు, నిర్మాణ సంస్థలతో భేటీ అవుతుంది. తమ పర్యటన సమయంలో క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్​డీఎస్ఏ టీమ్ ఓ లేఖలో కోరింది. బ్యారేజీల ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణ తీరుపై సమాచారం అందించాలన్నది. తమకు మరో 19 అంశాలపై సమాచారాన్ని అందించాలని అందులో పేర్కొంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, రిపేర్లు, నిర్మాణం, లోపాలపై స్టడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన ఎన్​డీఎస్​ఏకు లేఖ రాసిన సంగతి తెలిసింది. దీనిపై స్పందిస్తూ సీడబ్ల్యూసీ చైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీయే ఇపుడు రాష్ట్రానికి వస్తున్నది.

ఎన్​డీఎస్ఏ టీమ్ కోరిన వివరాలు

మూడు బ్యారేజీల పరిశీలన సందర్భంగా తమకు కొంత సమాచారం అందుబాటులో ఉంచాలని ఎన్​డీఎస్ఏ టీమ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ అంశాలున్నాయి. బ్యారేజీ లే అవుట్ ప్లానింగ్, డ్రాయింగులు, టోపోగ్రాఫిక్​ సర్వే, ఆల్టర్నేటివ్ సైట్ సెలక్షన్ స్టడీ రిపోర్టులను అందుబాటులో ఉంచాలని అడిగింది. బ్యారేజీ పునాదులకు సంబంధించి జియలాజికల్, జియో టెక్నికల్, బోర్ హోల్ లాగ్ వివరాలు, ఎస్​పీటీ, ప్లేట్ లోడ్ పరీక్షా ఫలితాలు, బ్యారేజీల పెజో మీటర్, స్ట్రెస్ సెల్ డేటా అందించాలని కోరింది. అలాగే బ్యారేజీల నిర్మాణాల జియలాజికల్ ప్రొఫైల్, సెక్షనల్ డ్రాయింగ్, డిజైన్ కాలిక్యులేషన్స్, హైడ్రాలిక్ స్టెబిలిటీ, రాఫ్ట్​పై పడే ఒత్తిడి డిజైన్లను సమకూర్చాలని అడిగింది. వర్షాకాలానికి ముందూ, తర్వాత తయారుచేసిన నివేదికలు, ఫౌండేషనల్ ఇంప్రూవ్​మెంట్ పనులు, గేట్ల పరిస్థితులపై వివరాలివ్వాలని లేఖలో కోరింది.