నేషనల్​ ఫైబర్ ​పాలసీ.. చేనేతకు గొడ్డలిపెట్టు

నేషనల్​ ఫైబర్ ​పాలసీ.. చేనేతకు గొడ్డలిపెట్టు

జాతీయ ఫైబర్ విధానం అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానం దేశంలో ఉత్పత్తి అవుతున్న అన్ని రకాల నూలుపోగులకు సంబంధించినది. 2011 జూన్ నెలలో ముసాయిదా విధానం విడుదలైంది. ఇది ప్రభుత్వ విధానంగా ఎప్పుడు మారింది? ఎవరు ఆమోదించారనే విషయం ప్రభుత్వం స్పష్టంగా చెప్పనప్పటికీ, ఈ ముసాయిదా అమలులో ఉన్నది. అనేక మందికి ఈ విధానం గురించి, దాని నేపథ్యం గురించి తెలియదు. అందరికీ తెలియ చెప్పాలనే తపన ప్రభుత్వంలో లేదు. ఈ విధానం చేనేత రంగాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. తీవ్ర నిరాశను మిగిల్చింది. కొత్త పంథా గానీ, కొత్త రూపు గాని ఈ విధానంలో లేదు. భారత జౌళి రంగంలో ఉన్న అనేక ఉపరంగాల మధ్య గల వైరుధ్యాలను అర్థం చేసుకొని వాటి మధ్య ఒక సమన్వయం సాధించే దిశగా ఈ విధానానికి ముందు కేంద్రం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. భారత ప్రభుత్వ ప్రణాళికల్లో ఉన్న పర్యావరణ అనుకూల ఆలోచనలకు భిన్నంగా ఈ విధానాన్ని రూపొందించారు. ఈ విధానం పత్తి, కృత్రిమ నూలు మధ్య ఉన్న నిష్పత్తిని మార్చింది. ఈ జాతీయ ఫైబర్ విధానం ప్రధాన ఉద్దేశం కృత్రిమ నూలు ఉత్పత్తిని పెంచి, పత్తి తదితర సహజ నూలు రకాల మీద భారత ఉత్పత్తి రంగం ఆధారపడటాన్ని తగ్గించి ఆధునిక జౌళి రంగ అభివృద్ధి సాధించడం.

అంతర్జాతీయంగా పత్తి, కృత్రిమ నూలు నిష్పత్తి 40:60 ఉండగా,  దేశంలో ఇది 59:41గా ఉన్నది. అంటే, పత్తి ఉత్పత్తి కృత్రిమ నూలుతో పోలిస్తే మన దేశంలో ఎక్కువ. అంతర్జాతీయంగా తక్కువ. అయితే కృత్రిమ నూలు ఉత్పత్తి ఎందుకు ఎక్కువ చేయాలనే విషయం మీద సరైన వివరణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు. భారత్​పత్తి ఉత్పత్తిలో ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో ఉంది. 2008లో జరిగిన ఉత్పత్తి 5 బిలియన్ కేజీలు.పత్తి నూలు, పత్తి ఆధార వస్త్ర ఉత్పత్తిలో కూడా అగ్రగామి. 17 మిలియన్ కేజీల ఉత్పత్తి ద్వారా సిల్క్ లో కూడా రెండో స్థానంలో ఉంది. జనపనార ఉత్పత్తి 1.7 బిలియన్ కేజీలకు చేరుకొని ప్రపంచంలో మొదటి ప్లేస్​లో ఉంది. ఇలా టెక్స్​టైల్​అన్ని ఉపరంగాల్లో భారత్​అత్యున్నత స్థాయిలో ఉండింది. ఏ దేశంలో కూడా ఇన్ని రకాల ఫైబర్ ఉత్పత్తులు చేసే సామర్థ్యం పూర్తిగా లేదు. అన్ని రకాల ఫైబర్ ఉత్పత్తులలో సంపూర్ణంగా ముడిపదార్థాల ఉత్పత్తి నుంచి, వాటిని ఉపయోగించి తయారుచేసే జౌళి ఉత్పత్తుల దాకా భారత దేశం అగ్రగామిగా కొనసాగుతున్నది. వీటిని ఉత్పత్తి చేసే పద్ధతులు కూడా అనేకం. వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానం మన సొంతం. చేతి మగ్గంపై నేసిన వస్త్రాల నుంచి మిల్లుల వరకు ఈ దేశంలో అనేక రకాలుగా నైపుణ్యం కనపడుతున్నది. ఇంతటి వైవిధ్యం కలిగిన భారత జౌళి రంగంలో కనీసం10 కోట్ల మంది కేవలం సహజ ఫైబర్ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. సహజ ఫైబర్ ఉత్పత్తుల్లో పత్తి, సిల్క్, జూట్, ఉన్ని, అరటి వంటి అనేక రకాల వ్యవసాయ పంటలున్నాయి. ఈ వ్యవసాయ ఉత్పత్తులనుంచి నార తీసి, నూలు తయారుచేసే కుటీర, చిన్న, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. ఈ నూలు నుంచి జౌళి, వస్త్రాలు తయారు చేసే చేనేత పారిశ్రామికులు, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. అన్ని రంగాలు అన్ని రాష్ట్రాల్లో వివిధ స్థాయిల్లో ఉండటం మనకు చిరపరిచితమే. కాకపోతే, పత్తి నూలుకు సంబంధించిన పరిశ్రమ కేవలం తమిళనాడులో  కేంద్రీకృతమై ఉన్నది. అట్లాగే, కృత్రిమ నూలుకు సంబంధించిన పరిశ్రమ గుజరాత్ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉన్నది.

సహజ ఫైబర్​ను పట్టించుకోరా?

కృత్రిమ నూలు ఉత్పత్తి పెరగడం సహజ ఫైబర్ వచ్చే పంటలను ఉత్పత్తి చేసే రైతులకు కూడా ప్రమాదకరమే. ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోయి, మార్కెట్లో గిట్టుబాటు ధర రాక పత్తి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దొరక్క అధిక ధరలకు కొని మోసపోతున్నారు. కనీస మద్దతు ధర ఉన్నా, అనేక ప్రాంతాల్లో దాని ఫలితం దొరక్క రైతులు నష్టపోవడం మనకు తెలిసిందే. సెరికల్చర్ రైతులు, జనపనార పండించే రైతులకు ఈపాటి వసతులు లేక, సేద్యాన్నే వదులుకుంటున్నారు. గోగునార కింద ఇదివరకున్న ఎకరాలు ఇప్పుడు లేవు. దీనిపైనే ఆధారపడి జీవించే రైతులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సహజ ఫైబర్ నూలు వచ్చే పంటలు, వాటిని పండించే రైతులు లాభపడకుండా, వారి సమస్యలు తీర్చకుండా, వాటి జోలికి వెళ్లకుండా, జాతీయ ఫైబర్ విధానం ‘నేల విడిచి సాము చేస్తున్న’ చందంగా తయారైంది. సేంద్రీయ పద్ధతిలో, రసాయన పురుగు మందులు ఉపయోగించకుండా పత్తిని పండించే రైతుల గురించీ ఈ విధానంలో ప్రస్తావించినా అవసరమైన చర్యలు మాత్రం ప్రతిపాదించలేదు. రైతులకు మేలు చేసే ఈ పద్ధతినైనా ప్రోత్సహిస్తే బాగుండేది. ఇటీవలి కాలంలో ముడి పత్తి ఉత్పత్తిలో ఒడిదుడుకులు పెరిగాయి.  పత్తి ఉత్పత్తి ఖర్చులు, పత్తి నూలు ధరలు పెరుగుతున్నాయి. పత్తి వస్త్రాల ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీ తీవ్రంగా ఉన్నపుడు, ప్రపంచ వస్త్ర వాణిజ్యంలో భారత దేశం వాటా పెంచుకోవాలనే లక్ష్యం ఉన్నపుడు ఇలా అన్ని ఉత్పత్తి ప్రక్రియల్లో ఖర్చులు, ధరలు పెరగడమనే సమస్యను ఈ జాతీయ ఫైబర్ విధానం పూర్తిగా విస్మరించడం ఏ ప్రయోజనం కోసం? అనే అనుమానం వస్తుంది. ఈ విధానం పూర్తిగా కృత్రిమ నూలు ఉత్పత్తికి, పాలియిస్టర్ వస్త్ర పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చడానికే అని తెలుస్తున్నది. మ్యాన్ మేడ్ ఫైబర్ గా పిలిచే కృత్రిమ నూలును, దాని ఆధారంగా తయారు చేసే వస్తువుల గురించి ఈ విధాన రూపకల్పన అని స్పష్టంగా పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య నేపథ్యంలో ఎంఎంఎఫ్​ఉత్పత్తుల దిగుమతులను అరికట్టి, ఎగుమతులు పెంచుకోవాలంటే ఈ పరిశ్రమకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పదని కొందరు వాదిస్తున్నారు. అంటే ఎంఎంఎఫ్​ ఉత్పత్తుల ఖర్చులు తగ్గించే ప్రయత్నం ఈ విధానం ద్వారా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పూర్తిగా వివక్ష పూరిత నిర్ణయం. సహజ ఫైబర్ ఉత్పత్తులు గురించి పట్టించుకోకుండా ఎంఎంఎఫ్ ​గురించి మాత్రమే స్పందించడం సరైన నిర్ణయం కాదు. దాదాపు పది కోట్ల కుటుంబాల ఉపాధి గురించి పట్టించుకోకపోవడం శోచనీయం. ఇందులో ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, చేనేత కార్మిక కుటుంబాల పరిస్థితి చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.

భారత్ సహజ పద్ధతులను వదులుకోవద్దు

వ్యవసాయ ఉత్పత్తులతో, రైతుల జీవితాలతో ముడిపడి ఉన్నా జాతియ ఫైబర్ ​విధాన రూపకల్పన కమిటీలో వ్యవసాయ శాఖకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఆశ్చర్యంగా, జాతీయ ఫైబర్ విధానం స్థానం మీద స్పష్టత లేదు. ఈ విధానం 2000 సంవత్సరంలో తీసుకువచ్చిన జాతీయ జౌళి విధానంపై అభివృద్ధి చేసినదా లేక ఈ రెండు విధానాలు వేర్వేరా? ఇవి రెండు వేర్వేరు విధానాలైతే, వీటి మధ్య సమన్వయం గానీ, సారూప్యం గానీ ఉండాలి. కానీ లేదు. జాతీయ ఫైబర్ విధానంలోని అంశాలు జాతీయ జౌళి విధానం ఆశయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అనేక విషయాల్లో దూరదృష్టి, సమదృష్టి లోపించిన జాతీయ జౌళి విధానం గుణాలను, జాతీయ ఫైబర్ విధానం కూడా ప్రతిబింబిస్తున్నది. అన్ని రకాల సహజ ఫైబర్ నూలు ఉపయోగించి అనేక రకాల జౌళి ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యం కేవలం చేనేత రంగానికే ఉన్నది. ఈ నిజాన్ని, ప్రభుత్వం విస్మరించడం విస్మయం కలిగిస్తున్నది. కేవలం బడా కార్పొరేట్ సంస్థల ప్రాతినిధ్యం ద్వారా, వారికే మేలు చేయడానికి ఈ ప్రక్రియ మొదలుపెట్టటం ప్రజాస్వామ్యంలో ఆక్షేపించదగింది. అన్ని రకాల సహజ ఫైబర్ నూలు ఉపయోగంలో ముఖ్య భూమిక వహిస్తున్న చేనేతకు స్థానం లేకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ విధానం దృష్టి ఆయా జౌళి ఉపరంగాలకు మేలుచేసే విధంగా కాకుండా, జాతీయ జౌళి పరిశ్రమ దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడే విధంగా కాకుండా, కేవలం కొన్ని బడా, వ్యక్తిగత పరిశ్రమ లాభాలు పెంచేలా రూపొందించారు. ప్రపంచ వస్త్ర వాణిజ్యంలో భారత ఉత్పత్తులకు ఉన్న ఆదరణ ఇక్కడి ఉత్పత్తి పద్ధతులను బట్టే ఉన్నది. సాంకేతికంగా తక్కువ, మానవ శ్రమ, నైపుణ్యం ఎక్కువగా ఉండే భారత జౌళి రంగం గురించి భయపడే అమెరికా, యూరోపియన్ దేశాల్లో అత్యంత ఆధునిక పద్ధతుల్లో వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. అంటే, ఆధునిక వస్త్ర పరిశ్రమ పోటీలో మనజాలదు. భారత పద్ధతిలో చేయడం వలన, మన దిగుమతులతో పోటీ పడలేక అక్కడి పరిశ్రమలు మూతపడటం లేదా ఇతర సాంకేతిక ఉత్పత్తుల వైపు మళ్లడం మనం గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో, భారత జౌళి రంగం యూరోప్ తరహా జౌళి రంగ నిర్మాణం దిశగా పయనించడం సరి కాదు. జాతీయ ఫైబర్ విధానంలో ఆ దిశగా అడుగులు వేసే ప్రతిపాదనలు చేయడం ఆత్మహత్యాసదృశ్యం. గత పదేళ్లలో జాతీయ జౌళి విధానంవల్ల అనేక ప్రాంతాలలో అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. పేదరికం పెరిగింది. నిపుణులు కనుమరుగు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ ఫైబర్ విధానం ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రతిపాదనలు చేయకుండా గోరుచుట్టుపై రోకటి పోటు లాగ కృత్రిమ నూలు అభివృద్ధి బాట పట్టడం అత్యంత బాధాకరం.

పాలసీపై పునరాలోచన జరగాలి 


కృత్రిమ నూలు, పాలిస్టర్ వస్త్రాల ఉత్పత్తిని ప్రోత్సహించే ఈ విధానం వల్ల పేద ప్రజలు సహజ నూలు వస్త్రాలు కొనే స్తోమత కోల్పోతారు. 80వ దశకంలో ప్రభుత్వం ఒక నినాదం తీసుకు వచ్చింది.“పేదలకు పత్తి వస్త్రాలు, ధనికులకు పాలిస్టర్ వస్త్రాలు” అని, కానీ గత పదేళ్లలో ఈ పరిస్థితి తారుమారైంది. ప్రస్తుత జాతీయ ఫైబర్ విధానం వల్ల ఈ నినాదం మారింది. పేదలకు పాలిస్టర్ వస్త్రాలు, ధనికులకు పత్తి వస్త్రాలు. ఈ పరిస్థితి ఉత్పన్నమైతే పేద వినియోగ వర్గాలు అత్యంత దుర్బర పరిస్థితుల్లో పనిచేసేవారు పాలిస్టర్ వస్త్రాలు ధరించడం వల్ల అనారోగ్య పరిస్థితులకు గురవుతారు. క్లుప్తంగా, జాతీయ ఫైబర్ విధానం లోపభూయిష్టంగా ఉన్నది. దీని వల్ల ఉపాధి తగ్గుతుంది, దిగుమతులు పెరుగుతాయి, పర్యావరణ విధ్వంసం పెరుగుతుంది. దేశీయ వస్త్ర పరిశ్రమ ప్రమాదంలో పడుతుంది. స్థూలంగా, వస్త్ర ఉత్పత్తిని, వినియోగాన్ని పూర్తి స్థాయిలో, సంపూర్ణంగా మార్చే ఇలాంటి విధానం వల్ల ఉన్న ఉపాధి కోల్పోయి, వినియోగంలో స్వావలంబన కోల్పోయి, స్వతంత్ర జౌళి రంగం ఉనికి కోల్పోయి, విదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడే పరిస్థితికి చేరుకుంటున్నాము. ఈ జాతీయ ఫైబర్ విధానం మీద పునరాలోచన జరగాల్సిన అవసరం ఉన్నది. జాతీయ ఫైబర్ విధానంలో వివిధ జౌళి ఉపరంగాల్లో పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల్ని తగ్గించే పథక రచన జరగాలి. దేశీయ జౌళి రంగం ప్రాశస్త్యం.. సహజ నూలు ఉత్పత్తులు కాబట్టి, వాటిని ప్రోత్సహించేలా వ్యూహాలు పొందుపరచాలి. మార్కెట్లో వినియోగదారులు మోసపోకుండా జౌళి ఉత్పత్తులకు లేబులింగ్ చట్టం తీసుకురావాలి. సహజ నూలు కోసం ఒక నిధిని ఏర్పాటు చేయాలి. నూలు ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చేయాలి.

- డా.దొంతి నర్సింహారెడ్డి, జౌళిరంగ నిపుణులు