కాంగ్రెస్​కు 9, బీజేపీకి 4 సీట్లు బీఆర్ఎస్ కు 3, మజ్లిస్ కు 1 

కాంగ్రెస్​కు 9, బీజేపీకి 4 సీట్లు బీఆర్ఎస్ కు 3, మజ్లిస్ కు 1 
  •     ఎన్డీటీవీ ‘పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్’ సర్వేలో వెల్లడి 
  •     కేంద్రంలో మళ్లీ ఎన్డీఏకే పవర్
  •     400 సీట్లకు చేరువలో 372 సీట్లు గెలిచే చాన్స్
  •     ఇండియా కూటమికి 122 సీట్లు వచ్చే అవకాశం

న్యూఢిల్లీ:   లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగనుంది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో హస్తం పార్టీకి 9 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎన్డీటీవీ నిర్వహించిన ‘పోల్ ఆఫ్​ఒపీనియన్ పోల్స్’ సర్వే వెల్లడించింది. బీజేపీ 4 సీట్లు, బీఆర్ఎస్ 3, ఎంఐఎం పార్టీ ఒక సీటును గెలిచే చాన్స్ ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్ సభ సీట్లు ఉండగా, అధికార వైఎస్ఆర్ సీపీ16 సీట్లలో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఏపీలో లోక్ సభతోపాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నందున.. ఆ ఫలితాలు కూడా దాదాపు ఇలాగే వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ సీ వోటర్, టైమ్స్ నౌ ఈటీజీ, టీవీసీఎన్ఎక్స్, జీ న్యూస్ మ్యాట్రిక్స్, టైమ్స్ నౌ మ్యాట్రిక్స్, ఇండియాటుడే సీ వోటర్ సంస్థలు నిరుడు డిసెంబర్ నుంచి ఈ ఏప్రిల్ మధ్య నిర్వహించిన 9 ఒపీనియన్ పోల్స్ ఆధారంగా ‘పోల్ ఆఫ్​ఒపీనియన్ పోల్స్’ సర్వే నిర్వహించిన ఎన్డీటీవీ బుధవారం ఆ ఫలితాలను ప్రకటించింది. దక్షిణాదిన తమిళనాడులో 39 సీట్లకు గాను డీఎంకే 33 సీట్లు గెలుస్తుందని, అన్నా డీఎంకే 4 సీట్లకే పరిమితమవుతుందని, బీజేపీ 2 సీట్లను గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది. కర్నాటకలో 28 సీట్లకు గాను బీజేపీ 23 సీట్లను గెలుచుకునే చాన్స్ ఉందని తెలిపింది. 

400కు దగ్గర్లోకి బీజేపీ

కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి రావచ్చని సర్వే అంచనా వేసింది. అయితే, ఈసారి 400 లోక్ సభ సీట్లను సాధిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి ఆ టార్గెట్ కు చేరువలోనే ఎంపీ సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది. లోక్ సభలో ఎన్నికలు జరిగే మొత్తం 543 సీట్లకుగాను బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 372 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 సీట్లు వస్తాయని, మిగతా 49 సీట్లు ఇతరులకు వస్తాయని పేర్కొంది. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వివిధ సర్వేల్లో తేలినా.. ప్రతిపక్ష ఇండియా కూటమికి సీట్ల సంఖ్య కూడా పెరగనుందని వెల్లడైంది. ఎన్డీఏకు 2014లో 336 ఎంపీ సీట్లు రాగా, 2019 ఎన్నికల్లో 5% అధికంగా 353 సీట్లు (బీజేపీకి 303) వచ్చాయి. ఈసారి ఎన్డీఏకు సీట్ల సంఖ్య 3.4 శాతం మాత్రమే పెరగనుంది. అలాగే 2014లో అప్పటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకు కేవలం 60 సీట్లు రాగా, 2019లో 50% అధికంగా 90 సీట్లు వచ్చాయి. ఈసారి ఇండియా కూటమికి మరో 35% అధికంగా 122 సీట్లు రావచ్చని సర్వే పేర్కొంది.  

హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం 

ఢిల్లీ, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ(8 రాష్ట్రాలు/యూటీలు)ల్లో కలిపి 72 సీట్లు ఉండగా.. వీటన్నింటినీ ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయొచ్చని సర్వే అంచనా వేసింది. అలాగే ప్రధాన హిందీ రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్, బిహార్ లలో బీజేపీ ఆధిపత్యం కొనసాగనుందని తేల్చింది. యూపీలో 80 సీట్లకు గాను 74 సీట్లను, మధ్యప్రదేశ్ లో 29కిగాను 28 సీట్లను, బిహార్ లో 40కి 39 సీట్లను ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక మహారాష్ట్రలో 48 సీట్లకు గాను బీజేపీ కూటమికి 30 సీట్లు రావచ్చని సర్వే తెలిపింది. బెంగాల్ లో 42 సీట్లు ఉండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ కు 22 సీట్లు, కాంగ్రెస్ కు ఒక సీటు, బీజేపీకి పోయినసారి కంటే ఒకటి ఎక్కువగా 19 సీట్లు రావచ్చని అంచనా వేసింది.