మరో 49 మంది ఎంపీలపై వేటు .. మూడు రోజుల్లో 141 మంది సస్పెన్షన్​

మరో 49 మంది ఎంపీలపై వేటు .. మూడు రోజుల్లో 141 మంది సస్పెన్షన్​

న్యూఢిల్లీ: పార్లమెంట్​లో భద్రతా వైఫల్యం ఘటనపై మంగళవారం కూడా ఉభయసభలు దద్దరిల్లాయి. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు పట్టు వీడకపోవడంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. గత బుధవారం లోక్​సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి స్మోక్ క్యాన్లతో పొగను రిలీజ్ చేసిన ఘటనపై చర్చ చేపట్టాల్సిందేనంటూ మంగళవారం కూడా రాజ్యసభ, లోక్ సభలో సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేశారు. 

లోక్ సభలో కొందరు సభ్యులు మార్ఫింగ్ చేసిన ప్రధాని మోదీ ఫొటోలను సైతం పట్టుకొచ్చారు. దీంతో మరో 49 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంతకుముందు గురువారం రోజున 14 మంది, సోమవారం 79 మంది అపొజిషన్ ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 141 మంది ఎంపీలపై వేటు పడింది. దేశ చరిత్రలో ఒక పార్లమెంట్ సెషన్ లో ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన రిపోర్ట్ పై చర్చ సందర్భంగా1989లో 63 మంది లోక్ సభ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇప్పటివరకూ ఇదే హయ్యెస్ట్ కాగా, తాజాగా అంతకు రెట్టింపు పైగా ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. మంగళవారం లోక్ సభలో సస్పెన్షన్ కు గురైన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ సభ్యులు మనీశ్ తివారి, శశిథరూర్, కార్తి చిదంబరం, ఎన్ సీపీ ఎంపీ సుప్రియా సూలె, సమాజ్ వాదీ పార్టీ మెంబర్ డింపుల్ యాదవ్, తదితరులు ఉన్నారు. మరోవైపు ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు చేపట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. 

స్పీకర్ ఓం బిర్లా సీరియస్  

నిబంధనలకు విరుద్ధంగా సభలోకి ప్లకార్డులు తేవడంతోపాటు వెల్ లోకి రావడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ‘‘సభలోకి ఎవరూ ప్లకార్డులు తీసుకురావద్దని మనం గతంలోనే నిర్ణయించుకున్నాం. కానీ మీరు ఇప్పుడు ప్లకార్డులు పట్టుకొస్తున్నారు. మీరు పోడియంలోకి కూడా వస్తున్నారు. ఇది కరెక్టేనా? దయచేసి, వెనక్కి వెళ్లి సీట్లో కూర్చోండి. మీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్” అంటూ ఆయన హెచ్చరించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వినకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెల్ లోకి రావద్దని కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభంరోజే ఎంపీలంతా అంగీకరించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫొటోను తీసుకొచ్చిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.  

రోజూ అదే తీరు.. 

పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతుండగా.. పార్లమెంట్ భద్రత లోక్ సభ స్పీకర్ పరిధిలోకి వస్తుందని, స్పీకర్ ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతోందని, దీనిపై చర్చ అవసరంలేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీంతో ఇదే విషయంపై రోజూ సభలో రచ్చ కొనసాగుతోంది. సస్పెన్షన్ లకు వ్యతిరేకంగా రోజూ పార్లమెంట్ బయట సైతం ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ వింటర్ సెషన్ మరో రెండ్రోజుల్లోనే ముగియనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ లోక్ సభలో ఇవే చివరి పూర్తి స్థాయి సమావేశాలు కానున్నాయి. 

2/3వ వంతు తగ్గిన ప్రతిపక్షాల బలం  

లోక్ సభలో మొత్తం 543 సీట్లకు గాను ప్రతిపక్ష ఇండియా కూటమికి 142 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 95 మంది సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. రాజ్యసభలో 250 స్థానాలకు గాను, ప్రతిపక్షాలకు 101 మంది సభ్యులు ఉండగా, 46 మంది సస్పెండ్ అయ్యారు. ఉభయసభల్లో కలిపి మొత్తం 243 మందికి గాను.. 141 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. దీంతో లోక్ సభలో ప్రతిపక్షాల బలం 47కు.. రాజ్యసభలో 55కు పడిపోయింది. మొత్తంగా పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీల స్ట్రెంత్ 2/3వ వంతు తగ్గిపోయింది. అయితే, పార్లమెంట్ లో అధికార ఎన్డీఏ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వైఎస్ఆర్ సీపీ, బీజేడీ పార్టీలకు చెందిన సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ రెండు పార్టీలు కేంద్రానికి అనధికారిక మిత్ర పక్షాలుగా ఉండటంతో ఆయా బిల్లుల ఆమోదానికి అవసరమైనప్పుడు కేంద్రానికి మద్దతు ఇస్తున్నాయి.  

ఇది ‘నమోక్రసీ’కి ప్రతిరూపం: జైరాం రమేశ్  

ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. కొత్త పార్లమెంట్ అన్ని రకాలుగా నియంతృత్వంతో దాని ‘నమోక్రసీ’కి ప్రతిరూపంగా నిలుస్తోందని విమర్శించారు.

గందరగోళం మధ్యే బిల్లులు పాస్ 

లోక్ సభ ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రతిపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కాగానే.. ఢిల్లీలోని అనధికారిక కాలనీలకు సంబంధించిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ రెండో అమెండ్ మెంట్ బిల్లును లోక్ సభ ఆమోదించింది. తర్వాత ఈ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సీజీఎస్టీ (రెండో సవరణ) బిల్లు, ప్రొవిజినల్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ బిల్లులు కూడా మంగళవారం లోక్ సభ ఆమోదం పొందాయి. ఆ తర్వాత లోక్ సభలో సీఆర్ పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో కొత్త చట్టాలను తెచ్చేందుకు ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను లోక్ సభ ఆమోదానికి మంగళవారం సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లులపై చర్చ చేపట్టి, సభ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లులపై ప్రతిపక్షాలు ఇదివరకే అభ్యంతరాలు లేవనెత్తాయి. కానీ ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో ప్రతిపక్షాల బలం గణనీయంగా తగ్గిపోవడంతో ఈ బిల్లులు పాస్ కావడం దాదాపుగా ఖాయమైంది. 

సస్పెన్షన్ల పర్వం.. 

లోక్​సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి, రచ్చ చేసిన మరునాటి నుంచే పార్లమెంట్​లో ఎంపీల సస్పెన్షన్ల పర్వం మొదలైంది. ఆరోజు లోక్ సభలో సమావేశాలకు అంతరాయం కలిగిస్తూ, గందరగోళానికి కారణమైన 12 మందిని స్పీకర్​, రాజ్యసభలో ఒకరిని చైర్మన్ సస్పెండ్ చేశారు. సోమవారం కూడా అదే సీన్ రిపీట్ కావడంతో ఉభయసభల్లో ఏకంగా 78 మందిపై వేటు పడింది. లోక్​సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది సస్పెండ్ అయ్యారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం మరో 49 మంది సస్పెండ్ అయ్యారు. వీరిలో చాలా మంది ఎంపీలు ఈ వింటర్ సెషన్ మొత్తానికి సస్పెండ్ కాగా.. మరికొందరిపై ప్రివిలేజెస్ కమిటీ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోనున్నారు.