అమెరికా ఆఫర్.. నో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

అమెరికా ఆఫర్.. నో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ పై రష్యా మూడు రోజులుగా బాంబుల వర్షం కురిపిస్తోంది. దాదాపు 13 నగరాలపై పట్టు సాధించిన రష్యన్ ఆర్మీ.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి కూడా ఎంటరైంది. యుద్ధంలో పట్టుసడలుతున్నా.. ఉక్రెయిన్ ప్రెసిండెంట్ జెలన్స్కీ మాత్రం తన గుండె ధైర్యాన్ని వీడలేదు. సైనికుల్లో ఒకరిగా మెలుగుతూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. నైతిక బలాన్ని రెట్టింపు చేస్తూ.. శత్రు సైన్యం పోరాటంలో ముందుకు ఉరికిస్తున్నారు. భయంతో తలవంచేది లేదని, దేశం కోసం ప్రాణ త్యాగానైనా సిద్ధమని జెలెన్స్కీ స్పష్టం చేస్తున్నారు. రాజధాని కీవ్ లోకి రష్యా సైన్యం చొచ్చుకురావడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అమెరికా చేయి అందించేందుకు ముందుకొచ్చింది. జెలెన్స్కీని కాపాడి.. సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆయనకు చెప్పింది. తన చుట్టూ శత్రు సైన్యం కమ్ముకొస్తోందని తెలిసినా అగ్ర రాజ్యం ఇచ్చిన ఆఫర్ ను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తిరస్కరించారు.

పారిపోవడానికి ఫ్లైట్ కాదు.. ఆయుధాలు కావాలె

‘‘మా దేశంలో యుద్దం జరుగుతోంది. ప్రజలంతా పోరాటంలో భాగమవుతున్నారు. ఈ సమయంలో నాకు కావాల్సింది పారిపోవడానికి ఫ్లైట్ కాదు.. పోరాటంలో ముందుకు దూకడానికి ఆయుధాలు కావాలి’’ అంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్ ను జెలెన్స్కీ తిరస్కరించారని అమెరికా సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒకరు చెప్పినట్లు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఏపీ తెలిపింది.