ఐటీడీఏ రెగ్యులర్ పీవో నియామకంలో నిర్లక్ష్యం
మూడు నెలలుగా ఇన్చార్జితోనే నెట్టుకొస్తున్న సర్కార్
తాగునీటి కోసం తండ్లాడుతున్న గిరిజన గ్రామాలు
నామమాత్రంగా గ్రీవెన్స్ .. ఎక్కడి సమస్యలు అక్కడే
ఆదిలాబాద్, వెలుగు : ఉట్నూర్ ఐటీడీఏ పాలనను ప్రభుత్వం గాలికొదిలేసింది. పీఓ పోస్టును భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో బోర్లు ఎండిపోయాయి. మిషన్ భగీరత నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. పోడు భూముల దరఖాస్తులపై సమీక్షలు, విరాసత్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో పరిపాలనా వ్యవహారాలు , గిరిజన గ్రామాల్లో సమస్యలు ఉన్నా.. ఇక్కడ పీఓ పోస్ట్భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడ పీవో గా పనిచేసిన వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కలెక్లర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రెగ్యులర్ పీవోను నియమించాల్సిన ప్రభుత్వం మళ్లీ వరుణ్ రెడ్డికే ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది. పీవోగా వరుణ్ రెడ్డి గిరిజనుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ఏడు నెలలుగా పనిచేసిన ఆయనను బదిలీ చేయడం పట్ల అప్పట్లో గిరిజన సంఘాల నాయకులు వ్యతిరేకించారు. అయినా వరుణ్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో సమస్యలను రెగ్యులర్ గా తెలుసుకొనే ఆఫీసర్లు కరువయ్యారు.
వెంటాడుతున్న తాగునీటి సమస్య..
ఐటీడీఏ పరిధిలోని నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, సిరికొండ, గాదిగూడ, కెరమెరి, తిర్యాణి, లింగాపూర్ తదితర మండలాల్లోని దాదాపు 50 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. చేతిపంపుల్లో నీరు లేదు. మిషన్ భగీరథ నీరు సక్రమంగా అదడం లేదు. దీంతో కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్లి వాగులు, చెలిమెల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు.
నామమాత్రంగా గ్రీవెన్స్..
ప్రస్తుతం పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పట్లు చేస్తోంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 66 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గిరిజనులు1,24,521 ఎకరాలకు సంబంధించి 33,385 దరఖాస్తులు రాగా 32,119 మంది గిరిజనేతరుల నుంచి 1.02 ఎకరాల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల సీఏం కేసీఆర్ పోడు పట్టాలపై సంతకాలు చేయడంతో ఈనెలలో పట్టాల పంపిణీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఐటీడీఏ పీఓ దగ్గరుండి పర్యవేక్షించాలి. విరాసత్ హక్కు పత్రాలు దరఖాస్తులు దాదాపు 3 వేల వరకు పెండింగ్ లో ఉన్నాయి. అటు మూడు నెలలుగా ఐటీడీఏ గ్రీవెన్స్ నామ మాత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. పీవో కు బదులు కింది స్థాయి అధికారులు గ్రీవెన్స్ తీసుకోవడంతో ఆదివాసీలు సైతం అంతగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ పీవో ఉంటే తమగోడు వినేవారని చెబుతున్నారు. చిన్న సమస్యకూ, పెద్ద సమస్యకూ కలెక్టర్ దాకా వెళ్లడం ఇబ్బంది అవుతోందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం ఆదివాసీల సమస్యల కోసం అధికారులు చుట్టూ తిరగడం, ఆఫీసు ఎదుట ఆందోళనలు జరుగుతుంటాయి. ఈ సమయంలో ఉన్నతాధికారి అందుబాటులో లేకపోవడం వల్ల వారికి సరైన న్యాయం జరగడం లేదు.
పీవో ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి..
ఐటీడీఏ అంటే సపరేట్ వ్యవస్థ. ఆలాంటి వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గత కొన్ని నెలలుగా ఐటీడీఏకే పీవో ను నియమించడం లేదు. రెగ్యులర్ పీవో అందుబాటులో ఉంటేనే ఆదివాసీల సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం కలుగుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను పీవో గా నియమించాలి. ప్రస్తుతం పీవో లేరనే కారణంతో ఆదివాసీలు కూడా వారి సమస్య లు పరిష్కారం కావనే ఉద్దేశంతో కనీసం గ్రీవెన్స్ కూడా రావడంలేదు. ఇప్పటికే ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. పోడు భూములు, విరాసత్ హక్కు పత్రాల మార్పులు, తాగునీటి సమస్య వంటి పరష్కరించేందుకు పీవో అందుబాటులో ఉండాలి. - గొడం గణేష్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు