డ్రైవింగ్​ స్కూళ్ల ద్వారా టెస్ట్​లు సాధ్యమేనా?..కేంద్రం కొత్త మార్గదర్శకాలతో తలల పట్టుకుంటున్న అధికారులు 

డ్రైవింగ్​ స్కూళ్ల ద్వారా టెస్ట్​లు సాధ్యమేనా?..కేంద్రం కొత్త మార్గదర్శకాలతో తలల పట్టుకుంటున్న అధికారులు 
  • హైదరాబాద్​లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా మొదలైన ‘వాహన సారథి’
  • లైసెన్స్​జారీకి డ్రైవింగ్ టెస్ట్​లు డ్రైవింగ్ స్కూళ్లకు ఇవ్వాలన్న నిబంధనలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీఏ సేవల్లో మధ్యవర్తుల పని లేకుండా వాహనదారులకు నేరుగా సేవలు అందించేందుకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ పలు సంస్కరణలను ప్రవేశపెడుతున్నది. దేశ వ్యాప్తంగా ఒకే ఆర్టీఏ విధానం ఉండాలన్న లక్ష్యంతో అనేక మార్పులు తీసుకువస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ‘వాహన సారథి’ ప్రవేశ పెట్టింది. సిటీలోనూ ఇటీవల ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్​ఆర్టీఏ ఆఫీస్​లో ‘వాహన సారథి’ సేవలను ప్రారంభించింది.

డ్రైవింగ్​ లైసెన్స్​తో పాటు వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్​రెన్యూవల్, వాహనాల రిజిస్ట్రేషన్​ల బదిలీలు ఇలా అనేక రకాల సేవలను మధ్యవర్తులు పని లేకుండా నేరుగా ఆన్​లైన్​ద్వారానే అందిస్తున్నది. ఇంతవరకు ఇది బాగానే ఉన్నా డ్రైవింగ్ లైసెన్స్​ల జారీకి డ్రైవింగ్​స్కూళ్ల ద్వారా టెస్ట్​లు నిర్వహించే విధానాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్ర రవాణాశాఖ ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

దీంతో ఆర్టీఏ అధికారులు తలపట్టుకుంటున్నారు. డ్రైవింగ్​స్కూళ్ల ద్వారా టెస్ట్​ల నిర్వహణ ఏ మేరకు సాధ్యమవుతుందన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విధానాన్ని హైదరాబాద్​లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం టెస్టులు నిర్వహించేంత ప్రాంగణాలు డ్రైవింగ్ స్కూళ్లకు లేవని అంటున్నారు.

కేంద్ర మార్గదర్శకాల్లో ఏం ఉందంటే..?

కేంద్ర రవాణా శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో వాహనదారులు ఆర్టీఏ సేవలను పొందడానికి చాలా తక్కువ డాక్యుమెంట్లను సమర్పించేలా నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో డ్రైవింగ్​లైసెన్స్ పొందాలనుకునే వారు డ్రైవింగ్​టెస్ట్​లకు ఆర్టీఏ ఆఫీస్​కు వచ్చే పని లేకుండా డ్రైవింగ్​స్కూళ్లే వారికి టెస్టులు పెట్టి, ఒక సర్టిఫికెట్​ఇవ్వాలని, దానిని వారు ఆర్టీఏకు సమర్పిస్తే లైసెన్స్​జారీ చేయాలన్న నిబంధనను కేంద్ర మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అలాగే డ్రైవింగ్​టెస్ట్​లు నిర్వహించే స్కూళ్లకు ఆర్టీఏ సర్టిఫికెట్​లను జారీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ టెస్టులు నిర్వహించడానికి డ్రైవింగ్​స్కూళ్లకు  విశాలమైన ప్రాంగణాలు ఉండాలని, ముఖ్యంగా టూ వీలర్స్​, ఫోర్​ వీలర్ల డ్రైవింగ్​ టెస్ట్​లకు కనీసం ఎకరం స్థలం ఉండాలని, అలాగే బస్సులు, లారీలు వంటి హెవీ వెహికల్స్​ కు కనీసం రెండు ఎకరాలు ఉండాలన్న నిబంధన విధించారు. ఆయా డ్రైవింగ్​స్కూళ్లు కూడా తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. ట్రెయినర్​కనీసం డిప్లొమా కలిగి, కనీసం 5 ఏండ్ల అనుభం గలవారై ఉండాలి. 

ఒక్కరూ ముందుకు రాలే..

కేంద్ర మార్గదర్శకాలు వచ్చాక కనీసం ఒక్క డ్రైవింగ్​ స్కూల్​కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు ముందుకు రాలేదని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రిజిస్టర్ అయిన డ్రైవింగ్ స్కూళ్లు 150 నుంచి 175 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతుండగా, రిజిస్టర్ కానివి మరో 100 వరకు ఉన్నట్టు సమాచారం.

ఆర్టీఏ కూడా కనీసం ఈ మార్గదర్శకాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నా ఏ డ్రైవింగ్​ స్కూళ్లకు అంత స్థలం ఉందో తెలియదు. దీంతో డ్రైవింగ్​స్కూల్​ద్వారా డ్రైవింగ్​ టెస్ట్​లు సాధ్యమవుతుందా లేదా అన్న విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.