నష్టాలతో తగ్గిన ట్రేడింగ్ వాల్యూమ్స్‌‌‌‌

నష్టాలతో తగ్గిన ట్రేడింగ్ వాల్యూమ్స్‌‌‌‌

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: మార్కెట్‌‌‌‌లోకి కొత్తగా వచ్చిన  ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడం తగ్గించేశారు. సెన్సెక్స్‌ పెరుగుతున్నప్పుడు మార్కెట్‌‌‌‌లోకి పెద్ద మొత్తంలో ఎంట్రీ ఇచ్చినవారు,  ప్రస్తుతం వెనకడుగేస్తున్నారు.  కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో నిఫ్టీ 18,604 వద్ద ఆల్‌‌‌‌టైమ్ హైని టచ్ చేసింది. ఆ లెవెల్‌‌‌‌ నుంచి పడుతూ వస్తోంది.  ఈ టైమ్‌‌‌‌లో  ట్రేడింగ్‌‌‌‌ చేసిన, ఇన్వెస్ట్ చేసిన చాలా మంది కొత్త ఇన్వెస్టర్లు నష్టపోయారని మోతిలాల్‌‌‌‌ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. దీంతో వీరు మార్కెట్‌‌‌‌లకు దూరంగా ఉంటున్నారని తెలిపింది.  కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో  రోజుకి సగటున రూ. 81,400 కోట్ల విలువైన ట్రేడింగ్ ట్రాన్సాక్షన్లు జరగగా,  ప్రస్తుతం ఈ నెంబర్ రూ. 44,600 కోట్లకు పడిపోయింది. ఈ డేటా కేవలం క్యాష్ మార్కెట్‌‌‌‌ (కేవలం షేర్లు) కి సంబంధించినది మాత్రమే.  క్యాష్ మార్కెట్‌‌‌‌లో  ట్రేడింగ్ వాల్యూమ్స్‌‌‌‌ గత 9 తొమ్మిది నెలల్లోనే  45 శాతం మేర తగ్గిపోయాయి. నిఫ్టీ మిడ్‌‌‌‌క్యాప్ సెగ్మెంట్‌‌‌‌లో డైలీ యావరేజ్‌‌‌‌ ట్రేడింగ్ వాల్యూమ్స్‌‌‌‌ (కొన్న, అమ్మిన షేర్ల విలువ) 66 శాతం (రూ. 22,500 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు)  పడగా, స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌‌‌‌లో  52 శాతం (రూ. 6,700 కోట్ల నుంచి రూ. 3,200 కోట్లకు) తగ్గాయి. కొత్త ఇన్వెస్టర్లు ట్రేడింగ్ తగ్గించేయడమే ఇందుకు కారణం! 

తగ్గిన యాక్టివ్ ట్రేడర్లు..
మార్కెట్‌లో యాక్టివ్‌గా ట్రేడింగ్‌, ఇన్వెస్టింగ్ చేసేవారు తగ్గిపోతున్నారు. ఈ ఏడాది మే నెలలో  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ, బీఎస్‌‌‌‌ఈలలోని యాక్టివ్ ట్రేడర్లు కోటి మంది కంటే దిగువకు పడ్డారు.   కిందటేడాది చాలా మంది ఇన్వెస్టర్లకు ఈజీగా లాభాలొచ్చాయని, దీంతో చాలా మంది ట్రేడర్లు లెవరేజ్‌‌‌‌ (బ్రోకర్ ఇచ్చే అప్పు) వాడుకొని మరీ మార్కెట్‌‌‌‌లోకి ఎంటర్ అయ్యారని నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్‌‌‌‌లు పడుతుండడంతో పాటు, లెవరేజ్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను సెబీ కఠినతరం చేయడంతో ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌‌‌‌ తగ్గిపోతున్నాయని అన్నారు.

సెన్సెక్స్‌‌‌‌ 617 పాయింట్లు పైకి..
క్రూడాయిల్ రేట్లు తగ్గుతుండడంతో పాటు, ఫారిన్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు తిరిగి మార్కెట్‌‌‌‌లోకి ఎంటర్ అవ్వడంతో దేశ మార్కెట్‌‌‌‌లు బుధవారం భారీగా పెరిగాయి. సెన్సెక్స్‌‌‌‌ 617 పాయింట్లు (1.16%) లాభపడి 53,751 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 15,990 వద్ద ముగిసింది. ‘ఆయిల్‌‌‌‌ ధరలు మంగళవారం 10 % క్రాష్ అయ్యాయి. ఆయిల్‌‌‌‌ను ఎక్కువగా వాడే కెమికల్స్‌‌‌‌, లాజిస్టిక్స్‌‌‌‌ వంటి వివిధ సెక్టార్లలో ఖర్చులు దిగొస్తాయి’ అని జియోజిత్‌‌‌‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. బీఎస్‌‌‌‌ఈ మిడ్‌‌‌‌క్యాప్ బుధవారం 1.76% పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌‌‌ 0.94 % లాభపడింది. కాగా, మంగళవారం (జులై 5) సెషన్‌‌‌‌లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.1,296 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.