దేశంలో పెరుగుతున్నకొత్త వేరియంట్ కేసులు

దేశంలో పెరుగుతున్నకొత్త వేరియంట్ కేసులు
  • దేశంలో 795 మందికి యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్ కరోనా
  • ఒక్క పంజాబ్​లోనే 326 మందికి కొత్త వేరియంట్ వైరస్
  • యువతకు కూడా వ్యాక్సిన్లు వేయండి: అమరీందర్ సింగ్

న్యూఢిల్లీ: కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంటే.. కొత్త వేరియంట్ల వ్యాప్తి మరింతగా భయపెడుతోంది. దేశంలో ఇప్పటిదాకా 795 మందికి యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్ కరోనా సోకితే.. ఇందులో 395 మంది గత ఐదు రోజుల్లోనే ఎఫెక్ట్ అయ్యారు. ఈనెల 18 నుంచి కేసులు భారీగా పెరిగాయి. ఇక మొత్తం కేసుల్లో 326కు పైగా పంజాబ్​లోనే నమోదయ్యాయి. మరోవైపు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం తాము 400 కరోనా శాంపిల్స్ పంపామని, అందులో 81 శాతం కేసులు యూకే స్ర్టెయిన్ అని తేలిందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం చెప్పారు. వ్యాక్సినేషన్ పరిధి పెంచాలని, కరోనా ట్రాన్స్​మిషన్ చైన్​ను బ్రేక్ చేసేందుకు యువతకు కూడా వ్యాక్సిన్లు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కోరారు. భారీ సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యూకే వేరియంట్ విషయంలో కొవిషీల్డ్ ఎఫెక్టివ్​గా పని చేస్తుందని ఎక్స్​పర్టులు చెబుతున్నారన్నారు. ప్రజలు కరోనా రూల్స్ ఫాలో కాకపోతే మరిన్ని కఠిన ఆంక్షలు పెడుతామని చెప్పారు.
హోం మినిస్ట్రీ కొత్త గైడ్​లైన్స్
కరోనా నియంత్రణ, జాగ్రత్తల కోసం కేంద్ర హోం శాఖ మంగళవారం కొత్త గైడ్​లైన్స్ రిలీజ్ చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుండి 30 దాకా అమల్లో ఉంటాయని తెలిపింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్​ను కచ్చితంగా ఫాలో కావాలని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్​లో స్పీడ్ పెంచాలని సూచించింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచా లని స్పష్టంచేసింది. కొత్తగా వైరస్ బారిన పడిన వారిని వెంటనే ఐసోలేట్ చేయాలని, అవసరమైన ట్రీట్​మెంట్ అందించాలని చెప్పింది.

కొత్త గైడ్ లైన్స్‌లో కొన్ని..

  • పెరుగుతున్న కేసులకు తగ్గట్లుగా ఆర్టీపీసీఆర్​ టెస్టుల సంఖ్య పెంచాలె
  • పాజిటివ్​ వచ్చినోళ్లను ఐసోలేషన్, క్వారంటైన్​ చేసి ట్రీట్​మెంట్​ అందించాలె
  • వారు కలిసినోళ్లను వీలైనంత తొందరగా గుర్తించి, టెస్ట్​ చేయాలె
  • కంటెయిన్​మెంట్​ జోన్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్​సైట్​లలో అప్​డేట్​ చేయాలె
  • ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖకు కలెక్టర్లు రెగ్యులర్​గా వివరాలు అందించాలె
  • కంటెయిన్​మెంట్​ జోన్లలో కరోనా ప్రొటోకాల్​ను స్ట్రిక్ట్​ గా అమలుచేయాలె
  • బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట, జనాలు ఎక్కువగా ఉండేచోట రూల్స్ పాటించనోళ్లకు ఫైన్లు వేయాలె
  • కేసులు వేగంగా పెరుగుతున్న చోట అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించుకోవచ్చు
  • కంటెయిన్​మెంట్​ జోన్ల పరిధి మినహా మిగతాచోట్లలోని పార్కులు, జిమ్​లు, ఎగ్జిబిషన్స్, హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు.