ఎలక్షన్‌‌ ఇయర్​లోకి ఎంట్రీ

ఎలక్షన్‌‌ ఇయర్​లోకి ఎంట్రీ
  • ఎలక్షన్‌‌ ఇయర్​లోకి ఎంట్రీ
  • ఈ ఏడాదే అసెంబ్లీ పోరు
  • డిసెంబర్​లోనేనా.. ఇంకా ముందా అనే చర్చ
  • బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ, కాంగ్రెస్‌‌ పోటా పోటీ వ్యూహాలు
  • సై అంటున్న బీఎస్పీ, వైఎస్సార్​టీపీ
  • యాక్టివ్‌‌ అయిన టీడీపీ, జనసేన

హైదరాబాద్, వెలుగు:  ఎలక్షన్‌‌ ఇయర్‌‌ వచ్చేసింది. రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్​ఎస్​.. ఇప్పుడు బీఆర్‌‌ఎస్​గా పేరు మార్చుకొని బరిలోకి దిగుతున్నది. కేసీఆర్‌‌ సర్కార్​ను గద్దె దించి తీరుతామని బీజేపీ, కాంగ్రెస్‌‌ పోటాపోటీగా ఎలక్షన్​ గ్రౌండ్‌‌లోకి దిగుతున్నాయి. షెడ్యూల్‌‌ ప్రకారం 2023 డిసెంబర్‌‌ మొదటివారంలోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ వార్‌‌  డిసెంబర్​లోనే  ఉంటుందా.. ముందస్తుగా జరుగుతుందా.. అనే చర్చ పొలిటికల్‌‌ సర్కిల్స్‌‌లో జోరుగా సాగుతున్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొంటామని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. పాదయాత్రలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో ముందుకు వెళ్తున్నాయి.  శంకుస్థాపనలు, ఉద్యోగ ప్రకటనలు, స్కీముల పేరుతో అధికార పార్టీ లీడర్లు కూడా బిజీగా ఉంటున్నారు. బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​తోపాటు వైఎస్సార్​ తెలంగాణ పార్టీ,  బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్పీ), టీడీపీ, జనసేన తదితర పార్టీలు కూడా పోటీకి సై అంటున్నాయి. పొత్తులతో ముందుకు వెళ్లాలని లెఫ్ట్​ పార్టీలు యోచిస్తున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందని పార్టీలతోపాటు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న లీడర్లు సర్వేలు చేయించుకుంటున్నారు.  

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో బీఆర్​ఎస్

మూడు, నాలుగు నెలల నుంచి బీఆర్​ఎస్​ లీడర్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరిట జనంలో తిరుగుతున్నారు.  సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు.  కొత్త సెక్రటేరియెట్,  అమరవీరుల స్మారక చిహ్నం, థర్మల్​ విద్యుత్​ ప్లాంట్ల పనులు పరిశీలించడమే కాకుండా టార్గెట్​ పెట్టి నిర్మాణాలను పూర్తి చేయిస్తున్నారు. డబుల్​ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.  వరుస పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్స్​కు సంబంధించి అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. సరిగ్గా ఎలక్షన్​ క్యాంపెయిన్​ టైమ్​ నాటికి  పరీక్షలు జరిగేలా ప్లాన్​ చేస్తున్నారు.

పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ‘హాత్​ సే హాత్​ జోడో అభియాన్’​ పాదయాత్రతో ముందుకు వెళ్తున్నారు. ఈ నెల 26న భద్రాచలంలో  ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జూన్​, జూలై వరకు కొనసాగించాలని భావిస్తున్నారు. ఇటీవల రాహుల్​ గాంధీ పాదయాత్రతో కేడర్​లో జోష్​ పెరిగింది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ప్రజాబలం ఉన్న లీడర్లను మరింత స్ర్టాంగ్​ చేసేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు.. ఇతర పార్టీల నుంచి కేడర్​ను చేర్చుకునేలా కాంగ్రెస్​ ప్లాన్​ చేస్తున్నది.

క్షేత్రస్థాయిలో వైఎస్సార్​టీపీ, బీఎస్పీ

వైఎస్సార్​ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్​ షర్మిల.. కొన్నాళ్లుగా రాష్ట్రంలో  పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఐపీఎస్​ నుంచి వీఆర్​ఎస్​ తీసుకున్న ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ బీఎస్పీ రాష్ట్ర ప్రెసిడెంట్​గా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడు బై ఎలక్షన్స్​లో ఆ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టారు. మునుగోడు బైపోల్​లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్  కూడా వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు.

టీడీపీ, జనసేన యాక్టివ్​

2018 ఎలక్షన్స్​ తర్వాత నుంచి నాలుగేండ్లుగా రాష్ట్రంలో చడీచప్పుడు చేయని టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు యాక్టివ్​ అవుతున్నాయి. ఇటీవల ఖమ్మంలో టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. దీనికి చంద్రబాబు హాజరై..  పార్టీ నుంచి వెళ్లిపోయినవాళ్లు తిరిగి రావాలని ఆహ్వానించారు. దీని ద్వారా ఈసారి కూడా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో  నిలుస్తున్నామనే సంకేతాలను టీడీపీ పంపింది. జనసేన కూడా రాష్ట్రంలో 32 నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను ప్రకటించింది. రాష్ట్రంలో పర్యటించేందుకు  జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. 

బీజేపీ ఎలక్షన్​ క్యాలెండర్​ రెడీ 

కొన్నాళ్లుగా రాష్ట్రంలో బీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ  అన్నట్లుగా పొలిటికల్​ హీట్​ నడుస్తున్నది. రానున్న ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు గట్టి దెబ్బకొట్టాలని, రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం పక్కా ప్లాన్​తో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​   ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఐదు విడతలు పూర్తిచేసుకుంది. బీజేపీ జాతీయ స్థాయి సమావేశాలు కూడా హైదరాబాద్​లోనే నిర్వహించారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కేలండర్‌‌‌‌ను బీజేపీ  సిద్ధం చేసింది. ‘కేసీఆర్‌‌‌‌ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో భవిష్యత్‌‌‌‌ కార్యాచరణను రూపొందించింది. రాష్ట్రంలోని 119 సీట్లలో సంస్థాగతంగా, రాజకీయంగా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేసింది. పదినెలల  రోడ్‌‌‌‌ మ్యాప్​లో భాగంగా  నాలుగు నెలల రోడ్​మ్యాప్​ను సిద్ధం చేసింది. ‘మిషన్‌‌‌‌ 90’ టార్గెట్​గా కదులుతున్నది. ఫిబ్రవరిలో రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేలా బీజేపీ  ఏర్పాట్లు చేస్తున్నది.