NZ vs PAK: దేశం మారుతున్నా పరాజయాలు తప్పట్లేదు: న్యూజిలాండ్‌పై రెండో టీ20 ఓడిన పాకిస్థాన్

NZ vs PAK: దేశం మారుతున్నా పరాజయాలు తప్పట్లేదు: న్యూజిలాండ్‌పై రెండో టీ20 ఓడిన పాకిస్థాన్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత పాకిస్థాన్ కు ఏదీ కలిసి రావడం లేదు. వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరడంలో విఫలమైన పాక్.. ఆసీస్ తో సిరీస్ కు ముందు జట్టును ప్రక్షాళన చేసింది. చీఫ్ సెలక్టర్ గా వహాబ్ రియాజ్, డైరెక్టర్ గా మహమ్మద్ హఫీజ్ ను నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. పాక్ క్రికెట్ లో ఇన్ని భారీ మార్పులు జరిగినా పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆసీస్ తో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత న్యూజిలాండ్ వెళ్లిన పాక్ తొలి రెండు టీ20 ఓడిపోయింది. 

హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టీ20లో 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై పాక్ ఓడిపోయింది. 195 పరుగుల లక్ష్య ఛేదనలో బాబర్ అజామ్, ఫకర్ జమాన్ పోరాడినా మిగిలిన వారు విఫలం కావడంతో పాక్ కు పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్(67 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) తన ఫామ్ ను కొనసాగిస్తూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(26), మిచెల్ సాంట్నర్(25) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్(3/38) మూడు వికెట్లు తీయగా.. అబ్బాస్ అఫ్రిది(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆమెర్ జమాల్(1/42), ఉసమా మీర్(1/39)తలో వికెట్ తీసారు.        

భారీ లక్ష్యచేధనలో పాక్ 19.3 ఓవర్లలో 173 పరుగులకే పరిమితమైంది. నెంబర్ 3 లో బాబర్ ఆజామ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) మరోసారి మెరుగైన ఇన్నింగ్స్ ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఫకార్ జమాన్(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పినా..ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే(4/33) నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ(2/31), బెన్ సీర్స్(2/28), ఇష్ సోధీ(2/33) రెండేసి వికెట్లు తీసుకున్నారు. 5 టీ20 ల సిరీస్ లో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది.