
- పీఎం ప్రయారిటీ లిస్టులో చేర్చడంతో పనులు స్పీడప్
- 131.8 కిలోమీటర్ల పొడవు.. నాలుగు ప్యాకేజీలు
- ఆరు టౌన్లలో భారీ బైపాస్‌ల నిర్మాణానికి ప్లాన్
- గుదిబండగా మారిన భూసేకరణ ప్రక్రియ
మంచిర్యాల, వెలుగు: నేషనల్ హైవే 63లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్‌హైవే నిర్మాణానికి లైన్‌క్లియర్ అయ్యింది. గత ఎనిమిదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును ఇటీవల పీఎం ప్రయారిటీ లిస్టులో చేర్చడంతో పనులు స్పీడప్ కానున్నాయి. దేశవ్యాప్తంగా జాప్యం జరుగుతున్న కీలక హైవేలను వేగంగా పూర్తిచేయడంపై పీఎం ఆఫీస్ ఫోకస్ పెట్టింది. దాదాపు3 వేల కిలోమీటర్ల రోడ్లను గుర్తించి ఇందులో ఎన్ హెచ్63ని చేర్చారు. దీంతో ఇన్నాండ్లు గుదిబండగా మారిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు నేషనల్ హైవేస్అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మూడుసార్లు మారిన అలైన్మెంట్
కేంద్ర ప్రభుత్వం 2017–18లో ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను శాంక్షన్ చేసింది. పూర్తిగా వ్యవసాయ భూముల్లోంచి నిర్మించేలా ఎన్ హెచ్ఏఐ అధికారులు అలైన్మెంట్ రూపొందించారు. భూసేకరణ విషయంలో రైతుల నుంచి తిరుగుబాటు రావడంతో బ్రౌన్‌ఫీల్డ్(ప్రస్తుత రోడ్డు విస్తరణ) హైవే నిర్మాణానికి మరో అలైన్మెంట్తయారుచేశారు. రోడ్డును ఆనుకొని ఉన్న విలువైన భూములు ఇవ్వబోమంటూ ప్రజలు ఆందోళనలకు దిగడం, రోడ్డు పక్కన భారీ వాటర్పైపులైన్లు ఉండడంతో ఆ ప్లాన్‌ను విరమించుకున్నారు. మూడోసారి గోదావరి తీర ప్రాంతం నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి అలైన్మెంట్రూపొందించి కేంద్రానికి పంపగా ఆమోదం లభించింది.
కానీ మంచిర్యాల జిల్లాలోని రైతులు భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే ఓసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన తాము మిగిలిన భూములను గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ఇస్తే రోడ్డున పడుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి భూములు కోల్పోయిన రైతుల నుంచి రెండోసారి భూములు తీసుకొవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఆధారం చేసుకొని కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కీలకమైన ఈ సమస్యను పరిష్కరిస్తే తప్ప రోడ్డు పనులు ముందుకెళ్లే చాన్స్కనిపించడం లేదు.
నాలుగు ప్యాకేజీలుగా నిర్మాణం
ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 131.8 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేను నాలుగు ప్యాకేజీలుగా నిర్మించే అవకాశముంది. ఆర్మూర్ నుంచి మెట్పల్లి వరకు 35.9 కిలోమీటర్లు, అక్కడి నుంచి జగిత్యాల వరకు 28.7 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి రాయపట్నం వరకు 31.9 కిలోమీటర్లు, అక్కడి నుంచి మంచిర్యాల వరకు 35.4 కిలోమీటర్లు నిర్మించనున్నారు. 131 కిలోమీటర్ల పరిధిలో ఆర్మూర్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల టౌన్లు ఉండడంతో ఒక్కో చోట కనీసం ఆరు నుంచి 12 కిలోమీటర్ల వరకు బైపాస్‌ల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే మరో ఎనిమిది చోట్ల చిన్న బైపాస్‌లు వచ్చే చాన్స్ఉంది.
కాగా, ఈ హైవేను యాక్సెస్ కంట్రోల్డ్‌గా నిర్మించాలన్న ప్రపోజల్స్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించలేదు. ఒకవేళ యాక్సెస్ కంట్రోల్డ్తరహాలో నిర్మిస్తే నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వెహికల్స్ రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో టోల్ రెవెన్యూ తగ్గుతుందనే అంచనాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.5 వేల కోట్లతో నిర్మించే ఈ రోడ్డు పనులను రానున్న మూడేండ్లలో కంప్లీట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఇది పూర్తయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాల నడుమ రవాణా సౌకర్యం మరింత మెరుగయ్యే అవకాశముంది.