హక్కుల రక్షణకు ఎన్​హెచ్​ఆర్​​సీ

హక్కుల రక్షణకు ఎన్​హెచ్​ఆర్​​సీ

ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని, అతని హక్కులకు భంగం కలిగించినా, అన్యాయంగా ఎన్‌కౌంటర్‌‌ల పేరిట చంపినా ప్రశ్నించేందుకు రాజ్యాంగం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తప్పు చేసిన ఏ వ్యక్తినైనా చట్టపరంగానే శిక్షించాలి కానీ చట్టాన్ని తీసుకుని ఏ విధమైన చర్యలు పాల్పడరాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారిస్తుంది.

తాజాగా రాష్ట్రంలో దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. అసలు మానవ హక్కుల కమిషన్ పరిధి, అధికారులు, విధులు, కమిషన్ నిర్మాణం, సభ్యులు, ఎంపిక విధానం తదితర అంశాలన్నీ ఒకేచోట.. 1992లో జరిగిన జెనీవా మానవహక్కుల సదస్సు హక్కుల పరిరక్షణకై అన్ని దేశాలు కలిసి  ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే భారత్​లో మానవహక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. భారతదేశంలోని మానవ హక్కుల సంస్థలు హక్కుల పరిరక్షణకు ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి.

ఈ క్రమంలో జెనీవా సదస్సు పిలుపుననుసరించి 1993లో భారత పార్లమెంటు మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్​ (ఎన్​హెచ్​ఆర్​సీ) ఏర్పాటైంది. ఈ కమిషన్​ రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా ప్రజలకు కల్పించిన హక్కుల రక్షణ భాద్యతలు చేపడుతుంది. భారత పార్లమెంటు రూపొందించిన అనేక చట్టాల్లోనూ మానవ హక్కులు కలవు. ఉదాహరణకు వెట్టి చాకిరి నిర్మూలనా చట్టం, కనీస వేతనాల చట్టం, మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టం, బాలకార్మిక నిషేద చట్టం, విద్యాహక్కు చట్టం మొదలైన చట్టాలు మానవ హక్కులను కాపాడటానికి ఉపయోగపడుతున్నాయి.

పరిమితులు

మానవ హక్కుల కమిషన్​కు ప్రధానంగా సిఫార్సులకు సంబంధించిన విధులే ఉంటాయి. మానవ హక్కులను ఉల్లంఘించిన వారిని శిక్షించే అధికారం కమిషన్​కు లేదు. బాధితులకు ఆర్థిక సాయం చేసే అధికారం లేదు. గమనించవల్సిన విషయం ఏమిటంటే కమిషన్​ సిఫార్సులను సంబంధిత ప్రభుత్వాలు కానీ అధికారిక సంస్థలు కానీ తప్పకుండా పట్టించుకోవాలన్న నిబంధన ఏమీ లేదు. అయితే దాని సిఫార్సుల మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నెలలోపు తెలపాల్సి ఉంటుంది. అయితే కమిషన్​ సిఫార్సులను ప్రభుత్వాలు పూర్తిగా ఉపేక్షించరాదు. సాయుధ దళాల సభ్యుల మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన విషయాల్లో కమిషన్​కు పరిమితమైన అధికారాలు ఉన్నాయి. కమిషన్​ సలహాపూర్వకమైంది. చర్యలకై సూచనలిస్తుంది. కాని నేరుగా ఏ చర్యలను చేపట్టలేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్​ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. దాన్ని రాష్ట్రపతి పార్లమెంటు ముందుంచుతారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషనే కాక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ కూడా ఏర్పాటైంది. ఈ చట్టాన్ని అనుసరించి అనేక రాష్ట్రాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను ఏర్పాటు చేసుకున్నాయి. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో ఉన్న రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలకి సంబంధించిన మానవహక్కుల ఉల్లంఘనల గూరించి మాత్రమే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేయగలుగుతుంది. అయితే సంబంధిత అంశంపై అప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్​ విచారణ చేపట్టి ఉంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సదరు అంశంపై విచారణ చేయదు.

నిర్మాణం: 1993 లో పార్లమెంటు రూపొందించిన మానవహక్కుల పరిరక్షణ చట్టాన్ని 2006 లో సవరించారు. ఈ సవరణ ప్రకారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ సభ్యుల సంఖ్యను 5 నుండి 3 కు తగ్గించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ ఒక బహుసభ్య సంస్థ. ఇందులో ఒక చైర్​పర్సన్​, ఇద్దరు సభ్యులు ఉంటారు. రాష్ట్ర హైకోర్టు నుండి పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి కమిషన్ చైర్​పర్సన్​​గా నియమించబడతాడు. ఒక సభ్యుడు హైకోర్టు ప్రస్తుత లేదా పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి అయి ఉండాలి. మరో సభ్యుడు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. కమిషన్ చైర్​పర్సన్​​, సభ్యులను సంబంధిత రాష్ట్ర గవర్నర్​ నియమిస్తాడు.

ముఖ్యమంత్రి అద్యక్షతన ఏర్పడే ఆరుగురు సభ్యుల అత్యున్నత అధికారిక కమిటీ వీరి నియామకంపై గవర్నర్​కు సలహానిస్తుంది. వీరి సలహామేరకే ఈ కమిషన్​ను ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో కమిటీ: చైర్మన్​గా ముఖ్యమంత్రి, సభ్యులుగా రాష్ట్ర హోంమంత్రి, విధాన సభ స్పీకర్​, విధాన సభ ప్రతిపక్ష నేత, ఒకవేళ రాష్ట్రంలో రెండవ సభ ఉంటే అనగా విధాన పరిషత్​ ఉన్నట్లైతే పరిషత్​ చైర్మన్​, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఈ కమిటీలో చేర్చవచ్చు.

పదవీకాలం: చైర్​పర్సన్​, సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయస్సు(ఏది ముందు అయితే అది) ఉంటుంది. నియమించే అధికారం గవర్నర్​కు ఉన్నా తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతికి ఉంటుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్​ చైర్మన్,​ సభ్యులను తొలగించే పద్దతిలోనే వీరిని కూడా తొలగిస్తారు.

విధులు: ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా, సమిష్టిగానూ సమాజంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్న తీరుపై విచారించి ఆ హక్కుల పరిరక్షణకు చర్యలు సూచించడమే కమిషన్ ప్రధాన కర్తవ్యం. రాష్ట్రంలో మానవ హక్కుల కాపలాదారుగా రాష్ట్ర మానవ హక్కుల కమిషనే వ్యవహరిస్తుంది. ఈ కమిషన్​కు కూడా సుమోటో అధికారాలు ఉంటాయి. జాతీయ స్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఉన్న అధికారాలు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఉంటాయి.

పరిమితులు: ఒక సంవత్సరానికి సంబంధించిన కేసులనే విచారిస్తుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ కూడా చర్యలకు సిఫార్సు మాత్రమే చేయగలదు కానీ శిక్షించే అధికారం లేదు.

కమిషన్​ నిర్మాణం

మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్​(ఎన్​హెచ్ఆర్​సీ) 1993 అక్టోబర్​ 12న ఏర్పాటైంది. నాటి ప్రదాన మంత్రి పీవీ నర్సింహారావు హయాంలో ఈ కమిషన్ ఏర్పాటైంది. 1993 మానవ హక్కుల చట్టాన్ని 2006 సంవత్సరంలో సవరించి కొన్ని మార్పులు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్​ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి గల సంస్థ మాత్రమే కాని రాజ్యాంగబద్దమైన సంస్థ కాదు.

కమిషన్ నిర్మాణం: జాతీయ మానవహక్కుల కమిషన్​లో ఒక చైర్మన్​, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.  దీనికి చైర్మన్​గా నియమించబడే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి. 2010లో జాతీయ మానవ హక్కుల కమిషన్​లో చేసిన సవరణలను అనుసరించి చైర్మన్​గా పనిచేయుటకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అందుబాటులో లేనప్పుడు సుప్రీం కోర్టులో సాధారణ న్యాయమూర్తిగా రిటైర్డ్​ అయిన వ్యక్తినైనా నియమించవచ్చు.

వీరిలో ఒక సభ్యుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి. మరో సభ్యుడు ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి. మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో అనుభవజ్ఞులై ఉండాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్​హెచ్​ఆర్​సీ) చైర్మన్​ సభ్యులను ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు.

కమిటీ: ఎన్​హెచ్​ఆర్​సీ చైర్మన్​, సభ్యులను ఎన్నుకోవడానికి ఏర్పడే సలహా కమిటీకి చైర్మన్​గా ప్రధానమంత్రి, సభ్యులుగా కేంద్ర హోంమంత్రి, లోక్​సభ స్పీకర్,​ లోక్​సభ ప్రతిపక్ష నేత, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్​, రాజ్యసభ ప్రతిపక్ష నేత వ్యవహరిస్తారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా.

పదవీ కాలం: కమిషన్​ చైర్మన్, సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా వారికి 70 ఏళ్ల వయసు (ఏది ముందైతే అది వర్తిస్తుంది) ఉంటుంది. వీరు పదవీ విరమణ తర్వాత కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎటువంటి లాభదాయక పదవిని చేపట్టరాదు. పదవీకాలం ముగియక ముందే అసమర్థత, దుష్ర్పవర్తన కారణాలపై రాష్ట్రపతికి (యూపీఎస్సీ సభ్యులను తొలగించే పద్ధతిలోనే) వీరిని తొలగించే అధికారం ఉంటుంది.

అధికారాలు–విధులు

ఈ కమిషన్​ ఒక సెమీ జ్యుడీషియల్​ వ్యవస్థగా పనిచేస్తుంది. దేశంలో ఎక్కడైనా మానవహక్కుల ఉల్లంఘనకు గురైతే బాధితుడు కమిషన్​ను సంప్రదించవచ్చు. అదేవిధంగా భాదితుని పక్షాన వేరే వ్యక్తి పిటిషన్​ వేసినట్లైతే, దాన్ని స్వీకరించి కమిషన్​ విచారిస్తుంది. కొన్ని సార్లు కమిషనే సుమోటో వ్యాజ్యంగా తనంతట తానుగా జోక్యం చేసుకొని విచారణ చేపడుతుంది. మానవహక్కుల అమలుకు సంబంధించి ఏ వ్యక్తి నుండైనా, అధికారి నుండైనా వాంగ్మూలాలను సేకరించవచ్చు, కమిషన్​ ముందు హాజరుకావాలని ఆదేశించవచ్చు.

చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలుకు సంబంధించిన అంశాలపై విచారణ చేయవచ్చు. జైళ్లను లేదా ఇతర నిర్బంధ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ నిర్బంధంలో ఉన్న వారికి కనీస సౌకర్యాల అమలు గూర్చి విచారించి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల విచారణకు కమిషన్ న్యాయస్థానాల అనుమతి పొందాల్సి ఉంటుంది. ఉదాహరణకు గోద్రా అల్లర్ల కేసులను విచారించడం.

మానవ హక్కులపై ప్రజల్లో అవగాహన, స్పృహను కల్పించడానికి సెమినార్లు, సభలు నిర్వహిస్తుంది. మానవ హక్కుల పరిరక్షణకై కృషి చేసే ఎన్​జీవోలను, పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మానవహక్కుల ఉల్లంఘనకు గురైన వ్యక్తికి నష్ట పరిహారం చెల్లించాలని సంబంధిత ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు. 2005లో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ జస్టిస్​ సుభాషణ్​ రెడ్డి చైర్మన్​గా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్​ 28న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఛైర్మన్​, సభ్యులను నియమించాల్సి ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్​లో పదవీ రీత్యా నలుగురు సభ్యులు. నేషనల్​ ఎస్సీ కమిషన్​ చైర్​పర్సన్,​  నేషనల్​ ఎస్టీ కమిషన్ చైర్​పర్సన్,​ నేషనల్​ మైనార్టీ కమిషన్​ చైర్​పర్సన్​, నేషనల్​ మహిళా కమిషన్​ చైర్​పర్సన్​.                                                                               వి. కొండల్ సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్