
‘వెలుగు’తో నిఖత్ జరీన్
నిఖత్ జరీన్. కొన్నాళ్లుగా ఇండియా బాక్సింగ్ లో మార్మోగుతున్న పేరు. అంచనాలే లేకుండా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ఈ తెలంగాణ అమ్మాయి తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ గోల్డెన్ పంచ్ విసిరింది. అంతకుముందు స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో బంగారు పతకం నెగ్గి రికార్డు సృష్టించిన నిఖత్ ఈ ఏడాది తనకు బాగా కలిసివచ్చిందని చెబుతోంది. కామన్వెల్త్‌లో గోల్డ్ నెగ్గడం కంటే ఈ గేమ్స్ కోసం వెయిట్ కేటగిరీ మార్చుకునేందుకే ఎక్కువ కష్టపడ్డానని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీని కలవడం తన జీవితంలో గుర్తుండిపోయే క్షణం అని, ఆయన చెప్పిన మాటలు మరిన్ని పతకాలు సాధించేలా స్ఫూర్తినిచ్చాయని చెప్పింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ నెగ్గడం తన చిరకాల స్వప్నం అంటున్న నిఖత్ ‘వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్, కామన్వెల్త్‌తో పాటు తన గోల్స్, ఫ్యామిలీ గురించి నిఖత్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..
(హైదరాబాద్, వెలుగు) కామన్వెల్త్‌లో పోటీ పడ్డ మొదటి సారే, అది కూడా కొత్త వెయిట్ కేటగిరీలో గోల్డ్ నెగ్గడం చాలా సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను వరల్డ్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ అవుతానని ఊహించలేదు. ఒకసారి రింగ్‌లో అడుగు పెట్టాక వంద శాతం ప్రయత్నం చేయాలి.. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించడమే నాకు తెలిసింది. వరల్డ్ చాంపియన్‌షిప్ తర్వాత నాపై అంచనాలు పెరిగాయి. అవి నాపై ఒత్తిడి ఏమీ పెంచలేదు. ఎందుకంటే ప్రజలు నేను వరల్డ్ చాంపియన్ అవ్వాలనుకున్నారు. నేను కూడా అదే కోరుకున్నా. నిజం చెప్పాలంటే ప్రజలు, అభిమానుల కంటే నాపై నేనే ఎక్కువ అంచనాలు పెట్టుకుంటా. నేను వరల్డ్ చాంపియన్‌గా కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లాను. కాబట్టి రింగ్‌లోకి వచ్చిన ప్రతీసారి వరల్డ్ చాంపియన్ మాదిరిగానే ఆడాను. అన్ని బౌట్లలో ఏకగ్రీవ విజయాలు (5–0) సాధించాలన్నది నా ప్రణాళిక. అనుకున్నది సాధించినందుకు హ్యాపీ. పైగా, గోల్డ్ మెడల్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తానని మా అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు మరింత ఆనందంగా ఉంది. ఇంటికి రాగానే మెడల్‌ను అమ్మ మెడలో వేశా. తను చాలా సంతోషించింది. తర్వాత అమ్మ చేసిన బిర్యానీ తిని సెలబ్రేట్ చేసుకున్నాం.
వెయిట్ మారడమే పెద్ద సవాల్
వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో 52 కేజీ కేటగిరీలో గోల్డ్ నెగ్గిన వెంటనే కామన్వెల్త్ కోసం 50 కేజీ కేటగిరీకి మారడంలోనే నాకు అది పెద్ద చాలెంజ్ ఎదురైంది. వెయిట్ తగ్గేందుకు నోరు కట్టేసుకోవాల్సి వచ్చింది. అమ్మ చేసే బిర్యానీతో పాటు ఐస్‌క్రీం త్యాగం చేయాల్సి వచ్చింది. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ వెయిట్ తగ్గాను. అదే సమయంలో మంచి డైట్ తీసుకోవడంతోనే కామన్వెల్త్‌లో బాగా ఆడగలిగాను.
ట్రయల్స్‌కు ఎప్పుడూ రెడీనే
పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఇదే కేటగిరీలో పోటీ పడాలని అనుకుంటున్నా. కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీ కేటగిరీలో గోల్డ్ నెగ్గిన నీతూ ఘాంఘస్ కూడా నా కేటగిరీలోకి వస్తుంది కాబట్టి మున్ముందు ఆమెతో పోటీ ఎదురవ్వొచ్చు. నీతూ మాత్రమే కాదు వరల్డ్ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ మంజు రాణి కూడా రేసులో ఉంది. మేజర్ ఈవెంట్లకు ముందు ఎవ్వరైనా ట్రయల్స్‌లో పోటీ పడాలి. కాబట్టి ట్రయల్స్‌కు నేను ఎప్పుడైనా రెడీ. నాకు వేరే ఆప్షన్ లేదు.
ఇలాంటి పీఎంను చూడలేదు
కామన్వెల్త్ తర్వాత పీఎం మోడీ సర్‌ను కలిసిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నా కాంపిటీషన్, అనుభవం, మా అమ్మకు నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. నాతో పాటు ఇతర అథ్లెట్లతో కూడా మాట్లాడారు. తమ దేశాల అథ్లెట్లతో ఇలా మాట్లాడి మోటివేట్ చేసే పీఎంను నేను ఇంత వరకు చూడలేదు. ఫ్యూచర్‌లో మరింత రాణించేలా ఆయన మాటలు నాలో కచ్చితంగా స్ఫూర్తి నింపుతాయి. ఫైనల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ సర్ కూడా నాకు ఫోన్ చేసి అభినందించారు. వాళ్ల ప్రోత్సాహంతో మరిన్ని పతకాలతో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తా.
ఒలింపిక్స్ గోల్డ్ నా అంతిమ లక్ష్యం
2022 నా బెస్ట్ ఇయర్ అనొచ్చు. ఆసియా క్రీడలు కూడా ఈ ఏడాదే జరిగితే 3 మేజర్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్‌తో హ్యాట్రిక్ సాధించే చాన్స్ ఉండేదేమో. ఏదేమైనా ఆసియా క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. 2023లో వీటితో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్స్, చాలా టోర్నీలు ఆడాల్సి ఉంది. నేను ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించను. అయితే, ఈ ఏడాదిలానే 2023, 2024 కూడా ఉంటే బాగుంటుంది (నవ్వుతూ). ఒలింపిక్స్‌లో గోల్డ్ నా అంతిమ లక్ష్యం. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో దాన్ని అందుకునే ప్రయాణం ఇప్పటికే మొదలు పెట్టా.
హైదరాబాద్ బాక్సింగ్ హబ్ కావాలి
స్పోర్ట్స్‌లో ఇప్పుడు హైదరాబాద్ పేరు చెప్పగానే బ్యాడ్మింటన్ గుర్తొస్తోంది. ఆ ఆటలో మంచి రిజల్ట్స్ వస్తుండటంతో హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్‌గా మారింది. అయితే, నేను హైదరాబాద్ బాక్సింగ్ హబ్ కూడా అవ్వాలని కోరుకుంటున్నా. నిజామాబాద్ లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన నేను ఒక ఇంటర్నేషనల్ బాక్సర్‌గా ఎదిగాను. తెలంగాణ నుంచి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ అయిన ఏకైక బాక్సర్‌గా నన్ను చూసి యువత స్ఫూర్తి పొందుతోంది. కాబట్టి రాష్ట్రంలో బాక్సింగ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో మాత్రమే బాక్సింగ్ రింగ్ ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బాక్సింగ్‌ను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం ముందుకురావాలని కోరుతున్నా.