నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

నిర్భయ దోషుల ఉరిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

చట్టంలోని లూప్ హోల్స్‌ను అడ్డం పెట్టుకుని రోజుకో డ్రామాకు తెరలేపిన నిర్భయ దోషుల ఆటకు డెడ్ ఎండ్ ఎదురైంది. ఇకపై పదేపదే ఉరి అమలు సాగదీత, వాయిదాలకు చాన్స్ లేకుండా చేసింది ఢిల్లీ హైకోర్టు. నలుగురు దోషులు ఒక్కొక్కరుగా ఇష్టం వచ్చినప్పుడు క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేస్తూ కాలయాపన చేయడానికి లేదంటూ ఆదేశాలిచ్చింది. కచ్చితంగా వారం రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోపు వారికి ఉన్న అన్ని లీగల్ ఆప్షన్లు వాడుకుంటే సరే లేదంటే ఆ తర్వాత ఉరి తీసేందుకు ప్రొసీడింగ్స్ మొదలవుతాయని స్పష్టం చేసింది.

నిర్భయ దోషులు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌లను జనవరి 22న ఉరి తీయాలని పాటియాలా కోర్టు జనవరి 7వ తేదీన డెత్ వారెండ్ జారీ చేసింది. కానీ, ఆ సమయానికి కూడా వాళ్లు క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉండడం, లీగల్ ఆప్షన్లు మిగిలి ఉన్నందున ఉరి అమలు వాయిదా పడింది.  ఫిబ్రవరి 1న ఉరేయాలని ఆదేశిస్తూ జనవరి 17వ తేదీన కోర్టు ఉత్తర్వులిచ్చింది.

నిర్భయ దోషులు ఒక్కొక్కరుగా తీర్పుపై రివ్యూలు, క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకుంటూ ఆలస్యం చేస్తూ వస్తున్నారు. లీగల్ ఆప్షన్లు పూర్తికాలేదంటూ దోషుల తరఫు లాయర్ జనవరి 31న పాటియాలా కోర్టులో పిటిషన్ వేశారు. ఉరిని వాయిదా వేయాలన్న న్యాయవాది వాదనతో కోర్టు అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చింది. గతంలో ఇచ్చిన ఉరి తీయాలన్న ఉత్తర్వులపై పాటియాలా కోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆ స్టే రద్దు చేయాలని, దోషులను ఒక్కక్కరుగా ఉరి తీసేందుకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వం, తీహార్ జైలు అధికారులు గత వారాంతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దోషులు కోర్టులను, చట్టాలను అపహాస్యం చేస్తున్నారని కేంద్రం తరఫు లాయర్ వాదించారు. అయితే అలా ఒక్కొక్కరిని ఉరేయడానికి రూల్స్ ఒప్పుకోవని దోషుల తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

దోషులను ఒక్కొక్కరిగా ఉరి తీసేందుకు నిబంధనలు ఒప్పుకోవని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. వేర్వేరుగా ఉరి తీసేందుకు అనుమతివ్వాలన్న కేంద్రం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. నిర్భయ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని బుధవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. దోషులకు ఉన్న అన్ని లీగల్ ఆప్షన్స్ వారంలోపు వాడుకోవాలని, ఆ తర్వాత ఉరి ప్రొసీడింగ్స్ మొదలవుతాయని స్పష్టం చేసింది.

2013లోనే ఉరి శిక్ష వేయాలని ట్రయల్ కోర్టు తీర్పు

2012 డిసెంబరు 16న ఢిల్లీలో ఓ యువతి (నిర్భయ)ని కిడ్నాప్ చేసి రన్నింగ్ బస్సులో ఆరుగురు కలిసి దారుణంగా రేప్ చేశారు. అత్యాచారం చేస్తూ పైశాచికంగా హింసించి.. రోడ్డుపై పడేసి పరారయ్యారు. ఆమె చికిత్స పొందుతూ 2012 డిసెంబరు 29న మరణించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు రామ్ సింగ్(33), ముకేష్ సింగ్(24), , వినయ్ శర్మ(22), పవన్ గుప్తా(20) , అక్షయ్ ఠాకూర్(29), మరో మైనర్ (17సంవత్సరాల 6నెలలు)ను పోలీసులు అరెస్టు చేశారు.

దోషిగా తేలినప్పటికీ మైనర్ జువైనల్ చట్టం ప్రకారం మూడు సంవత్సరాల జైలుశిక్షతో బయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ 2013మార్చ్ 11న తీహార్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఉరిశిక్షే సరైందని ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్ 13న తీర్పు చెప్పింది. 2017 మే 5న ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

More News:

ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్

నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి నేను రెడీ: పవన్

నిర్భయ దోషిపై జైలులో రేప్!

దిశ ఘటన తర్వాత స్పీడ్.. 

గత ఏడాది నవంబరులో హైదరాబాద్ శివారులో జరిగిన దిశ రేప్, మర్డర్ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఆడపిల్లకు రక్షణ కరువైదంటూ జనం రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేపట్టారు. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ రేప్ కేసులో దోషులకు శిక్ష అమలు కాకపోవడంపై జనంలో ఆగ్రహం పెల్లుబుకింది. దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేస్తారా? లేక తమకు అప్పగిస్తారా? అంటూ జనం పోలీసులను నిలదీశారు. ఘటన జరిగిన పది రోజులకే దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగింది. ఆ తర్వాత నిర్భయ కేసులోనూ దోషులను త్వరగా ఉరి తీయాలని డిమాండ్ పెరిగింది. జనవరి 7న ఢిల్లీలోని పాటియాలా కోర్టు నలుగురు దోషులను ఉరి తీయాలని డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశించింది.

మళ్లీ బ్రేకులు.. నిర్భయ తల్లితో దోషుల లాయర్ చాలెంజ్

డెత్ వారెంట్ వచ్చిన నాటి నుంచి నిర్భయ దోషులు రోజుకో నాటకానికి తెర తీశారు.  కోర్టుల్లో ఒక్కొక్కరుగా పిటిషన్లు వేస్తూ క్షమాభిక్ష దాఖలులో జాప్యం చేస్తూ ఉరి వాయిదా పడేలా డ్రామాలు చేశారు. చట్టం ప్రకారం క్షమాభిక్ష తిరస్కరణ తర్వాత ఉరికి కనీసం 14 రోజుల టైం ఉండాలన్న నిబంధన ఉండడంతో శిక్ష అమలు వాయిదా పడింది. చట్టంలోని లూప్ హోల్స్‌ను అడ్డం పెట్టుకుని ఒక్కొక్కరుగా నచ్చినప్పుడు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటే శిక్ష వాయిదాలు వేయిస్తూ  పోవచ్చన్న ఆలోచన దోషుల తరఫు లాయర్లలో కనిపించింది. గత వారంలో కోర్టులో విచారణ సందర్బంగా కూడా దోషుల తరఫు లాయర్ నిర్బయ తల్లితో ఇదే రకమైన చాలెంజ్ చేశాడని ఆమె తెలిపారు. వాళ్లకు జీవితకాలంలో ఉరి అమలు కాకుండా చూస్తానని సవాలు చేశాడని ఆమె చెప్పారు. అయితే ఈ కుయుక్తులకు ఢిల్లీ హైకోర్టు బ్రేకులు వేసింది. వారం గడువు విధించి.. సాగదీతలకు చాన్స్ లేకుండా చేసింది.