ఆందోళనలతో హోరెత్తిన కలెక్టరేట్

ఆందోళనలతో హోరెత్తిన కలెక్టరేట్

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సోమవారం ముట్టడిలతో హోరెత్తింది. గ్రీవెన్స్ సెల్​ను పురస్కరించుకొని చాలా మంది ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్​కు తరలివచ్చారు. ఖానాపూర్ పట్టణంలో అనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి అర్హులైన పేదలకు అన్యాయం చేశారంటూ వందలాది మంది కలెక్టరేట్​కు తరలివచ్చారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని సంతోష్ తదితరులు వారి వెంట కలెక్టరేట్​కు చేరుకొని ధర్నా చేపట్టారు.  రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల అనుచరులకే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించి పేదలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అర్హులందరికీ వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వరుణ్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇందులో బీజేపీ నాయకులు దాదె మల్లయ్య,  బుచ్చన్న యాదవ్, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ సెకండ్ ఏఎన్ఎంలు కలెక్టరేట్​కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. 

గ్రీవెన్స్​లో వినతి పత్రాలు

నస్పూర్ : మంచిర్యాల కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్​లో పలువురు తమ సమస్యలు విన్నవించారు. ఏఎన్ఎంలను పర్మినెంట్ చేసి, ప్రతి నెలా జీతాలు ఇవ్వాలని, ఓసీపీ నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఓసీపీ వల్ల తాళ్లపల్లి, సింగపూర్ గ్రామాల ఆబాది, లావణి పట్టాల, నివాస స్థలాలకు నష్టపరిహారం అందించాలని స్థానిక కౌన్సిలర్ బండారి సంధ్యారాణి ఆధ్వర్యంలో గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చారు. సర్వే నంబర్ 86 లావణి పట్టాలో 60 ఇండ్లు ఉన్నాయని వాటికి నష్టపరిహారం ఇవ్వాలని, చెరువు శిఖం భూమి కబ్జా జరుగుతుందని, హద్దులు  ఏర్పాటు చేయాలన్నారు. కరోన సమయంలో కూడా విధులు నిర్వహించి ప్రజలకు సేవ చేసిన ఏఎన్ఎంలలో కొంత మందికి జీతాలు సక్రమంగా రావడం లేదని, పర్మినెంట్ చేసి ప్రతి నెలా జీతాలు వచ్చేలా  చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో చాలా మంది నకిలీ ఫిజియో థెరపిస్టులు చలామణి అవుతున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని క్వాలిఫైడ్  ఫిజియోథెరఫీలు కోరారు. క్వాలిఫైడ్ కానివారు మసాజ్ పేరుతో  చేస్తున్న చర్యలను అరికట్టాలన్నారు.

సెకండ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలి

ఆసిఫాబాద్ : సెకండ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ..సెకండ్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిచాలని డిమాండ్ చేశారు. 20 ఏండ్ల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పని చేస్తున్న ఏఎన్ఎంలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. జులై 26న ఇచ్చిన నోటిఫికేషన్​ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్రంలో పని చేస్తున్న వారందరిని పర్మినెంట్ చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెకండ్ ఏఎన్ఎంల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ఉపాధ్యక్షులు రజిని, శోభ, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.