
- మత్తులో జోగుతున్న యువకులు
- సూత్రధారులను గుర్తించేందుకు రంగంలోకి పోలీసులు
నిర్మల్, వెలుగు: కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలతో పాటు పెద్ద ఎత్తున వినియోగం పెరిగింది. కొంతమంది గంజాయిని ఓసీబీ పేపర్లలో నింపి రోలింగ్ చేస్తూ సిగరెట్లుగా తాగుతున్నారు. బీడీల తయారీకి ఉపయోగించే తునికాకు మాదిరిగానే సిగరెట్ల తయారీకి ఓసీబీ (ఓడెట్ క్యాస్ క్యాడెక్ బొల్లొరే) అనే పేపర్‌ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఓసీబీ పేపర్లతో తయారుచేసిన గంజాయి సిగరెట్ల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు పాన్ టేలాలు, కిరాణా దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. కొన్ని పాన్ టేలాల్లో ఓసీబీ పేపర్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు ఇప్పటివరకు గంజాయి చాక్లెట్లు, గంజాయి పొడి అమ్మకాలపైనే సీరియస్ గా దృష్టి సారించారు. అయితే దాడుల్లో ఓసీబీ పేపర్లు లభించడం వారిని విస్మయానికి గురిచేసింది. దీంతో ఓసీబీ పేపర్ల కొనుగోలు, సరఫరా, విక్రయ దారుల కోసం ఆరా తీస్తున్నాయి.
అనుమానం రాకుండా సిగరెట్డబ్బాల్లో అమ్మకం
కొంతమంది పాన్ టేలాల యజమానులు ఓసీబీ పేపర్లలో గంజాయి పొడిని నింపి కొన్ని బ్రాండెడ్ సిగరెట్ డబ్బాల్లో నిల్వ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయికి బానిసైన యువకులు ఆ పాన్ టేలాల వద్దకు వెళ్లి కోడ్ పేరుతో ఆ సిగరెట్లు కావాలని అడగడంతో పాన్ టేలా నిర్వాహకుడు ఎవరికీ అనుమానం రాకుండా వాటిని బ్రాండెడ్ సిగరెట్ డబ్బాల నుంచి తీసి అమ్ముతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
గంజాయి నింపిన ఒక్కో సిగరెట్‌ను రూ.50 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మినీ స్టేడియం, బైల్ బజార్, విశ్వనాథ్‌పేట్, సోఫీనగర్, మహాలక్ష్మి వాడతో పాటు మరికొన్ని శివారు ప్రాంతాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో యువత ఈ గంజాయి సిగరెట్లు తాగుతున్నట్లు తెలుస్తోంది. భైంసా, ఖానాపూర్ పట్టణ ప్రాంతాల్లో కూడా గంజాయి సిగరెట్లను యువకులు వినియోగిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి ఓసీబీ పేపర్ల సరఫరా
ఓసీబీ పేపర్లును హైదరాబాద్ నుంచి జిల్లా అంతటికీ సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జర్దా, గుట్కా వ్యాపారాలు చేస్తున్న కొంతమంది వీటిని నిర్మల్ కు రహస్యంగా తీసుకువస్తున్నారు. ఆకర్షణీయంగా ఉండే ఖరీదైన కవర్ లో ఈ పేపర్లను ఉంచి తమతో సంబంధాలున్న పాన్ పేలాల యజమానులకు మాత్రమే రహస్యంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
నిఘా పెట్టిన పోలీసులుగంజాయి అమ్మకాలు, వినియోగంపై ఎస్పీ జానకి షర్మిల సీరియస్‌గా దృష్టి పెట్టారు. అప్పటికే పలుచోట్ల గంజాయి విక్రయిస్తున్న వారిని పట్టుకుని వారిపై కేసులు కూడా నమోదు చేశారు. గంజాయి తాగేవారితోపాటు వారి కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
సరిహద్దులు, అనుమానిత ప్రాంతాలపై నిఘా పెట్టారు. దాడుల్లో ఓసీబీ పేపర్లు పట్టుపడడంతో ఇప్పుడు ఆ కోణంలో విచారణ మొదలుపెట్టారు. ఓసీబీ పేపర్లను రవాణా చేస్తున్న వారిపైనే కాకుండా వాటిని అమ్ముతున్న వారిపై దృష్టిపెట్టారు. హైదరాబాద్ నుంచి సరఫరా చేస్తున్న వ్యాపారులకు తాకీదులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పలు ట్రాన్స్పోర్ట్, పార్సిల్ ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఓసీబీ పేపర్ల ప్రధాన సూత్రధారులను కనిపెట్టే పనిలో పడ్డారు.