
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో టీచర్లకు ఏడేళ్లుగా పదోన్నతులు, నాలుగేళ్లుగా బదిలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నగరంలోని అంబేడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. ప్రైమరీ స్కూళ్లలో అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే తరగతికి ఒక టీచర్‌ను నియమించాలని, పాఠశాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరి ట 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరైంది కాదన్నారు. సమావేశంలో బీసీ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైరంకొండ బాబు, కార్యదర్శి అంబటి నర్సయ్య, డిచ్‌పల్లి మండలం అధ్యక్షుడు కొట్టాల రామకృష్ణ పాల్గొన్నారు.
ఉద్యమానికి విద్యార్థులే కథానాయకులు
నిజామాబాద్, వెలుగు : బీసీల అభ్యున్నతి కోసం చేపడుతున్న ఉద్యమానికి విద్యార్థులే కథానాయకులుగా నిలవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ విద్యార్థి యువజన పొరు యాత్ర శనివారం రాత్రి నగరానికి చేరుకోగా ఆదివారం పాత అంబేద్కర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, బీసీ వెల్ఫేర్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, యువజన సంఘ జిల్లా అధ్యక్షుడు కొయ్యాడ శంకర్, ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల జీవితాలతో చెలగాటమా?
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌లో రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాట మాడుతోందని పీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మదన్‌మోహన్‌రావు విమర్శించారు. సదాశినగర్ మండలం వడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతులతో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి టౌన్ కొత్త మాస్టర్ ప్లాన్‌లో పచ్చని పంట భూములను ఇండస్ట్రియల్ జోన్‌గా చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ను రైతులు చందాలు వేసుకుని గెలిపిస్తే ఈ రోజు ఆయన రైతులకే ఉరితాళ్లు బిగిస్తున్నారని ఆరోపించారు. రైతులను సంప్రదించకుండానే వారి భూములను ఇండస్ట్రియల్ జోన్‌గా ఎలా ప్రతిపాదిస్తారని ప్రశ్నించారు. బాధిత రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు.