పొగాకు రైతుల ఆశలు ఆవిరి .. కంపెనీలు సిండికేట్​గా మారి ధర తగ్గింపు

పొగాకు రైతుల ఆశలు ఆవిరి .. కంపెనీలు సిండికేట్​గా మారి ధర తగ్గింపు
  • గతేడాది క్వింటాల్ ధర రూ.13,800 
  • ఈసారి 3,800 ఎకరాల్లో పొగాకు సాగు 
  • వర్షాలతో సరుకు కుళ్లిపోతుందని రైతులు ఆందోళన 

నిజామాబాద్, వెలుగు : గిట్టుబాటు ధర వస్తుందని సాగు చేసిన పొగాకు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కంపెనీలు సిండికేట్​గా మారి ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్ లేదని కంపెనీల ప్రతినిధులు వ్యవసాయ శాఖకు సమాచారమివ్వడంతో పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  అకాల వర్షాలతో సరుకు కుళ్లిపోతుందని  రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలతో అగ్రిమెంట్​ లేకుండా సాగు చేసినందుకు కష్టాల్లో పడ్డామని, ఆదుకోవాలని కలెక్టర్​కు మొరపెట్టుకుంటున్నారు.  దీంతో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు వ్యవసాయ అధికారులు పొగాకు కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించారు.  

1500 ఎకరాల్లో పెరిగిన పంట 

జిల్లాలోని మహారాష్ట్ర బార్డర్​లోగల బోధన్ డివిజన్ నల్లరేగడి భూముల్లో రైతులు పొగాకు సాగు చేస్తారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో  ఏటా 2,300 ఎకరాల్లో  పొగాకు పండిస్తారు. రెండు నెలలు నారు పెంచాక నాటితే నాలుగు నెలలకు పంట చేతికొస్తుంది. తరువాత నెల రోజుల భట్టీ, రెండు నెలలుపెడతారు. మొత్తం పది నెలలు శ్రమిస్తే  ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వస్తుంది.  గత ఏడాది రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర​ రూ.13,800 పలికింది. అన్ని కంపెనీలు కలిపి సుమారు కోటి 20 లక్షల క్వింటాళ్ల పొగాకు కొనుగోలు చేశాయి. ఈసారి ఆ ధరే ఉంటుందని ఆశించి 3,800 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. పంట చేతికొచ్చాక కంపెనీలు సిండికేట్​గా మారి క్వింటాల్​కు రూ.9 వేల రేటు​ ప్రకటించగా రైతులు ఆవేదన చెందుతున్నారు.    
 
నో అగ్రిమెంట్​

పదేండ్ల క్రితం వీఎస్​టీ, ఐటీసీ, వీటీపీ, కేఆర్​కే, అలయెన్స్​ కంపెనీలు ఈ ప్రాంతం నుంచి పొగాకు కొనడానికి పోటీపడేవి. రైతులు తమ నుంచి చేజారకుండా నారు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా కమ్యూనిటీ డెవలప్​మెంట్​ ప్రొగ్రామ్స్​ నిర్వహించేవి.  ఏ కంపెనీ నుంచి నారు తీసుకున్నారో అదే కంపెనీకి పంట విక్రయించేవారు. రేటు, కొనుగోళ్ల గ్యారెంటీతో కూడిన బై బ్యాక్​ అగ్రిమెంట్ లేనప్పటికీ నిరుటిదాకా పొగాకు రైతులకు కంపెనీల నుంచి సమస్య రాలేదు.  ఈసారి సిండికేట్​గా మారి ధర తగ్గించడం, అకాల వర్షాలకు సరుకు కుల్లిపోతుండడంతో రైతుల పరిస్థితి దారుణంగా 
మారింది.

వర్షానికి పంట తడిసింది

ఎనిమిదెకరాల్లో సాగు చేసిన పొగాకు పంట చేతికొచ్చింది. 15 రోజుల నుంచి చూస్తున్న కొనడానికి ఏ కంపెనీ రాలేదు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో పొగాకు తడిసింది. ఎకరానికి రూ.45 వేలు పెట్టుబడి పెట్టిన.  జిల్లా అధికారులు పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. 

అఖిల్​ఖాన్​, రైతు, నీలా పేపర్​ మిల్ కాలనీ

తక్కువ రేటుకు అడిగిన్రు

15 ఎకరాల్లో  పొగాకు సాగు చేసిన. నిరుడు రూ.14 వేల దాకా రేటు పెట్టిన  కంపెనీలు ఈసారి రూ.7 వేల నుంచి రూ.10 వేలకు అడిగిన్రు. అంత తక్కువ రేట్​కు అమ్మితే నష్టం వస్తుందని ఆగితే వాన ఆగం చేస్తుంది. పంట సాగు పెరగడంతో కంపెనీలు మోసం చేస్తున్నయ్​.    

మోబిన్​బేగ్​, రైతు, కందకుర్తి 

 

కంపెనీలకు లెటర్లు రాశాం

గతేడాది రేటు వస్తుందన్న ఆశతో రైతులు పొగాకు సాగు చేశారు.  అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్​ లేకపోవడంతో రేటు పడిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని పొగాకు బోర్డు ఆధ్వర్యంలో లావాదేవీలు జరుగుతాయి. బోర్డుకు తాము ఆదేశాలు ఇవ్వలేం. రైతుల ఇబ్బందిపట్ల సానుభూతి ఉంది. కలెక్టర్​ ఆదేశాలతో డీఏవో పొగాకు కంపెనీలకు లెటర్ రాశారు. సాగు వివరాలు, దిగుబడి వివరాలన్నీ  పంపాం.    

అలీముద్దీన్​, ఏడీఏ, బోధన్​