హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ నో ఎంట్రీ: ఊర్ల నుంచి మీ వాళ్లు వస్తుంటే అలర్ట్ చేయండి..!

హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్స్ నో ఎంట్రీ: ఊర్ల నుంచి మీ వాళ్లు వస్తుంటే అలర్ట్ చేయండి..!

హైదరాబాద్: దేశంలోనే వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగే నగరాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ సిటీలో ప్రతియేటా గణేష్ నవరాత్రి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా నగరంలో అంగరంగ వైభవంగా గణేషుడు ఉత్సవాలు జరుగుతున్నాయి. గల్లీ గల్లీలో గణనాథుడిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నవరాత్రులు పూర్తి కావడంతో లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేర్చే సమయం ఆసన్నమైంది. దీంతో హైదరాబాద్ సిటీలో గణేషుడి నిమజ్జన కోలాహాలం నెలకొంది.

జై గణేషా.. జైజై గణేషా.. గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తననుంది హైదరాబాద్ సిటీ.. మరికొన్ని గంటల్లో అంటే 2025, సెప్టెంబర్ 6వ తేదీ శనివారం హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరగనుంది. సిటీలోని గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు నిమజ్జనం కానున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‎తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కోలాహలంగా సాగనుంది. లక్షల మంది భక్తులు ఈ వేడుకను వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. 

ALSO READ : జై గణేషా.. గణపతి బప్పా మోరియా.. : హైదరాబాద్ శోభా యాత్ర స్లోగన్స్ ఇవే..!

ఈ క్రమంలో గణేష్ నిమజ్జనాల సందర్భంగా రాచకొండ పోలీసులు కీలక సూచన చేశారు. వినాయకుడి శోభాయాత్ర పురస్కరించుకుని 2025, సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 8 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు సిటీలోకి ప్రవేశం లేదని నో ఎంట్రీ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. సిటీలో ఉన్న భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు సైతం బయటకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. భారీ వాహనాల ఓనర్లు, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.