
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందని పలు జాతీయ మీడియా చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దేశమంతా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు కరనా లాక్ డౌన్ కు ముందే పూర్తయిపోయాయి. అయితే ఈ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో సీఏఏ నిరసనల సందర్భంగా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో తీవ్రమైన హింస చెలరేగి దాదాపు 40 మందికి పైగా మరణించారు. దీంతో ఈశాన్య ఢిల్లీలో సీబీఎస్ఈ పరీక్షలు కొన్ని వాయిదా పడ్డాయి. వాటిని అన్ని పరీక్షలు ముగిశాక పెట్టాలని బోర్డు భావించినప్పటికీ ఆ సమయానికే దేశంలో కరోనా కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఆ పరీక్షలతో పాటు దేశ వ్యాప్తంగా 12వ తరగతి పరీక్షలు కూడా కొన్ని వాయిదా పడుతూ వచ్చాయి. లాక్ డౌన్ ఎత్తేశాక పెండిగ్ ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామని గతంలో సీబీఎస్ఈ అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న టెన్త్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన్నట్లు తెలుస్తోంది.