అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. కొడుకు మృతదేహాన్ని పబ్లిక్ బస్సులో తీసుకువెళ్లిన తండ్రి

అంబులెన్స్‌కు డబ్బుల్లేక.. కొడుకు మృతదేహాన్ని పబ్లిక్ బస్సులో తీసుకువెళ్లిన తండ్రి

అంబులెన్స్ డ్రైవర్ డిమాండ్ చేసిన డబ్బు లేకపోవడంతో తన ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో ప్రయాణించాలడు ఓ తండ్రి. అత్యంత అమానవీయమైన ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతంలో చోటుచేసుకుంది. ముస్తాఫానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డండిపరా గ్రామానికి చెందిన అసీం దేవశర్మ అనే వలస కూలి...  అనారోగ్యం పాలైన తన ఐదు నెలల కుమారుడిని కలియగంజ్ స్టేట్ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు రాయ్‌గంజ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఆ తర్వాత నార్త్ బెంగల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందాడు. చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సమకూర్చాల్సిందిగా నార్త్ బెంగల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని అసీం ఆశ్రయించినా.. ఫలితం లేకపోవడంతో అంబులెన్స్ డ్రైవర్‌ను సంప్రదించాడు. మృతదేహాన్ని తరలించేందుకు రూ. 8 వేలు అవుతుందని అంబులెన్సు డ్రైవర్ చెప్పడంతో.. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఇక చేసేదేం లేక ఆ చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని, డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలియాగంజ్‌కు ఎవరికీ తెలియకుండా బస్సులో ప్రయాణించి, ఆ చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లాడు.

తన ఐదు నెలల కొడుకు సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆరు రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత మరణించాడని అసీం దేవశర్మ తెలిపాడు. అప్పటికే తాను రూ.16 వేలు ఖర్చు చేశానని, చనిపోయిన తన బిడ్డను కలియాగంజ్‌కు తరలించినందుకు అంబులెన్స్ డ్రైవర్ రూ.8వేలు డిమాండ్ చేశాడని చెప్పుకొచ్చాడు. బస్సులో మృతదేహాన్ని తీసుకెళ్తున్నానంటే ఎక్కనివ్వరేమోనని ఎవరికీ చెప్పకుండా బయలుదేరానని అసీం తెలిపాడు. 102 పథకం కింద రోగులకు ఈ సదుపాయం ఉచితమని, కానీ శవాలను తరలించడానికి కాదని అంబులెన్స్ డ్రైవర్ తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని జల్‌పైగురి జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.
అంబులెన్స్ ఆపరేటర్లు డిమాండ్ చేసిన అధిక మొత్తం చెల్లించలేక, ఒక వ్యక్తి, తన తల్లి మృతదేహాన్ని భుజంపై మోస్తూ, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడం ప్రారంభించాడు. అయితే, కొంత సమయం తరువాత, ఒక సామాజిక సేవా సంస్థ అతనికి ఉచితంగా ఇంటికి తీసుకెళ్లే వాహనాన్ని అందించింది.