ఇక, ఫోన్ స్క్రీన్ పగలదు!

ఇక, ఫోన్ స్క్రీన్ పగలదు!

 అల్యూమినియం కన్నా గట్టిదైన ప్లాస్టిక్ షీట్ తయారీ

వేలకు వేలు పోసి కొన్న ఫోను.. చేజారి పడి పగిలితే మనసు చివుక్కుమంటది కదా! ఇకపై ఆ బాధలుండవట. గోడకేసి కొట్టినా పగలనటువంటి ‘స్క్రీన్’ను తయారు చేశారు లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్​, క్వీన్ మేరీ యూనివర్సిటీ పరిశోధకులు. అల్యూమినియం కన్నా గట్టిగా, దృఢంగా ఉండే పారదర్శకమైన పాలిథీన్ ఫిల్మ్​లను తయారు చేసినట్టు చెప్పా రు. నిజానికి హై డెన్సిటీ పాలిఇథిలీన్(హెచ్ డీపీఈ) మెటీరియళ్లు అంత పారదర్శకంగా ఉండవని, కానీ, వాటికి కొన్ని పదార్థాలు కలపడం వల్ల గట్టిదనంతో పాటు 90 శాతం పారదర్శకంగా మారాయని గతంలో సైంటిస్టులు చెప్పారు.

అయితే, తాజాగా ఎలాంటి అదనపు పదార్థాలను కలపకుండానే హెచ్ డీపీఈకి పారదర్శకతను తీసుకొచ్చినట్టు సైంటిస్టులు చెప్పారు. హెచ్ డీపీఈ మెల్టింగ్ పాయింట్ కు ముందే వాటి షీట్ లను తీయడం వల్ల వాటి ట్రాన్స్​పరెన్సీ ఎక్కడికీ పోలేదని చెప్పారు. 90 నుంచి 110 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద హెచ్ డీపీఈ షీట్లను వేడిచేయడం వల్ల వాటికి దృఢత్వం, పారదర్శకత వచ్చాయని వివరించారు. ఆ ఉష్ణోగ్రతల వద్ద పాలిమర్​ చైన్లలో కదలిక వల్లే వాటికి ఆ లక్షణాలు అబ్బాయని చెప్పారు. తక్కువ బరువు, ధరతో పాటు ఎక్కువ పారదర్శకత, ఎక్కువ దృఢత్వం, గట్టిదనాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. మున్ముందు ఫోన్లు, ల్యాప్ టాప్లు, ట్యాబ్ లు, టీవీలు, వాహనాల అద్దాలు, బిల్డింగులకు పెట్టే అద్దాలకు వీటిని వాడొచ్చని చెబుతున్నారు.