'కేజీఎఫ్' సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కన్నడ నటుడు యశ్.. సుదీర్ఘ విరామం తర్వాత మరో సారి రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. టాలెంటెడ్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొద్దిరోజులుగా ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.
సినిమా రిలీజ్పై క్లారిటీ
ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం 40 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపు అందుకున్నాయి. వాస్తవానికి తొలుత ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని భావించారు. అయితే ఒక వైపు ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. మరో వైపు షూటింగ్ ఆలస్యం వల్ల ఈ సినిమా వాయిదా పడిందని చర్చ మొదలైంది. దీంతో లేటెస్ట్ గా ఈ వాయిదా వార్తలను చిత్ర బృందం ఖండించింది. ప్రకటించిన విధంగానే జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేసింది.
గ్లోబల్ మార్కెట్‌పై కన్ను
యశ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సినీమాకాన్’ వేడుకలో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని కేవలం పాన్-ఇండియా చిత్రంగా కాకుండా, హాలీవుడ్ రేంజ్‌లో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే దీనిని కన్నడతో పాటు నేరుగా ఇంగ్లీష్ భాషలోనూ చిత్రీకరిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోకి అనువదిస్తున్నారు.
కథా నేపథ్యం..
ఈ మూవీ1940 - 1970 మధ్య కాలంలో గోవా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. అప్పటి మాదకద్రవ్యాల మాఫియా, గ్యాంగ్ వార్స్ చుట్టూ కథ ఆసక్తికరంగా సాగనుంది. ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రావణుడిగా యశ్..
ఒకవైపు 'టాక్సిక్' ప్రమోషన్లతో బిజీగా ఉంటూనే, మరోవైపు నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమాలో రావణుడిగా యశ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ బిజీగా ఉన్నారు. వందల కోట్ల బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'టాక్సిక్', బాక్సాఫీస్ వద్ద మరోసారి యశ్ ప్రభంజనాన్ని సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 4న థియేటర్లలో 'టాక్సిక్' మ్యాజిక్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

