
- ఈ ఏడాది 3 వేల కోట్ల బడ్జెట్ పెట్టిన పాలక మండలి
- కార్పస్ ఫండ్ రూ.78 కోట్లే.. ఐదేళ్ల క్రితం ఇది రూ.969 కోట్లు
- ఏపీ ప్రభుత్వ అవసరాలకు శ్రీవారి సొమ్ములు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు డిపాజిట్లు తగ్గిపోతున్నాయి, వడ్డీరేట్లలో కోతపడుతోంది, మరోవైపు ఖర్చులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. వెరసి భవిష్యత్తులో టీటీడీ అమలు చేస్తున్న పలు పథకాల అమలుపై నీలినీడలు కమ్ముకోనున్మాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,116 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను పాలక మండలి ఆమోదించింది. ఏటా టీటీడీ ఆదాయం పెరుగుతున్నా, అదుపు తప్పుతున్న ఖర్చులు, దుబారా వ్యయం వల్ల బ్యాంకులో డిపాజిట్ చేసే మొత్తం తగ్గిపోతోంది. ఇదే అంశం శ్రీవారి భక్తులకు ఆందోళన కలిగిస్తోంది.
సాధారణంగా హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ ఆదాయంగా పరిగణిస్తారు. కానుకల ద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని శాశ్వత పనులకు వినియోగించగా మిగిలిన దాన్ని డిపాజిట్ చేయాలి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు , దర్శనాల టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, తలనీలాల విక్రయాలు వంటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటారు. రెవెన్యూ ఆదాయం నుంచే ఉద్యోగుల జీతభత్యాలు, మార్కెటింగ్ సరుకుల కొనుగోలు, విద్యుత్ ఛార్జీలు వంటివాటి కోసం ఖర్చు చేయాలి. డిపాజిట్లు ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ అంత ఎక్కువగా వస్తుంది.
భవిష్యత్తులో హుండీ ఆదాయం తగ్గినా.. వడ్డీ రావడం వల్ల ఆలయ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే డిపాజిట్ చేసే మొత్తం తగ్గిపోతోంది. 2018-19 సంవత్సరంలో భవిష్యత్తు పొదుపు కోసం రూ.200 కోట్లు కార్పస్ ఫండ్ కింద డిపాజిట్ చేయాలని నిర్ణయించుకుంటే ఆచరణలో రూ.86 కోట్ల మాత్రమే డిపాజిట్ చేయగలిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019-20లో కార్పస్‌ఫండ్ డిపాజిట్ లక్ష్యాలను రూ.78.85 కోట్లకు తగ్గించుకున్నారు. 2016-17లో రూ.475 కోట్లు, 2015-16లో రూ.783 కోట్లు, 2014-15లో రూ.969 కోట్లు డిపాజిట్ చేశారు. అటువంటిది ఇప్పుడు రూ.78 కోట్లకు పరిమితం చేశారంటే డిపాజిట్లు ఎంతగా తగ్గించేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఆదాయం పెరుగుతున్నా.. పొదుపు కిందకే
డిపాజిట్లు చేయడం అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేయడమే. ఆదాయం తగ్గినపుడు పొదుపూ తగ్గుతుంది. టీటీడీ విషయంలో ఆదాయం తగ్గడం లేదు. పెరుగుతోంది. అయినా డిపాజిట్లు భారీగా తగ్గాయి. హుండీ ద్వారా వచ్చే కానుకలను పరిశీలిస్తే.. 2014-15లో రూ.993 కోట్లు, 2015-16లో రూ.1000 కోట్లు, 2016-17లో రూ.1010 కోట్లు, 2017-18లో 1,116 కోట్లు వచ్చాయి. అంటే హుండీ ద్వారా వస్తున్న ఆదాయం పెరుగుతూనే ఉంది. 2014-15లో రూ.993 కోట్లు వచ్చినపుడే….రూ.969 కోట్లు డిపాజిట్ చేశారు. అలాంటిది రూ.1,116 కోట్ల ఆదాయం వచ్చినపుడు డిపాజిట్లు రూ.86 కోట్లుకు పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రభుత్వ పనులకూ టీటీడీ పైనే భారం
టీటీడీ లో నిధులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. అధికారులు కూడా శ్రీవారి నిధులను ఉదారంగా పంచిపెట్టేస్తున్నారు. తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకుంటోంది టీటీడీ. ఏపీ ప్రభుత్వ బాధ్యతలనూ చేపడుతోంది. ప్రభుత్వం చేపట్టాల్సిన అనేక పనులకు నిధులు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. చెరువుల అభివృద్ధి, జాతీయ రహదారి అభివృద్ధి వంటి పనులకు నిధులు కేటాయించాలని నిర్ణయించిది. రోడ్ల అభివృద్ధికి రూ.210 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో చూపించారు. రోడ్ల కోసం టిటిడి ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటని భక్తులు పశ్నిస్తున్నారు. తిరుపతిలోని అవిలాల చెరువు అభివృద్ధికి రూ.180 కోట్లు ఖర్చు చేస్తున్నారు. టిటిడి రవావా విభాగం కోసమే ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వాస్తవంగా పొదుపు చేయాలన్న తలంపు అధికారులకు ఉంటే ఇక్కడే రూ.10 కోట్లు దాకా ఆదా చేయవచ్చు. ఇక ప్రతి పనినీ కాంట్రాక్టుకు ఇచ్చేస్తున్నారు. సొంతంగా చేసుకుంటే కోటి ఖర్చ య్యేదానికి కాంట్రాక్టుకు ఇచ్చి ఒకటిన్నర కోటి ఖర్చు చేస్తున్నారు. విద్యుత్ దీపాలు, ఎల్‌ఇడి తెరలు వంటివి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా ప్రతి ఉత్సవానికీ అద్దెకు తెచ్చుకుంటూ కోట్లు వ్యయం చేస్తున్నారు. మొలకల చెరువులో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంటును ప్రైవేట్‌కు ఇవ్వడం వల్ల 20 ఏళ్లలో టిటిడి రూ.100 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి అనేకం ఉన్నాయి.
దేవుడి డబ్బు అన్న స్పృహ ఉండాలి
టీటీడీకి పటిష్టమైన ఆర్థిక విధానం అవసరం ఉంది. నిధులను దేనికి ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలని అనేదానిపై పక్కా విధివిధానాలను రూపొందించుకోవాలి. దుబారాను, అనినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అన్నింటికీ మించి దేవుడి డబ్బులు ఖర్చు చేస్తున్నామన్న స్పృహ పాలక మండలికి, అధికారులకు ఉండాలి. డబ్బులున్నాయి కదా అని ఖర్చ పెట్టుకుంటూ వెళితే… భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. టీటీడీ బడ్జెట్ రూ.3000 కోట్లు దాటింది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఆడిటింగ్ వ్యవస్థ కూడా ఉండాలి. టీటీడీ ఆడిటింగ్‌ను కాగ్‌కు అప్పగించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఇది కచ్చితంగా టీటీడీకి మేలు చేసేదే తప్ప… నష్టం చేసేదికాదు. అందుకే దీన్ని పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. టీటీడీలో ఖర్చులు ఇలాగే కొనసాగితే భవిషత్తులో టీటీడీ మనుగడ ప్రస్నార్థకంగా మారుతుందని భక్తులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా పెడుతున్న ఖర్చులు తగ్గించాలని కోరుతున్నారు. శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పంచే కోట్లాది రూపాయల కానుకలను ప్రభుత్వం మెప్పుకోసం ఖర్చుపెట్టడం ఏంటని మండిపడుతున్నారు.