విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతికి ఏ రాష్ట్రం దరఖాస్తు చేయలేదు

విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతికి ఏ రాష్ట్రం దరఖాస్తు చేయలేదు
  • ఏ రాష్ట్రం దరఖాస్తు చేసినా వెంటనే అనుమతి: కేంద్రం

న్యూఢిల్లీ: విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటామని దేశంలోని ఏ ఒక్క రాష్ట్రమూ ఇంత వరకు దరఖాస్తు చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ కొనుగోలు పాలసీని కేంద్రం సరళీకృతం చేసిందని.. ఏ రాష్ట్రమైనా తమ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉందని, విదేశాల నుంచి ఏ రాష్ట్రమైనా టీకాలను దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్గదర్శకాల మేరకు ఏ రాష్ట్రమైనా అనుమతి కోరితే వెంటనే మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రం వివరించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అమెరికా ఎఫ్‌డీఏ, అనుమతి పొందిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి కరోనా వ్యాక్సిన్ల దిగుమతి కోసం కేంద్రం వద్ద ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవని చెప్పింది. ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు విదేశాంగ శాఖను సంప్రదించాయని, భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు జాన్సన్ అండ్‌ జాన్సన్ సిద్ధంగా ఉందని కేంద్రం  వెల్లడించింది.