కరోనా టీకాలపై కృషి చేసిన సైంటిస్టులకు నోబెల్​

కరోనా టీకాలపై కృషి చేసిన సైంటిస్టులకు నోబెల్​
  • వైద్యరంగంలో ప్రైజ్ గెలుచుకున్న కాటలిన్, వైజ్ మన్ 
  • ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై పరిశోధన
  • ఫైజర్, మోడెర్నా టీకా ఉత్పత్తిలో వీరిది కీలక పాత్ర 
  • వైద్య రంగంలో నోబెల్ పొందిన 13వ మహిళగా కాటలిన్

స్టాక్‌‌ హోం :  కరోనా వ్యాక్సిన్ ల ఉత్పత్తికి మార్గం సుగమం చేసిన ఇద్దరు సైంటిస్టులను నోబెల్ బహుమతి వరించింది. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీలో విశేష కృషి చేసిన హంగేరికి చెందిన కాటలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వైజ్ మన్ లను ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ కు ఎంపిక చేసినట్లు సోమవారం స్వీడన్ లోని స్టాక్ హోంలో జరిగిన కార్యక్రమంలో నోబెల్ జ్యూరీ కమిటీ ప్రకటించింది. నోబెల్ అవార్డుల వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద విజేతలిద్దరికి నోబెల్ మెడల్స్, 11 మిలియన్ స్వీడిష్​ క్రోనార్ లు (రూ. 8.32 కోట్లు) క్యాష్ ప్రైజ్ సమానంగా అందజేస్తారు.  

వీళ్లు చేసిన రీసెర్చ్ ఏమిటి?

ప్రాణాంతక కరోనా వైరస్‌‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీకి వీరుఅభివృద్ధి చేసిన టెక్నాలజీయే కీలక పాత్ర పోషించింది. వీరు న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లను ఆవిష్కరించడం వల్లే.. కరోనాపై పోరాటానికి కీలకమైన, సమర్థవంతమైన ఫైజర్, మోడెర్నావంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనిపై 2005లోనే  వీరు ఓ పేపర్‌‌ను పబ్లిష్ చేశారు. అప్పట్లో అది అంతగా గుర్తింపు పొందలేదు. కానీ కరోనా టైమ్​లో సమర్థమైన టీకాలను అత్యంత తక్కువ సమయంలోనే అభివృద్ధి చేసేందుకు వీరి రీసెర్చ్ ఎంతో తోడ్పడింది. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివర్లో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీకి మార్గం సుగమం అయింది. 

వరుసగా నోబెల్ ప్రైజ్​ల ప్రకటనలు

2023కి సంబంధించిన నోబెల్ పురస్కారాల సందడి సోమవారం వైద్య రంగంలో విజేతల ప్రకటనతో మొదలైంది. వారం రోజుల పాటు ఇది కొనసాగుతుంది. మంగళవారం ఫిజిక్స్​లో, బుధవారం కెమిస్ట్రీలో, గురువారం లిటరేచర్, శుక్రవారం శాంతి విభాగాల్లో నోబెల్ ప్రైజ్​లు ప్రకటిస్తారు. అక్టోబర్‌‌ 9న ఎకనమిక్స్ లో విజేతల పేర్లను వెల్లడిస్తారు. స్వీడన్ సైంటిస్ట్, డైనమైట్ సృష్టికర్త ఆల్​ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ఈ అవార్డులను అందజేస్తున్నారు.

వైద్య నోబెల్ గెలుచుకున్న 13వ మహిళ కరికో..  

కాటలిన్ కరికో (68).. హంగేరియన్ – అమెరికన్ అయిన కాటలిన్ కరికో (68).. ఎంఆర్ఎన్ఏ మెకానిజంలో కీలక పరిశోధనలు చేశారు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్​ల తయారీకి మార్గం చూపించారు. హంగేరిలోని స్టెడ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్​గా, పెన్సిల్వేనియా యూనివర్సిటీలో అనుబంధ ప్రొఫెసర్​గా పని చేస్తున్నారు. వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న 13వ మహిళగా కరికో నిలిచారు. ఆమె బయో ఎన్​టెక్​లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్​గా ఉన్నారు. పెన్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ఆర్ఎన్ఏ ఇన్నోవేషన్స్​లో ప్రొఫెసర్, డైరెక్టర్​గా ఉన్న కాటలిన్.. వైజ్ మన్​ను 1990లో రీసెర్చ్ పేపర్స్ ఫొటోకాపీ చేస్తున్నప్పుడు అనుకోకుండా కలిశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కొన్ని రీసెర్చ్​లు చేశారు.  

ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ లో మార్పు గుర్తించిన వైజ్ మన్ 

అమెరికన్ ఫిజీషియన్ సైంటిస్ట్ అయిన డ్రూ వైజ్ మన్ (64) బ్రాండీస్ యూనివర్సిటీ నుంచి 1981లో బీఏ, ఎంఏ (బయో కెమిస్ట్రీ/ఎంజైమాలజీ) పట్టా పొందారు. 1987లో బోస్టన్ యూనివర్సిటీలో ఎండీ, పీహెచ్​డీ (ఇమ్యూనాలజీ/మైక్రోబయాలజీ) పూర్తి చేశారు. 1997 నుంచి పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఆర్ఎన్ఏ, ఇమ్యూన్ సిస్టమ్ బయాలజీపై పరిశోధనలు ప్రారంభించారు. పెన్సిల్వేనియా వర్సిటీలో రీసెర్చ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆర్ఎన్ఏ స్ట్రక్చర్​లో చిన్న మార్పును కనుగొన్నారు. అదే మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని గుర్తించారు. కరోనా వైరస్ ప్రబలినప్పుడు సైతం యూనివర్సిటీ ఆఫ్‌‌ పెన్సిల్వేనియాలో కరికోతో కలిసి వైజ్ మన్ పరిశోధనలు చేశారు.