
మనదేశంలో సైంటిస్ట్ ల కన్నా.. దొంగ బాబాలు బాగా ఫేమస్. ఇది సినిమా డైలాగే అయినా.. ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో జరుగుతుంటాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తుంటే.. సైంటిస్ట్ లు దాని పనిబట్టేందుకు పరిశోధనలు చేస్తున్నారు. పనిలో పనిగా దీన్ని ఆసరగా చేసుకొని డబ్బులు దండుకునేందుకు అమాయకులకు మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు కొంతమంది దొంగ బాబాలు . అలా ఓ బాబాని నమ్మిన 24 మంది కరోనా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు.
టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం…మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లా నాయపుర ప్రాంతంలో గత కొద్దిరోజులగా ఓ ప్రచారం జరుగుతుంది. జిల్లాలో ఓ బాబా ఉన్నాడని, ఆ బాబా ఎవరైతే తన వద్దకు వచ్చిన వారి చేతుల్ని ముద్దాడితే కరోనా సోకదని, సోకిన బాధితులకు వైరస్ తగ్గుముఖం పడుతుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అది నమ్మిన ప్రజలు బాబా దగ్గరకు వెళ్లి దర్శనం చేసుకునే వారు. దర్శనానికి వచ్చిన ఆ భక్తుల చేతుల్ని ముద్దాడి, ఏఏ పూజలు చేసి ఇంటికి పంపించే వాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోవడం అటు ప్రభుత్వానికి ఇటు వైద్య శాఖ అధికారులకు సవాలుగా మారింది. దీంతో కేసుల వ్యాప్తి పై ప్రభుత్వం నిఘూ పెంచింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం లోనే ఈ కిస్సింగ్ బాబా గురించి వెలుకులోకి వచ్చింది. బాబాను ఎవరు కలిశారు..? కలిసిన వారు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకొని వారందరికి డాక్టర్లు కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్ట్ ల్లో బాబా ముద్దు పెట్టిన 24 కరోనా సోకగా..బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా వైరస్ సోకిన 24మంది బాధితుల్లో నోడల్ అధికారి డాక్టర్ ప్రజాపతి ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం నోడల్ అధికారి బాబాను కలిసినట్లు సమాచారం. ఇక బాబా ఎక్కుడున్నాడని ఆరాతీయగా కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.