2 వేల కోట్ల క్రిప్టో కరెన్సీని నార్త్ కొరియా కొట్టేసింది

2 వేల కోట్ల క్రిప్టో కరెన్సీని నార్త్ కొరియా కొట్టేసింది

న్యూక్లియర్ వెపన్స్, మిస్సైల్స్
తయారీకి డబ్బులు కూడబెడుతోంది
యూఎన్ ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్ట్

యునైటెడ్ నేషన్స్: న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాంపై బ్యాన్ ఉండటంతో ఉత్తర కొరియా అడ్డదారులు తొక్కుతోంది. సైబర్ ఎటాక్​ల ద్వారా నిధులు కూడబెడుతోంది. ఇటీవల కొన్ని నెలల్లో 300 మిలియన్లకుపైగా డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని ఆ దేశం కొట్టేసినట్టు యునైటెడ్ నేషన్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. ప్యాంగాంగ్​పై ఆంక్షలను మానిటర్ చేస్తున్న ఎక్స్​పర్ట్​ల కమిటీ ఈ రిపోర్ట్​ను రెడీ చేసింది. ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎక్స్చేంజీలను హ్యాక్ చేసి 2019 నవంబర్ నుంచి 2020 నవంబర్ వరకు దాదాపు 316.4 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.3 వేల కోట్లు)క్రిప్టో కరెన్సీని చోరీ చేసినట్టు తెలిపింది. ఎక్కువ చోరీ కేసులు కిండటేడాదే నమోదైనట్టు రిపోర్ట్ పేర్కొంది. సైబర్ దాడుల కోసమే ఉత్తర కొరియా ఆర్మీ  వేలాది మంది హ్యాకర్లను ఉపయోగించినట్టు తెలిపింది. సౌత్ కొరియాతోపాటు ఇతర దేశాల సంస్థలను టార్గెట్ చేసింది. ఆర్థిక లాభం కోసం తన సైబర్ సామర్థ్యాలను ఉత్తర కొరియా వాడుకుంటోందని ఎక్స్ పర్ట్ లు ఆరోపించారు.

ఉత్తర కొరియానే చేసింది..

న్యూక్లియర్ వెపన్లు, బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాంతో పాటు నార్త్ కొరియాపై అంతర్జాతీయంగా చాలా ఆంక్షలు ఉన్నాయి.  2019 ఫిబ్రవరిలో హనోయ్​లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ చర్చలు కూడా జరిపారు.  కిందటేడాది అక్టోబర్, ఈ ఏడాది జనవరిలో మిలటరీ పరేడ్లలో ఉత్తర కొరియా కొత్త మిస్సైల్స్ ను ప్రదర్శించింది. అణ్వాయుద సంపత్తిని పెంచుకుంటామని ప్రెసిడెంట్ కిమ్ ప్రతిజ్ఞ కూడా చేశారు. 2020 సెప్టెంబర్ లో 281 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని చోరీ చేశారని, అప్పట్నుంచే తాము ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టామని యూఎన్ కమిటీ వెల్లడించింది. నెల రోజుల తర్వాత రెండో సైబర్ ఎటాక్ జరిగిందని, 23 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని దోచేశారని తెలిపింది.

2014లోనే సైబర్ ఎటాక్

ఉత్తర కొరియా సైబర్ సామర్థ్యాలు మొదటిసారి 2014లో బయటపడ్డాయి. కిమ్​పై  సెటైరికల్ ఫిలిం ‘ద ఇంటర్వ్యూ’ను తీసినందుకు  సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్​పై సైబర్ ఎటాక్ చేసింది. ఆ సంస్థకు చెందిన రిలీజ్ కాని సినిమాలు, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్లను ఆన్ లైన్​లో పెట్టింది. బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 81 మిలియన్ డాలర్లు, తైవాన్​కు చెందిన ఫార్ ఈస్టర్న్ బ్యాంక్ నుంచి 60 మిలియన్ డాలర్లు కూడా చోరీ చేసినట్టు ఉత్తర కొరియాపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను ఉత్తర కొరియా తిరస్కరించింది, సైబర్  ఎటాక్స్ తో తమకు సంబంధం లేదని చెప్పింది.