ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు..ముందుకొస్తలే

ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు..ముందుకొస్తలే
  • వ్యాపారులకు అవగాహన కల్పించి వదిలేసిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్, వెలుగు: 
ఫైర్ ​సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో గ్రేటర్​లో అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా, తీవ్ర ఆస్తి నష్టం జరుగుతున్నా వ్యాపారులు మాత్రం ఫైర్ ​సేఫ్టీని పట్టించుకోవడంలేదు. సికింద్రాబాద్ స్వప్నలోక్​లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత జీహెచ్ఎంసీ ముమ్మర ప్రచారం చేసింది. ప్రత్యేకంగా అవేర్ నెస్ ​ప్రోగ్రాంలు నిర్వహించినా ఫైర్ సేఫ్టీ కిట్లను ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడంలేదు.

నాలుగు కేటగిరీల కింద వ్యాపారాలు

ఇండివిజువల్​ షాపులు, కాంప్లెక్సులు తదితరాలు కలిపి గ్రేటర్ లో 6లక్షల చోట్ల ప్రధాన వ్యాపారాలు సాగుతున్నాయి. ఈ వ్యాపారాలను జీహెచ్​ఎంసీ అధికారులు నాలుగు కేటగిరీల కింద విభజించారు. ఇండివిజువల్ షాపులు ఉన్నవారు మొదటి కేటగిరీలోకి వస్తారు. రెండు స్మోక్ డిటెక్టర్లతో పాటు, మరో రెండు అగ్నిమాపక సిలిండర్లను వీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఒకే బిల్డింగ్​లో ఎక్కువ షాపులు ఉన్నవారు రెండో కేటగిరీలోకి వస్తారు. వీరంతా కలిపి కామన్​గా ఫైర్ సేఫ్టీ సిస్టం అమర్చుకోవాలి. ఇక మూడో కేటగిరీ బిల్డింగ్ ఓనర్లకు సంబంధించింది. బిల్డింగ్​లోని సెల్లార్లు క్లియర్ చేయడం, ఫైర్ ఎగ్జిట్ తదితర జాగ్రత్తలు తీసుకో
వాలి. టింబర్ డిపోలు, వేస్ట్ పేపర్ తదితర గోదాములు (రెడ్ కేటగిరీ కింద) నాలుగో కేటగిరీలోకి వస్తాయి. మూడు నెలల్లో ఆయా గోదాములను ఇండస్ట్రియల్ ఏరియాలకు షిఫ్ట్ చేయాలని అధికారులు ఇప్పటికే 2 వేల మందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇప్పటికే రెండు నెలలు గడిచినా ఆయా గోదాంలను మాత్రం తరలించడం లేదు.

వరుసగా అగ్నిప్రమాదాలు

గ్రేటర్​లో ఏదో ఒకచోట ప్రతిరోజు అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలో వరుసగా సంభవిస్తున్నాయి. గతేడాది మార్చి 23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చనిపోయారు. ఆ తర్వాత సికింద్రాబాద్​లోని రూబీ లాడ్జిలో సెప్టెంబర్ 12న అగ్ని ప్రమాదం చోటుచేసుకొని ఎనిమిది మంది మృతిచెందారు. అయినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో నాలుగు నెలల్లోనే మరో ప్రమాదం జరిగింది. ఈ ఏడాది జనవరి 19న సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్​లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్​లో ముగ్గురు మరణించారు. ఇదే ప్రాంతంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్​లో మార్చి 16న ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆరుగురు చనిపోయారు. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఏప్రిల్ 16న కుషాయిగూడలో అగ్ని ప్రమాదం జరిగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో మరోసారి జరగకుండా చూస్తామని మంత్రులు, మేయర్ సహా అధికారులు చెబుతున్నారు. కానీ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

అనుమతుల్లేని  గోదాములపై చర్యలేవి?

గ్రేటర్​లో అనుమతులు లేకుండా వేలాది బిజినెస్​లు కొనసాగుతున్నాయి. అక్రమంగా గోదాములను ఏర్పాటు చేసుకొని, ఎలాంటి సేఫ్టీ పాటించడంలేదు. మరికొందరు రెసిడెన్షియల్ అనుమతులు పొంది ఇల్లీగల్​గా గోదాములను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, వీటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. నివాస ప్రాంతాల్లో ఉన్న గోదాములను వెంటనే ఖాళీ చేయిస్తామని పదేపదే చెబుతున్నప్పటికీ తర్వాత పట్టించుకోవడంలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. స్వప్నలోక్ అగ్నిప్రమాదం తర్వాత గోదాములను పూర్తిగా ఇండస్ట్రియల్ ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. కొందరికి నోటీసులు ఇచ్చినప్పటికీ గోదాములను మాత్రం తరలించలేకపోతున్నారు.

సిబ్బంది కొరతా కారణమే..

ఫైర్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకోకపోవడానికి డీఆర్ఎఫ్ సిబ్బంది కొరత కూడా ఓ కారణమే. గ్రేటర్​లో 30 డీఆర్ఎఫ్ టీమ్స్​ ఉండగా.. మొత్తం 450 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఎక్కడ విపత్తు జరిగినా ఈ సిబ్బందే పరుగులు పెట్టాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కారణంగా ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోని వారిపై చర్యలు తీసుకోవడం కష్టంగా మారింది. పలు రకాల డ్యూటీలతో ఫైర్ సేఫ్టీపై సిబ్బంది ఫోకస్ పెట్టడంలేదు. దీంతో నిబంధనలు పాటించని వ్యాపారస్తులపై చర్యలు కరువవుతున్నాయి.

అధికారులు సూచిస్తున్నా..
జీహెచ్​ఎంసీ అధికారులు గత రెండు నెలలుగా అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఫైర్ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు సూచిస్తున్నారు. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు పొందిన ఆయా ఏజేన్సీలు నేరుగా దరఖాస్తుదారుడి వద్దకు వెళ్లి ఫైర్ సిస్టం అమర్చడంతో పాటు 
ఆన్​లైన్​లోనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం వెయ్యి మంది మాత్రమే ఇందుకు దరఖాస్తు చేసుకున్నారు. లక్షలు, కోట్లలో బిజినెస్​లు చేసే వారు కూడా ఫైర్ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేసుకోవడం లేదు.