నాయకులు కాదు.. మారాల్సింది ఓటర్లే!

నాయకులు కాదు.. మారాల్సింది ఓటర్లే!

మన దేశంలోని రాజకీయ నాయకుల నేర చరిత, కుంభకోణాల బాగోతాలను పరిశీలిస్తే.. సీబీఐ, సీఐడీ, ఈడీ కేసులు అంతిమంగా రాజకీయ నాయకుల పలుకుబడికి లొంగిపోక ఆయా కేసుల తుది తీర్పులను పరిశీలిస్తే తెలిసిపోతుంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నాయకులపై నేర ఆరోపణలు ఎన్ని వచ్చినా.. రిమాండ్ ఖైదీలుగా ఉండి శిక్ష పడకుండా రాజకీయ లాబీలతో బయటపడుతూండడం గమనించవచ్చు. రాజకీయ నాయకులు ఎంత నేర చరిత కలిగి ఉంటే.. ఎన్ని కుంభకోణాల్లో ఇరుక్కొని ఉంటే అంత గొప్ప నాయకులుగా, వీరులు, శూరులుగా ఆయా నాయకులను ప్రజలు గుర్తించి ఎన్నికల్లో గెలిపించి వారిని చట్టసభల్లోకి పంపుతున్నారని భావించవచ్చు. 

వారిని ప్రజలు వీరులుగా, శూరులుగా సమర్థులుగా చూస్తున్నారని భావించవచ్చు. గతం కంటే నేటి తరం ఓటర్లు, ప్రజలు అత్యధిక శాతం అక్షరాస్యత కలిగి ఉన్నప్పటికీ.. నైతిక విలువలపరంగా గతం కంటే నేడు ఎంతో వెనుకబడి ఉన్నారని నేటి నేర చరిత్ర, కుంభకోణాల చరిత్ర కలిగిన నాయకులు చట్టసభల్లోకి అడుగుపెడుతున్న తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. అక్షరాస్యత మనిషికి చైతన్యం తీసుకొస్తుందని భావించడం ఒకెత్తయితే.. మనిషిని మూర్ఖుణ్ణి చేయడానికి, నైతిక విలువలకు తిలోదకాలివ్వడానికి అక్షరాస్యత ప్రామాణికం కాదనే విషయం నేటి తరం ఓటర్లు, ప్రజల తీర్పులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా సమాజంలో మారాల్సింది నాయకులు కాదు. ఓటర్లు మాత్రమే.

- శ్రీనివాస్ గుండోజు, జర్నలిస్ట్​