విశ్లేషణ: ప్రాణాలు పోయినప్పుడు పరామర్శించడం కాదు.. గని వెంటనే మూసెయ్యాలి

విశ్లేషణ: ప్రాణాలు పోయినప్పుడు పరామర్శించడం కాదు.. గని వెంటనే మూసెయ్యాలి
  • ఇలాంటి గని కోల్ ఇండియాలో ఎక్కడా లేదు
  • ప్రాణాలు పోయినప్పుడు పరామర్శించడాలు మామూలే
  • ప్రయోజనం లేని అడ్రియాల బొగ్గు బాయిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు ?
  • విపరీతమైన వేడి.. వెంటిలేషన్​ లేదు..
  • నీళ్లు ఊరిపోతున్నాయి.. మోటార్స్​ మునిగిపోతుంటాయి.. 
  • ఇయ్యన్నీ తట్టుకుని వాళ్లు నిలబడి పనిచెయ్యాలి
  • ఇదీ సింగరేణి అడ్రియాలలోని బొగ్గు బాయిలో పనిచేసే కార్మికుల పరిస్థితి


మృత్యు గుహల్లాంటి బొగ్గు బావుల్లో కిలోమీటర్ల లెక్కన లోతుల్లోకి వెళ్లి.. ప్రమాదాల అంచున పని చేస్తూ జాతి సంపదను వెలికి తీస్తున్న నల్ల సూర్యుల ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోతున్నారు. ఆడ ఎంతమంది పని చేస్తుర్రు.. ఎంతమంది చస్తుర్రు అన్న విషయాలకు అసలు రిపోర్టే లేదు. అసలు ఎందుకు ఆ పని చేయాలి? గనిని నడపడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చనిపోయిన కుటుంబాలకు సమాధానం చెప్పి తీరాలి

సోమవారం గోదావరిఖనిలోని అడ్రియాల(ఏఎల్పీ) లాంగ్ వాల్ గనిలో పైకప్పు కూలి ఏడుగురు కార్మికులు బండ కింద ఎస్డీఎల్ మిషన్​లో ఇరుక్కుపోయారు. రెస్క్యూ ఆపరేషన్​తో నలుగురు బయటపడగా ముగ్గురు చనిపోయారు. ఇందులో ఇద్దరు అధికారులు కాగా, ఒకరు కాంట్రాక్టు కార్మికుడు ఉన్నాడు. ఏరియాసేఫ్టీ ఆఫీసర్​గా ఉన్న డీజీఎం స్థాయి అధికారి జయరాజు, డిప్యూటీ మేనేజర్ తేజవత్, కాంట్రాక్టు వర్కర్ తోట నరేష్ ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించినా ప్రయోజనం లేకోయింది. గతంలో ఇదే గనిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రక్షణ చర్యలు చేపడుతున్న సందర్భంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.
రిపోర్టులు రాయని సిబ్బంది..
2020 లో పది మంది.. 2021లో 12 మంది కార్మికులు సింగరేణి గని ప్రమాదాల్లో చనిపోయారు. ఈ రెండేండ్లలో 3,000 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇందులో సగానికి పైగా రిపోర్ట్ రాయలేదు. రిపోర్ట్​లు రాస్తే గనికి రిమార్కు వస్తుందని, గనిలో ఎక్కువగా రిపోర్టులు రాయరు. గాయమైన కార్మికుడి అనధికార మస్టర్ రెస్ట్​లు ఇస్తూ ఉంటారు. సింగరేణిలోనే కాదు, కోల్ ఇండియాలోనూ ఈ ప్రాక్టీసు షరా మామూలు అయిపోయింది. అడ్రియాల గని ప్రమాదంలో ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోవడంతో అధికారులకు పెద్ద షాక్ తగిలినట్లు అయింది. ప్రమాదం జరిగిన ఏఎల్పీ గని పూర్తి విదేశీ టెక్నాలజీతో నడిచే దేశంలోని మొట్టమొదటి గని. ఇలాంటి గని కోల్ ఇండియాలో ఎక్కడా కూడా లేదు.
పదేండ్లు దాటుతున్నా లక్ష్యం రీచ్​ కాలే..
సింగరేణిలో 2006 లో ప్రారంభించిన ఈ గని పనిముట్లు 600 దాకా ఉంటాయి. బోల్టర్​లు, కేబుల్, షేరర్​కు అవసరమైన పరికరాలు ఇలా అన్నీ అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, జర్మన్ ఇలా విదేశాల నుంచి తెప్పిస్తారు. 2013 నుంచి ఈ గని ఉత్పత్తి ప్రారంభించారు. మొత్తం1284 కోట్ల రూపాయల క్యాపిటల్​తో ప్రారంభించిన ఈ గని జీవిత కాలం 44 సంవత్సరాలు ఉంది. ఉత్పత్తి ప్రారంభించి10 ఏండ్లు దాటినా కనీసం మూడేండ్ల లక్ష్యాన్ని కూడా ఇప్పటికీ రీచ్ కాలేదు. దీనికి ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు నిపుణులు కన్సల్టెంట్లుగా ఉన్నారు. టన్ను బొగ్గు ఉత్పత్తి మీద రూ.1,020 నష్టాల్లో ఈ గనిని నడిపిస్తున్నారు. రూఫ్ సైడ్ కూలడం.. గనిలో బొగ్గు ఫైర్ రావడం.. నీరు చేరడం.. నీటి పంపింగ్ లాంటి సమస్యలతో గనిలోని కార్మికులు పనిచేసేందుకు సతమతమవుతున్నారు.
ఎందుకు నడపాలె..
చాలా నష్టాల్లో ఉన్న అడ్రియాల గనిని నడపడం అవసరమా? గనిపై పూర్తి స్థాయిలో విచారణ అవసరం. గనిలో చిక్కుకున్న నలుగురిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. సీఎం కేసీఆర్ పరిస్థితి తెలుసుకుని ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా ప్రాణాలు పోయినప్పుడు పరామర్శించడాలు తప్ప.. ప్రయోజనం లేని అడ్రియాల బొగ్గు బాయిని ఇంకా కొనసాగించే విషయం మీద పునరాలోచించాలి.
విపరీతమైన వేడి.. వెంటిలేషన్​ ఉండదు.. నీళ్లు ఊరిపోతుంటాయి.. మోటార్స్​ మునిగిపోతుంటాయి.. ఇయ్యన్నీ తట్టుకుని వాళ్లు నిలబడి పనిచెయ్యాలి. ఇదీ సింగరేణి అడ్రియాలలోని బొగ్గు బాయిలో పనిచేసే కార్మికుల పరిస్థితి. ఇంత కష్టపడుతున్నా వారి ప్రాణాలకు గ్యారంటీ మాత్రం లేకుండా పోయింది. వాళ్ల బతుకుల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీకుండా పోతోంది. మృత్యు గుహల్లాంటి బొగ్గు బావుల్లో కిలోమీటర్ల లెక్కన లోతుల్లోకి వెళ్లి.. ప్రమాదాల అంచున పని చేస్తూ జాతి సంపదను వెలికి తీస్తున్న నల్ల సూర్యుల ప్రాణాలను ఎవరూ కాపాడలేకపోతున్నారు.

ఆడ ఎంతమంది పని చేస్తుర్రు.. ఎంతమంది చస్తుర్రు అన్న విషయాలకు అసలు రిపోర్టే లేదు. అసలు ఎందుకు ఆ పని చేయాలి? గనిని నడపడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. చనిపోతున్న వారిండ్లకెళ్లి సీఎం సంతాపం తెలపడం తప్ప వారిని ఆదుకునే దిక్కు లేకుండాపోతోంది. అందుకే ఈ గని పనిపై పూర్తి విచారణ జరపాలి. చనిపోయిన కుటుంబాలకు సమాధానం చెప్పి తీరాలి. వెంటనే అడ్రియాల బొగ్గు బాయిని మూయించాలి.
భారీ నష్టాల్లో గని..
ఏఎల్పీ గని భారీ నష్టాల్లో కొనసాగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సింగరేణికి, అడ్రియాల ఒక తెల్ల ఏనుగులా మారిపోయింది. ఇన్ని గోసలు పడుతూ  గనిని నడుపుడు, ప్రాణ నష్టాలు భరిస్తూ మోసుడు ఎందుకో సీఎండీ, ఇతర అధికారులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే 10 ప్యానల్​ల పని పూర్తి కావాల్సి ఉండగా 3వ ప్యానల్ నే ఇటీవల మొదలు పెట్టారు. ఈలోపులోనే ఇంతటి  ఘోర ప్రమాదం జరిగింది. ఈ గనిలో నైపుణ్యం, అనుభవం, రిస్క్ ఏదీ పని చేయడం లేదు. 1,300 మంది సింగరేణి కార్మికులు, 260 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు 6–5 షిఫ్ట్ లలో పని చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు చైనా నిపుణులు ఈ గనిలో30 మంది టెక్నాలజీ మీద పని చేసే వారు. కరోనా కారణంగా ఏడాది కింద వాళ్లు వెళ్లిపోయారు. వారి స్థానంలో పోలండ్ నిపుణులు 16 మంది పని చేస్తున్నారు. - ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్.