వరదొచ్చేలోగా కాల్వ రిపేర్లు పూర్తి చేస్తాం

వరదొచ్చేలోగా కాల్వ రిపేర్లు పూర్తి చేస్తాం

ఎన్‌ఎస్పీ సీఈ అజయ్​ కుమార్​ 

హాలియా, వెలుగు: రిజర్వాయర్‌‌కు వరద వచ్చేలోగా కాల్వ రిపేర్లను పూర్తి చేస్తామని ఎన్‌ఎస్పీ సీఈ అజయ్ ​కుమార్​చెప్పారు. నల్గొండ జిల్లా హాలియా సమీపంలోని 16వ కిలోమీటర్ వద్ద జరుగుతున్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వ లైనింగ్​ రిపేర్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  కాల్వ నాలుగు నెలల కింద కోతకు గురికావడంతో తాత్కాలికంగా ఇసుక బస్తాలను వేసి మరమ్మతులు చేపట్టామన్నారు. ప్రస్తుతం కాల్వకు నీటి విడుదల నిలిపివేసి రూ. 16 లక్షలతో రిపేర్లు చేస్తున్నామని చెప్పారు. 100 మీటర్ల మేర మట్టిని తొలగించి కొత్త మట్టిని నింపడంతో పాటు  సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తున్నామన్నారు. 

అలాగే 18 కిలోమీటర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న 5 వేల మీటర్ల మేర రిపేర్లకు రెండోసారి టెండర్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు.   మేజర్, మైనర్ కాల్వల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త, ముళ్లకంపలను తొలగించేందుకు ఈజీఎస్‌ కింద అవకాశం కలిగిందన్నారు.  దీనిద్వారా రైతులు, కూలీలకు ఉపాధి దొరుకుతుందన్నారు. అయన వెంట ఈఈ లక్ష్మణ్, డీఈ సంపత్ తదితరులు ఉన్నారు.