14 నుంచి 6కు.. 70 ఏండ్లలో సగానికిపైగా తగ్గిన జాతీయ పార్టీలు

14 నుంచి 6కు.. 70 ఏండ్లలో సగానికిపైగా తగ్గిన జాతీయ పార్టీలు
  •     మొదటి లోక్​సభ ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు 53
  •     ప్రస్తుత రాజకీయ పార్టీల సంఖ్య 2,500
  •     ఏడు దశాబ్దాల్లో పార్టీల్లో ఎన్నో మార్పులు

న్యూఢిల్లీ: దేశంలో ఏడు దశాబ్దాల కాలంలో జాతీయ పార్టీల సంఖ్య సగానికంటే తక్కువకు పడిపోయింది. 1951లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 14 జాతీయపార్టీలు పోటీలో ఉంటే.. 2024కు వచ్చేసరికి వాటి సంఖ్య 6కు తగ్గింది. అదేసమయంలో జాతీయ, రాష్ట్ర పార్టీలు కలిపి మొదటి ఎన్నికల్లో కేవలం 53 మాత్రమే ఉండగా.. ఇప్పుడు మొత్తం పార్టీల సంఖ్య 2,500కు చేరుకున్నది. 

70  ఏండ్లలో రాజకీయ పార్టీల ప్రస్థానమంతా విలీనాలు.. కొత్త పార్టీల ఆవిర్భావం.. జాతీయ పార్టీల హోదా దక్కించుకోవడం, కోల్పోవడంలాంటి అంశాలతో ఆసక్తికరంగా సాగింది. 1951లో నిర్వహించిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 53 పార్టీలు కంటెస్ట్​ చేస్తే అందులో 14 జాతీయ పార్టీలు ఉన్నాయి. మిగిలినవి రాష్ట్ర పార్టీలు. ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా ముద్రించిన ‘లీప్​ ఆఫ్​ ఫెయిత్’ బుక్​ ప్రకారం.. 1953 ఎన్నికలకు ముందు మొత్తం 29 పార్టీలు జాతీయ హోదా కోసం డిమాండ్​ చేశాయి. 

అయితే అందులో 14 పార్టీలకే జాతీయ పార్టీ హోదా దక్కింది. ఎన్నికల తర్వాత 4 పార్టీలు మాత్రమే ఆ హోదాను నిలుపుకోగలిగాయి. అందులో కాంగ్రెస్​, ప్రజా సోషలిస్ట్​ పార్టీ (సోషలిస్ట్​ పార్టీ, కిసాన్​ మజ్దూర్​ పార్టీ కలయిక), సీపీఐ, జనసంఘ్​ ఉన్నాయి. మిగతా 10 పార్టీలు జాతీయ హోదా కోల్పోయాయి. 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీల సంఖ్య 15కు తగ్గిపోయింది. నాలుగు జాతీయ పార్టీలు పోటీలో నిలిచాయి. 1962లో జరిగిన ఎన్నికల్లో 27 పార్టీలు పోటీచేయగా, సోషలిస్ట్​ (ఎస్​ఓసీ), స్వతంత్ర (ఎస్​డబ్ల్యూఏ)తో కలిపి జాతీయ హోదా కలిగిన పార్టీల సంఖ్య ఆరుకు పెరిగింది. 

ఏండ్లపాటు కొనసాగిన కాంగ్రెస్​ ఆధిపత్యం

మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలాఏండ్ల వరకు కాంగ్రెస్​ ఆధిపత్యం కొనసాగింది. 2014 వరకు మొత్తం 14 ఎన్నికల్లో 11 సార్లు గెలిచి, జైత్రయాత్ర కొనసాగించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో గాలి బీజేపీవైపు మళ్లింది. 1951 తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో సీపీఐ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. 1964లో సోవియట్, చైనీస్​ కమ్యూనిస్ట్​ వర్గాలుగా చీలిపోయి సీపీఐ (మార్క్సిస్ట్​) పార్టీ ఏర్పడింది. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం  పార్టీ సీపీఐ కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తూ దూసుకుపోయింది. ఇప్పటివరకూ 1992 లోక్​సభ ఎన్నికల్లో అతి తక్కువ (7) పార్టీలు మాత్రమే పోటీ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎం, జనతాదళ్​, జనతా పార్టీ, లోక్​దళ్​ పోటీలో నిలిచాయి. 

1996 ఎన్నికల్లో 8 జాతీయపార్టీలు సహా 209 పార్టీలు బరిలో నిలిచాయి. 1998లో 176, 1999లో 160 పార్టీలు సమరశంఖం పూరించాయి. 2014కు వచ్చేసరికి ఆరు జాతీయపార్టీలు సహా 464 పార్టీలు బరిలో నిలిచాయి. తృణమూల్​ కాంగ్రెస్​ కు 2016లో జాతీయహోదా దక్కగా, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ జాతీయ హోదాలో పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్​, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఏఐటీసీ సహా 674 పార్టీలు పోటీ చేశాయి. అయితే,  టీఎంసీ​, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ) రెండూ జాతీయహోదా కోల్పోయాయి. 

గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీని ఈసీ జాతీయ పార్టీగా గుర్తించింది. అదే సమయంలో టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ జాతీయ పార్టీ హోదా కోల్పోయాయి. ఒక పార్టీకి జాతీయ హోదా దక్కితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు ఒకే గుర్తు ఉంటుంది. అలాగే, ఆ పార్టీకి దేశ రాజధానిలో కార్యాలయంలో కోసం స్థలాన్ని కేటాయిస్తారు. కాగా, ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, నేషనల్​ పీపుల్స్​ పార్టీ, సీపీఎం, ఆమ్​ ఆద్మీపార్టీ జాతీయ హోదాలో పోటీ చేస్తున్నాయి.