ఓబీసీ లిస్టు తయారీ రాష్ట్రాల ఇష్టం

ఓబీసీ లిస్టు తయారీ రాష్ట్రాల ఇష్టం
  • ఓబీసీ లిస్టు తయారీ.. ఇక రాష్ట్రాల ఇష్టం
  • లోక్​సభలో బిల్లు పెట్టిన కేంద్ర మంత్రి
  • ఆమోదం పొందితే.. సొంతంగా రూపొందించుకోవచ్చు
  • జాతీయ బీసీ కమిషన్‌తో సంబంధం లేకుండా నోటిఫై చేయొచ్చు
  • బిల్లుకు మద్దతు ఇస్తామన్న ప్రతిపక్ష పార్టీలు

న్యూఢిల్లీ: తమ ఓబీసీ జాబితాను సొంతంగా రూపొందించుకునే అధికారాన్ని తిరిగి రాష్ట్రాలకే కట్టబెడుతూ తీసుకొచ్చిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌‌సభ ముందుకు వచ్చింది. సోమవారం ఈ బిల్లును కేంద్ర సోషల్ జస్టిస్, ఎంపవర్‌‌‌‌మెంట్ మంత్రి వీరేంద్రకుమార్ ప్రవేశపెట్టారు. ‘‘తమ సొంత ఎస్‌‌ఈబీసీ (సామాజికంగా, చదువుల పరంగా వెనుకబడిన తరగతులు) జాబితాను సిద్ధం చేసేందుకు, నిర్వహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారం కల్పించాం. దేశ సమాఖ్య నిర్మాణాన్ని కొనసాగించేందుకు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ఏని సవరించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఆర్టికల్ 338బీ, 366లోనూ సవరణలు చేయాల్సి ఉంది” అని వీరేంద్ర కుమార్ చెప్పారు. ఈ బిల్లుతో జాతీయ బీసీ కమిషన్‌‌కు ప్రతిపాదించకుండానే సొంతంగా ఓబీసీలను గుర్తించి నోటిఫై  చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది.

బిల్లును వెంటనే పాస్ చేయాలె: అపొజిషన్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లును పాస్ చేసేందుకు మద్దతు ఇస్తామని పలు ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి. ‘‘ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతోంది. మేం దీనికి శాంతియుతంగా సపోర్ట్ చేస్తాం. చర్చ జరిగిన వెంటనే బిల్లును పాస్ చేయాలి” అని రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపొజిషన్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కూడా తాము మద్దతు ఇచ్చామని, ఇప్పుడు కూడా బీసీల కోసం సపోర్టు చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన లీడర్లు సోమవారం పార్లమెంటు కాంప్లెక్సులో భేటీ అయ్యారు.  వర్షాకాల సమావేశాలు త్వరలో ముగియనుండటంతో.. పెగాసస్ స్నూపింగ్, రైతు సమస్యలపై పాటించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్‌‌తోపాటు డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, శివసేన, ఎస్పీ, సీపీఎం, ఆర్జేడీ, ఆప్, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, ఎల్జేడీ ఆర్ఎస్పీ, కేసీఎం తదితర పార్టీల లీడర్లు హాజరయ్యారు.

మరో సవరణ బిల్లుకు ఆమోదం..
కాన్‌‌స్టిట్యూషన్(షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ అమెండ్‌‌మెంట్‌‌ బిల్లును వాయిస్ ఓటు ద్వారా లోక్‌‌సభ ఆమోదించింది. అరుణాచల్ ప్రదేశ్‌‌ రికమండ్ చేసిన షెడ్యూల్డ్ ట్రైబ్స్‌‌ కాన్‌‌స్టిట్యూషనల్ లిస్టును సవరించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. రాజ్యసభ గతవారమే ఆమోదించగా.. సోమవారం ఆందోళనల మధ్యే లోక్‌‌సభ పాస్ చేసింది. బిల్లు ప్రకారం.. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌‌కు సంబంధించి షెడ్యూల్డ్ తెగల జాబితాలోని 18 కమ్యూనిటీల్లో కొన్నింటి పేర్లు మార్చి, ఇంకొన్నిటిని రిప్లేస్ చేశారు. సీరియల్ నంబర్ 16లో ఆది.. సీరియల్ నంబర్ 1లో ఉన్న అబోర్(ట్రైబ్) ఒక్కటే కావడంతో.. ప్రస్తుతం అబోర్‌‌‌‌ను తొలగించారు. సీరియల్ నంబర్ 6 లో కంప్టి స్థానంలో తాయ్ కంప్టిని రిప్లేస్ చేశారు.