మ్యూల్ ఖాతా నేరాలు : వేలి ముద్రగాళ్లు.. సైబర్ నేరగాళ్లతో దోస్తీ.. రూ.10 కోట్లు సంపాదించారు

మ్యూల్ ఖాతా నేరాలు : వేలి ముద్రగాళ్లు.. సైబర్ నేరగాళ్లతో దోస్తీ.. రూ.10 కోట్లు సంపాదించారు

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా కొత్త కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారు.  అమాయకులే వీరి టార్గెట్.. ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా వివరాలు సేకరించడం.. వారికి తెలియకుండానే లావాదేవీలు నడిపించడం ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. గ్రామాల్లోకి వెళ్లి అమాయకులకు కమిషన్ల ఆశచూసి వారి ధృవపత్రాలను ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిపించి మరీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చిన ఘటన చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. 
అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచుకునేందుకు మ్యూల్ ఖాతాలను అమాయకులచేత తెరిపిస్తున్నారు. మధ్యవర్తులను నియమించుకొని కమిషన్లు ఇస్తూ ఖాతాదారులకు తెలియకుండా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..  అక్రమంగా సంపాదించిన డబ్బును దాచడం.. అక్రమ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల తరపున మ్యూల్ ఖాతాలను తెరిచిన ముగ్గురు వ్యక్తులను ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. నిందితులు పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మేదినీ పూర్ కు చెందిన షేక్ హపిజుల, షేక్ జమంగీర్, షేక్ జమీరుద్దీన్ లుగా గుర్తించారు.  వీరిని విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. 5వేల మ్యూల్ ఖాతాల వివరాలను సైబర్ స్కామర్లతో పంచుకోవడం ద్వారా ఈ ముఠా రూ. 10 కోట్ల కమిషన్ పొందినట్టు పోలీసులు తేల్చారు. 
 
సంబంధంలేని వ్యక్తి  లేదా వ్యాపారం తరపున చట్ట విరుద్ధంగా సంపాదించిన డబ్బును బదిలీ చేసే చర్యను మనీ మ్యూలింగ్  లేదా మ్యూల్ ఫ్రాడ్ అంటారు.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఒడిశాల జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లో ని అమాయకులను ప్రేరేపించి వారి ధృవ పత్రాలతో బ్యాంకు ఖాతాల తెరిపించారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ. 2వేల కమిషన్ ఇచ్చారు. అయితే ఇందులో ఉన్న మోసం గురించి వారికి తెలియదు. ఆన్ లైన్ లావాదేవీలకు అవసరమైన OTPలను స్వీకరించేందుకు సైబర్ నేరగాళ్ల మొబైల్ నెంబర్లు బ్యాంకు ఖాతాలకు లింక్ చేశారు. 

నిందితులు  ఒక్కో మ్యూల్ ఖాతాను సైబర్ స్కామర్లకు రూ. 20 వేల అమ్మి మోసం చేసిన సొమ్మును దాచిపెట్టి కాజేశారు. ఇటువంటి చట్ట విరుద్ధమైన ప్రయోజనాలకోసం మ్యూల్ ఖాతాలపై సైబర్ నేరగాళ్లు పూర్తి కంట్రోల్ కలిగి ఉన్నారు. 

ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి జమీరుద్దీన్ గా పోలీసులు గుర్తించారు. మ్యూల్ ఖాతాలను తెరిచేందుకు నెలకు రూ. 15వేల చొప్పున 1015 మందిని నియమించుకున్నాడు. మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను విక్రయించేందుకు రహస్య వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీలు, టెలిగ్రామ్ ఛానళ్లను వినియోగించేవారు. ఇప్పటివరకు 5వేల బ్యాంకు ఖాతాలను విక్రయించారు. సుమారు రూ. 10 కోట్ల కమిషన్ అందుకున్నారు.  

అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు నేరుగా సైబర్ నేరానికి పాల్పడనప్పటికీ మ్యూల్ ఖాతాలను ఏర్పాటు చేయడంలో స్కామర్లకు సహాయం చేశారు. వివిధ రాష్ట్రాల్లో సైబర్ మోసగాళ్లను నిందితులు ఎలా సంప్రదించారనే విషయం పై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.