మన దగ్గరే మొదలైన ‘కవచ్’

మన దగ్గరే మొదలైన ‘కవచ్’
  • దేశంలోనే తొలిసారి దక్షిణమధ్య రైల్వేలో అమలు
  • ప్రస్తుతం 1,465 కి.మీ. పరిధిలో అందుబాటులోకి.. 
  • వచ్చే ఏడాది న్యూఢిల్లీ–హౌరా, న్యూఢిల్లీ–ముంబై రూట్లలో..  

హైదరాబాద్, వెలుగు: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో రైల్వే రక్షణ వ్యవస్థ ‘కవచ్’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైలు ప్రమాదాలను నివారించేందుకు తీసుకొచ్చిన ఈ వ్యవస్థ.. అక్కడ అందుబాటులో ఉండుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కవచ్ సిస్టమ్ దేశంలోనే తొలిసారి మన దగ్గరే అందుబాటులోకి వచ్చింది. దక్షిణమధ్య రైల్వేలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, పోయినేడాది మార్చిలో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్​గా నిర్వహించారు. మొదట వాడి–వికారాబాద్‌–సనత్‌నగర్‌, వికారాబాద్‌–బీదర్‌ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్‌ చేస్తూ 264 కిలోమీటర్ల పరిధిలో కవచ్‌ సిస్టమ్ ఏర్పాటు చేశారు. తర్వాత 32 స్టేషన్లలో మరో 322 కిలోమీటర్లు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం పోయినేడాది మరో 77 స్టేషన్లలో 859 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. మొత్తంగా 136 స్టేషన్లలో 1,465 కిలోమీటర్లు కవర్ చేస్తూ కవచ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దీని కింద మన్మాడ్‌–ముద్‌ఖేడ్‌–నిజామాబాద్‌– సీతాఫల్‌మండి–కర్నూలు–గుంతకల్‌, పర్భణి–బీదర్‌–వికారాబాద్‌–వాడి, వాడి–సనత్‌నగర్‌ సెక్షన్లు కవర్ అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ర్ట, తమిళనాడులో కలిపి 5,734 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 1,465 కిలోమీటర్ల పరిధిలో 136 స్టేషన్లలో కవచ్ అమలవుతోందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాగా, కవచ్ ఇక్కడ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోపు న్యూఢిల్లీ–హౌరా, న్యూఢిల్లీ–ముంబై రూట్లలో అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పుడు ఘోర ప్రమాదం జరగడంతో కవచ్ అమలును స్పీడప్ చేసే అవకాశం ఉంది.

కవచ్ ఉపయోగాలివీ.. 

రైళ్లు రెడ్‌ సిగ్నల్‌ దాటడాన్ని నివారిస్తుంది. అధిక వేగ నియంత్రణకు ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఉంటుంది. రైళ్లు లెవెల్‌ క్రాసింగ్‌ దాటే సమయంలో గేట్ల వద్ద ఆటోమేటిక్ గా హారన్ వస్తుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా నివారిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సందేశాలు పంపుతుంది.

కవచ్ అమలవుతున్న రూట్లు.. 

మన్మాడ్–ధర్మాబాద్ (397 కి.మీ), పర్భణి–ఉద్గిర్ (179), ఉద్గిర్–బీదర్ (62), బీదర్-–మటాల్ కుంట (19.01), కుర్గుంట–వాడి (51.15), ధర్మాబాద్-–అలంపూర్ రోడ్ (432.2), సనత్​నగర్–వాడి (123.07), వికారాబాద్–మటాల్ కుంట (71.77), అలంపూర్ రోడ్–గుంతకల్లు (129.8). దేశవ్యాప్తంగా అమలు చేయాలి..

దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో దశల వారీగా కవచ్ ను అమలు చేయాలి. బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ జోన్ ( ఒడిశా ) లో కవచ్ అమలు కావడం లేదు. ఈ టెక్నాలజీ అమల్లో ఉండుంటే, ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. 
–శివకుమార్, దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నేత