ఆఫీస్‌ స్పేస్ అమ్మకాల్లోహైదరాబాద్‌ టాప్‌

ఆఫీస్‌ స్పేస్ అమ్మకాల్లోహైదరాబాద్‌ టాప్‌
  • బెంగళూరును వెనక్కి నెట్టి మొదటిస్థానంలో
  • భారీగా గ్రాస్‌‌ లీజింగ్‌‌ అగ్రిమెంట్లు
  • వెల్లడించిన  కొల్లియర్స్  స్టడీ రిపోర్టు

న్యూఢిల్లీ:మెట్రో సిటీల్లో ఆఫీసు స్పేసుకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. ఈ విషయంలో హైదరాబాద్‌‌ జెట్‌‌స్పీడ్‌‌తో దూసుకెళ్తోంది. ఇండియా సిలికాన్‌‌ హబ్‌‌గా పేరున్న బెంగళూరును కూడా అధిగమించింది.  ఈ ఏడాది జూలై–సెప్టెంబరు క్వార్టర్‌‌లో 2.5 మిలియన్ చదరపు అడుగుల గ్రాస్‌‌ లీజింగ్‌‌తో హైదరాబాద్‌ మార్కెట్ లీడర్‌‌గా నిలిచిందని అమెరికాకు చెందిన ప్రొఫెషనల్‌‌ సర్వీసుల కంపెనీ కొలియర్స్‌‌ ఓ స్టడీలో పేర్కొంది. స్కూటర్‌‌ అనే ఆఫీసు మార్కెట్‌‌ ఆపరేటర్ కూడా హైదరాబాద్‌‌లో బుధవారం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కొలియర్స్ రిపోర్టు ప్రకారం...  ఆరు ప్రధాన నగరాల్లో జూలై–--సెప్టెంబర్ క్వార్టర్​లో గ్రాస్‌‌ లీజింగ్ ఆఫీస్ స్థలం కొనుగోలు గత ఏడాది సెప్టెంబరు క్వార్టర్​తో పోలిస్తే 34 శాతం పెరిగాయి. ఈ స్పేస్‌ 10.3 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఇదే టైమ్‌లో  బెంగళూరులో  గ్రాస్‌‌ లీజింగ్ 2.5 మిలియన్ చదరపు అడుగుల నుండి 2.1 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. చెన్నైలో లీజింగ్ 0.8 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.3 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఢిల్లీ--–ఎన్‌‌సిఆర్‌‌లో ఆఫీస్ స్పేస్ కొనుగోలు పరిమాణం 0.9 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.5 మిలియన్ చదరపు అడుగుల వరకు పెరిగింది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్‌‌కు డిమాండ్ 1.9 మిలియన్ చదరపు అడుగుల నుండి 2.5 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ముంబైలో లీజింగ్ పరిమాణం 1.4 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.2 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయాయి. పూణేలో, ఈ క్యాలెండర్ సంవత్సరం మూడవ క్వార్టర్‌‌లో గ్రాస్‌‌ లీజింగ్ 1.7 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో 0.3 మిలియన్ చదరపు అడుగులు మాత్రమే అమ్ముడయింది. 2021 క్యూ 3 లో గ్రాస్‌‌ లీజింగ్స్​లో ఐటీ సెంటర్లుగా పేరున్న హైదరాబాద్, బెంగళూరు  పూణే సిటీల వాటా 62 శాతం ఉంది.
రిస్ట్రిక్షన్ల తొలగింపుతో పెరిగిన బిజినెస్‌‌ 
కొవిడ్ మహమ్మారి  రెండవ వేవ్ తర్వాత కార్పొరేట్ల నుంచి, ఐటీ కంపెనీల నుంచి కోవర్కింగ్‌‌ ఆఫీసులకు డిమాండ్‌‌ పెరిగింది.   సీక్వెన్షియల్‌‌గా చూస్తే జూలై-–సెప్టెంబర్‌‌లో ఆఫీస్ స్పేస్ కొనుగోలు 89 శాతం పెరిగాయి.  "తాజా క్వార్టర్‌‌  మార్కెట్లో జోష్‌‌ తీసుకువచ్చింది. సౌకర్యవంతమైన వర్క్‌‌స్పేస్ ను అందజేసే ఆపరేటర్లు భారీగా డీల్స్‌‌ సంపాదిస్తున్నారు. కరోనాకు ముందు మాదిరే పెద్ద డీల్స్ మళ్లీ వస్తున్నాయి" అని కొలియర్స్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ చెప్పారు.   గత ఏడాది కొంత వెనుకంజ కనిపించినా, ఈ ఏడాది ఆఫీసు స్పేస్‌‌ కొనుగోలుకు కోసం కంపెనీలు వెనుకాడటం లేదన్నారు. "రాబోయే క్వార్టర్‌‌లో ఆశావాదం ఇంకా బలపడుతుంది. థర్డ్‌‌ వేవ్‌‌ లేకుంటే పరిస్థితులు మునుపటి స్థితికి వస్తాయి. మెజారిటీ ఉద్యోగులకు ఆఫీసుల నుంచే పనిచేస్తారు. కంపెనీలు మరింత ఆఫీసు స్పేసును తీసుకుంటాయి" అని నాయర్ చెప్పారు. ఫ్లెక్సిబుల్‌‌ వర్క్‌‌స్పేస్ ఆపరేటర్ల లీజింగ్ వాటా కూడా జూలై–-సెప్టెంబర్ కాలంలో 26 శాతానికి పెరిగింది.  క్లయింట్లు మేనేజ్డ్ స్పేస్‌‌, షార్ట్ టర్మ్‌‌ లీజులవైపు మొగ్గుచూపుతున్నారు. భవిష్యత్‌‌లో ఏవైనా ఆటుపోట్లు ఎదురైతే తట్టుకోవడానికి వీలుగా ఇప్పుడే ఆఫీసు స్పేసును తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి–-సెప్టెంబర్ మధ్య ఆఫీస్ స్పేస్ ఆరు మెట్రో సిటీల్లో 20.7 మిలియన్ చదరపు అడుగుల నుండి 20.4 మిలియన్ చదరపు అడుగులకు (కేవలం ఒకశాతం) పడిపోయింది. "పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగుల సంఖ్య పెరిగింది. వాళ్లంతా ఆఫీసులకు రావడం మొదలయింది. కరోనా రిస్ట్రిక్షన్లు దాదాపుగా తొలగిపోయాయి. ఆఫీస్‌‌ మార్కెట్ బలంగా పుంజుకుంటోంది " అని కొలియర్స్ రిపోర్ట్‌‌ వివరించింది. కొల్లియర్స్ ఇండియా అమెరికా కేంద్రంగా పనిచేసే కొలియర్స్‌‌ కంపెనీలో భాగం. ఇది రకరకాల ప్రొఫెషనల్ సేవలు, ఇన్వెస్ట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సర్వీసులను అందిస్తోంది. కంపెనీకి 67 దేశాలలో  15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. దీని ఏడాది ఆదాయం 3 బిలియన్ డాలర్లు కాగా, 40 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోందని కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు.