గ్రాంట్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ట్యాక్స్ కలెక్షన్ పై పడ్డ ఆఫీసర్లు

గ్రాంట్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ట్యాక్స్ కలెక్షన్ పై పడ్డ ఆఫీసర్లు
  • ప్రాపర్టీ, వాటర్​ ట్యాక్స్​ వసూళ్లకు చర్యలు 
  • మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ
  • 20 రోజుల్లో రూ. 519.31 కోట్ల వసూలుకు యాక్షన్ ప్లాన్ 
  • రంగంలోకి ప్రత్యేక బృందాలు 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, నీటి పన్ను, షాపు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, అడ్వర్టయిజ్ మెంట్ ట్యాక్స్ వసూళ్ల కోసం ఆఫీసర్లు, సిబ్బంది జబర్దస్తీ చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఖజానాలు ఖాళీ కావడం, ప్రభుత్వం నుంచి గ్రాంట్లు సకాలంలో విడుదల కాకపోవడంతో ట్యాక్స్ కలెక్షన్ పై పడ్డారు. జీతాలు చెల్లించడం కూడా ఇబ్బందిగా మారడంతో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ పన్నులు చెల్లించాలని పట్టుబడుతున్నారు. ట్యాక్స్ చెల్లించని ఇల్లు, షాపులు, ఇతర వ్యాపార సముదాయాల్లో ఆస్తులు జప్తు చేసేందుకు ట్రాలీలు వేసుకుని తిరుగుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు గడువు మార్చి 31 వరకు ఉన్నప్పటికీ.. నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. 

మిగిలినవి 20 రోజులే..

రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్, కరెంట్ డిమాండ్ కలిపి రూ.1195.90 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. శుక్రవారం వరకు రూ.676.59 కోట్లు వసూలయ్యాయి. ఫైనాన్షియల్ ఇయర్ ముగింపునకు మరో 20 రోజులే ఉండడంతో మిగతా రూ. 519.31 కోట్ల ట్యాక్స్ కలెక్ట్ చేసేందుకు ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాల్లో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, అడ్మిన్ విభాగాల సిబ్బందిని కూడా చేర్చి ఈ నెల 31లోగా ఎలాంటి లీవ్ తీసుకోకుండా డ్యూటీకి హాజరు కావాలని ఆదేశించారు. బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు టార్గెట్లు పెట్టి మరీ ట్యాక్స్ వసూలు చేయిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపాలిటీల్లోని మెయిన్ సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తెల్లవారుజామున ఇంటింటికీ తిరిగే చెత్త తరలించే వాహనాలకు మైక్ లు పెట్టి ఆస్తి పన్ను చెల్లించాలని ప్రచారం చేస్తున్నారు. 

బకాయిల వసూలుకు ఆస్తుల జప్తు 

మొండి బకాయిదారుల నుంచి ట్యాక్స్ వసూలు చేసేందుకు సిబ్బంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్య తరగతి  ప్రజల నుంచి జబర్దస్తీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నల్లా కనెక్షన్లు కట్​చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో  ట్యాక్స్ లు చెల్లించని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో మున్సిపల్ సిబ్బంది ఆస్తులు జప్తు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఇటీవల స్థానిక గీర్వాణి కాలేజీలో సామగ్రిని జప్తు చేసి వ్యాన్ లో  మున్సిపల్ ఆఫీసుకు తరలించారు. దీంతోపాటు మరో కాలేజీ, పలు రైస్ మిల్లుల్లోనూ ఆస్తులు జప్తు చేశారు. అయితే రోడ్లు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీలాంటి కనీస సౌకర్యాలు లేని విలీన గ్రామాల్లో, పట్టణ శివారు ప్రాంతాల్లోనూ ట్యాక్స్ వసూళ్ల కోసం జబర్దస్తీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.