ఏపీ నీళ్ల దోపిడీపై.. నాడు గప్​చుప్​నేడు గాయిగాయి

ఏపీ నీళ్ల దోపిడీపై.. నాడు గప్​చుప్​నేడు గాయిగాయి
  • దక్షిణ తెలంగాణను ముంచే సంగమేశ్వరానికి సపోర్ట్​
  • మేఘా కంపెనీకి టెండర్​ దక్కేలా తోడ్పాటు.. 
  • కేంద్రం పిలిచినా అపెక్స్​ కౌన్సిల్​ భేటీకి డుమ్మా
  • జగన్​ను ప్రగతిభవన్​కు పిలిపించుకొని మరీ వరాలు
  • నీళ్ల దోపిడీని ఆధారాలతో బయటపెట్టిన వీ6, వెలుగు 
  • పోరాటాలు చేసిన దక్షిణ తెలంగాణ రైతులు
  • అయినా నాడు పట్టించుకోని కేసీఆర్​ సర్కార్​
  • పైగా.. ‘బేసిన్లు లేవ్​.. భేషజాల్లేవ్​’ అంటూ కామెంట్లు

హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నన్ని రోజులు ఏపీ నీళ్ల దోపిడీకి కొమ్ముకాసిన కేసీఆర్​ ఇప్పుడు ఉద్యమాలు అంటూ కొత్త రాగం అందుకున్నరు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే, శ్రీశైలం ప్రాజెక్టునే రాయలసీమకు మళ్లించుకునేలా చేసే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ స్కీంకు అన్ని రకాలుగా తోడ్పాటునందించిన గులాబీ బాస్​కు అధికారం కోల్పోయినంక కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కులు యాదికొచ్చినయ్.  2014  జూన్​ 2 నుంచి 2023 డిసెంబర్​3వ తేదీ వరకు తెలంగాణకు సీఎంగా పని చేసిన ఆయన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతున్నదని వీ6, వెలుగు వరుస కథనాలు ప్రసారం చేసినా, ప్రచురించినా స్పందించలేదు.

తెలంగాణ జలరంగ నిపుణులు, మేధావులు విన్నవించినా ఆయన ఆలకించలేదు. ‘సారూ.. సంగమేశ్వరం కడ్తున్నరు’, ‘పోతిరెడ్డిపాడు గండి డబులైతే గండమే’, ‘కొత్త స్కెచ్​తో ఏపీ సర్కార్​ నీళ్ల చోరీ’ అంటూ ఏపీ గుట్టును ఆధారాలు, ఫొటోలతో వెలుగు దినపత్రిక బయటపెట్టింది. నీళ్ల దోపిడీపై దక్షిణ తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయినా నాటి సర్కారు స్పందించలేదు. పైగా..  ‘‘బేసిన్లు లేవ్​.. భేషజాల్లేవ్​. జగన్​ నిజాయితీపరుడు, నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పిన. జగన్​కు పెద్దన్నగా నా ఆశీస్సులు, సంపూర్ణ సహకారాలు ఉంటయ్” అని సీఎం హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు చెప్పుకొచ్చారు.

ప్రగతిభవన్​కు జగన్​ను పిలిపించుకొని మరీ నీళ్ల మీద ముచ్చట్లు పెట్టారు. ఏపీలోని నగరికి వెళ్లి అక్కడి ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని ఇవే మాటలు అన్నారు. రాయలసీమను రతనాలసీమ చేస్తామన్నారు. కండ్ల ముందు నీళ్ల దోపిడీ జరుగుతున్నా.. దక్షిణ తెలంగాణ రైతులు గోస పడుతున్నా.. నీటిరంగ నిపుణులు, మేధావులు నెత్తినోరు మొత్తుకొని చెప్పినా.. నాడు కేసీఆర్​ సర్కార్​ ఉలకలేదూ పలకలేదు. నీళ్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ అదే దోపిడీ నడిచింది. 

జగన్​కు దగ్గరుండి మరీ..!

ఏపీలో జగన్​ సీఎం అయ్యాక కృష్ణా నదిని, శ్రీశైలం ప్రాజెక్టును రాయలసీమకు ధారాదత్తం చేసే ప్రయత్నాలెన్నో జరిగాయి. జగన్​ప్రమాణ స్వీకార వేదికపైనే రాయలసీమకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు సహకరిస్తామని కేసీఆర్​హామీ ఇచ్చారు. గోదావరి – కృష్ణా నదులు అనుసంధానంపై రెండు రాష్ట్రాల సీఎంలు, ఇరిగేషన్​సెక్రటరీలు, ఈఎన్సీల స్థాయిలో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్​లోనే శ్రీశైలం నీటి దోపిడీకి స్కెచ్​వేసినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి.

2020 మే 5న ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ స్కీంతో పాటు పోతిరెడ్డి పాడు హెడ్​ రెగ్యులేటర్ ​విస్తరణ, దానికి దిగువన ఉన్న శ్రీశైలం రైట్​ మెయిన్  ​కెనాల్​ సామర్థ్యం పెంపు, కాల్వకు సిమెంట్​ లైనింగ్​ కోసం నిధులు కేటాయిస్తూ జీవో నం.203 జారీ చేశారు. ఏపీ ఇచ్చిన జీవోతో దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని, శ్రీశైలం దాటి చుక్కా నీరు కిందికి రాదని ‘వీ6 – వెలుగు’ హెచ్చరించినా అప్పటి కేసీఆర్​ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీ సర్కారు దాదాపు ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేశాక.. కృష్ణా బోర్డుకు కేసీఆర్​ సర్కార్​ ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ఒక్క మాట ఎత్తలేదు. 

ALSO READ:  పాలమూరు ప్రాజెక్టులపై కదలిక..పదేండ్లుగా 10 శాతం పనులు కంప్లీట్​ చేయని బీఆర్ఎస్ సర్కార్

అపెక్స్​ మీటింగ్​ను వాయిదా వేయించి..!

ఏపీ రీ ఆర్గనైజేషన్ ​యాక్ట్​ ప్రకారం తెలంగాణ, ఏపీలో కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా అపెక్స్​కౌన్సిల్, సంబంధిత రివర్​ బోర్డు అనుమతి తప్పనిసరి. సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​స్కీం పూర్తిగా  కొత్త ప్రాజెక్టు. ఉమ్మడి ఏపీలో అలాంటి ప్రాజెక్టును కనీసం ప్రతిపాదించలేదు. కేసీఆర్​కు ఈ విషయం తెలిసినా అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు. ఇందుకు జగన్​తో దోస్తీనే కారణమన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రం జోక్యం చేసుకొని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లను ఢిల్లీకి పిలిపించి రెండు రాష్ట్రాల్లో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలు తెప్పించుకున్నది. 2020 ఆగస్టు 5న సంగమేశ్వరంపై చర్చించేందుకే అపెక్స్​కౌన్సిల్​సమావేశం ఏర్పాటు చేయగా.. ముందే నిర్ణయించిన కార్యక్రమాలున్నాయని సమావేశానికి కేసీఆర్​ హాజరుకాలేదు. మీటింగ్​ను వాయిదా వేయించారు. కేసీఆర్​ అపెక్స్​కౌన్సిల్​ మీటింగ్​కు డుమ్మా కొట్టడం వెనుక సంగమేశ్వరం లిఫ్ట్​ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టడానికేనన్న ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు 19న సంగమేశ్వరం లిఫ్ట్​స్కీం టెండర్ల ప్రక్రియ ముగియాల్సి ఉంది. ఈ టెండర్ ప్రాసెస్​పూర్తయి, ప్రాజెక్టు పనులు మొదలయ్యాక నింపాదిగా కేసీఆర్​అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​కు హాజరయ్యారు.

ఆ మీటింగ్​లోనూ సంగమేశ్వరాన్ని అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. కృష్ణా బేసిన్​లో ఉన్న మహబూబ్​నగర్​, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లిచ్చే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణ కడుతున్నదని, శ్రీశైలంలో 854 అడుగులకు నీటిమట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​నుంచి తాము నీళ్లు తీసుకోగలమని, తెలంగాణ శ్రీశైలంలోకి వచ్చే వరదను పవర్​హౌస్​ద్వారా నాగార్జునసాగర్​లోకి వదిలేస్తున్నది కాబట్టే తాము 800 అడుగుల నుంచి సంగమేశ్వరం ఎత్తిపోతలను చేపట్టామని ఆ మీటింగ్​లో జగన్​ చెప్పారు. కేసీఆర్​ సర్కార్​ తీరుతో జగన్​సర్కార్​ దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఏపీ అక్రమ ప్రాజెక్టు పనులు వేగంగా చేసుకుంటూ పోయింది.

అప్పగింతకు అప్పట్లోనే సిద్ధమని చెప్పి..!

2020 అక్టోబర్​ 6న జరిగిన అపెక్స్​కౌన్సిల్​రెండో మీటింగ్​లోనే కృష్ణా, గోదావరి రివర్​మేనేజ్​మెంట్​బోర్డుల జ్యూరిస్​డిక్షన్​నోటిఫై చేయడానికి కేసీఆర్​ఓకే  చెప్పారు. దానికి లోబడి రెండు రాష్ట్రాల కామన్ ప్రాజెక్టుల మేనేజ్​మెంట్​ను ఆయా రివర్​బోర్డులకు అప్పగించాలి. ఇందుకు  సంబంధించిన ప్రక్రియ కేసీఆర్​సర్కారులోనే మొదలైంది. ప్రాజెక్టులు అప్పగించేందుకు తాము సిద్ధమని ఆ నాడు కేసీఆర్​ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాంటి కేసీఆర్​ అండ్​ గులాబీ పార్టీ టీమ్​ఇప్పుడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని రాజకీయం చేయడానికి పూనుకుంది. ఈ నెల 13న నల్గొండలో బహిరంగ సభ పెట్టి.. నీళ్లపై పోరాడుదామని పార్టీ శ్రేణులకు కేసీఆర్​ పిలుపునిచ్చారు. పార్లమెంట్​ఎన్నికలే టార్గెట్​గా ఊరూరికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేసినా, న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించినా, ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకున్నా ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. 

ముందే అంతా తెలిసీ.. ఉప ఎన్నిక వేళ ప్రెస్​మీట్లు..!

2020 డిసెంబర్​లో ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సంగమేశ్వరం ఎత్తిపోతల పనులు చేస్తుందనే విషయాన్ని వీ6, వెలుగు ఫొటోలు, వీడియోలతో జనం ముందు ఉంచాయి. అప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం నోరు మెదపలేదు. ఏడు నెలల తర్వాత హుజూరాబాద్​ఉప ఎన్నికకు ముందు  2021 జూలైలో కేసీఆర్ డైరెక్షన్​లో అప్పటి మంత్రులు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై వరుస ప్రెస్​మీట్లు మొదలు పెట్టారు. ‘‘ఏపీ సంగమేశ్వరం కడుతుందని ఇప్పుడే తెలిసింది..” అని అప్పటి మంత్రి జగదీశ్​రెడ్డి  ప్రెస్​మీట్​లో చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కడుతున్నదని తెలిసినా, వీ6 – వెలుగు సాక్ష్యాలతో బయటపెట్టినా ఆ పనులు ఆపేయించాలని కనీసం కేంద్ర ప్రభుత్వానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు. ఉప ఎన్నికప్పుడు మాత్రం కేసీఆర్​ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం ప్రెస్​మీట్లు పెట్టి మాట్లాడారు. దీనికి కౌంటర్​గా ఏపీ మంత్రులు మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్​ను రగిల్చి ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే ఇట్ల ప్రెస్​మీట్లు పెట్టి మాట్లాడుతున్నరన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. రిజర్వ్​ఫారెస్ట్​లో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఏపీ చేపట్టిన సంగమేశ్వరాన్ని అడ్డుకునేందుకు కనీసం నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ (ఎన్జీటీ)కు వెళ్లాలన్న ఆలోచన కూడా అప్పటి కేసీఆర్ సర్కారుకు చేయలేదు. నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్​పై ఎన్జీటీ  స్టే ఇచ్చిన తర్వాత మేల్కొన్న కేసీఆర్ ప్రభుత్వం దానికి అనుబంధ పిటిషన్​వేసి కేసులో ఇంప్లీడ్​అయింది. 2020, 2021 సంవత్సరాల్లో ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులను వీ6 వెలుగు వరుస కథనాల్లో తేటతెల్లం చేసింది. ఎన్జీటీ జోక్యంతో ఏపీ పనులు ఆపిందే తప్ప ఇందులో అప్పటి కేసీఆర్​ ప్రభుత్వ కష్టం ఇసుమంతైన లేదని అప్పట్లో నీటిరంగ నిపుణులు వ్యాఖ్యానించారు.

ప్రశ్నిస్తే చిందులు..

‘‘ఏపీ అక్రమంగా తలపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అపెక్స్​కౌన్సిల్ మీటింగ్​కు వెళ్తారా’’ అని 2020 మేలో ప్రగతిభవన్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ప్రశ్నించిన ‘వీ6 వెలుగు’ ప్రతినిధిపై కేసీఆర్  రుసరుసలాడారు. ‘‘నీకేదో కిరికిరి పంచాయితీ పెట్టాలని కోరిక ఉన్నట్టుంది.. అదేం జరగదు.. దురాశ పడకు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. కేసీఆర్​తో పెట్టుకోలేవు.. కొంచెం జాగ్రత్త..” అంటూ ఎగిరెగిరిపడ్డారు. 

జగన్​కు నేనే చెప్పిన

2019 సెప్టెంబర్​ 19న అసెంబ్లీలో కేసీఆర్​ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకు అమరావతిలో వాళ్లింట్లో చెప్పిన.. నీళ్లు సముద్రంలకు వేస్టుగా పోతున్నయ్.. దిక్కుమాలిన పంచాయితీలు బంద్​ చెయ్యి.. ఆ నీళ్లు వాడుకుందాం.. సమైక్య రాష్ట్రంల ఉన్నప్పుడు అట్లనే చేసిండ్రు.. రాష్ట్ర విభజనకు దోహదమైండ్రు.. ఇయ్యాల కూడా మీ వైఖరి మారుతలేదు.. అని చెప్తే ఆయన వినలే. జగన్​ సీఎం అయ్యాక స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అని జగన్​కు నేను చెప్పిన. పాత పంచాయితీలు బంజేసి, ఉభయ రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టులు చేసుకుందామన్న.. జగన్​లో నిజాయితీ ఉంది.. మన సహకారం అడిగిండు.. డెఫినెట్​గా చేస్తామన్న’’ అని అన్నారు.