ఎర్లీబర్డ్ పైనే ఆశలు.. ఈసారి జీహెచ్ఎంసీ టార్గెట్​రూ.800 కోట్లు

ఎర్లీబర్డ్ పైనే ఆశలు.. ఈసారి జీహెచ్ఎంసీ టార్గెట్​రూ.800 కోట్లు
  •     ఆ మొత్తంతో కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్​ చేయాలని ప్లానింగ్​
  •     ఇప్పటికే రూ.1000 కోట్ల బిల్లులు పెండింగ్
  •     అప్పులు రూ.5,275 కోట్లు.. డెయిలీ మిత్తీ రూ.కోటి

హైదరాబాద్, వెలుగు: ఏటా జీహెచ్‌‌ఎంసీ ఆదాయం పెరుగుతున్నా అప్పుల ఊబి నుంచి బయటికి రాలేకపోతుంది. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతుంది. ప్రస్తుతం దాదాపు రూ.వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్​ఉన్నాయి. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు నిత్యం బల్దియా హెడ్డాఫీస్​చుట్టూ తిరుగుతున్నారు. కమిషనర్ కలిసేందకు క్యూ కడుతున్నారు. వీటికి తోడు జీహెచ్ఎంసీ అప్పులు రూ.5,275 కోట్లకు చేరాయి. వడ్డీలు మోయలేని భారంగా మారాయి. డెయిలీ కోటి రూపాయల మిత్తి చెల్లిస్తోంది.

ఐదారేండ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి ఎర్లీబర్డ్ ద్వారా వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ను కొంత మేర కాంట్రాక్టర్లకు బిల్లుల కింద చెల్లించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 1 నుంచి అందుబాటులోకి వచ్చిన స్కీమ్​నెలాఖరు వరకు కొనసాగనుంది. గడిచిన నాలుగు రోజుల్లో రూ.40 కోట్ల ట్యాక్స్​కలెక్ట్ అయింది. ఈసారి ఎర్లీబర్డ్ ద్వారా రూ.800 కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తంతో కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయాలని బల్దియా ఉన్నతాధికారులు చేస్తున్నారు.

అధికారులకు ఫ్రీ హ్యాండ్

బీఆర్ఎస్ హయాంలో ఏ పని చేయాలన్నా తప్పకుండా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. చివరకు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్​ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏ పనికి వాడాలో కూడా ఆయనే నిర్ణయించేవారు. అధికారులపై కేటీఆర్​పెత్తనమే నడిచేది. కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. మున్సిపల్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. జీహెచ్ఎంసీని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసేందుకు తాను పూర్తిగా సహకారం అందిస్తానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని చెప్పారు. దీంతో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్​ద్వారా వస్తున్న ఆదాయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయం ఆయా పనులకు వినియోగిస్తున్నారు. ఈ నెలలో ఎర్లీబర్డ్​కింద వచ్చే ఆదాయాన్ని ఇప్పటికే పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు  బిల్లుల కింద చెల్లించాలని అనుకుంటున్నారు. 

పెరుగుతున్న ఆదాయం

ఎర్లీబర్డ్ స్కీమ్​ద్వారా వచ్చే ఆదాయం ఏటా పెరుగుతోంది. ఏడాది మొత్తం కలెక్ట్ అయ్యే ప్రాపర్టీ ట్యాక్స్​లో సగం ఎర్లీబర్డ్ ద్వారానే వస్తోంది. ప్రాపర్టీదారులు ఈ స్కీమ్​అమలులో ఉన్నప్పుడు ట్యాక్స్​చెల్లించేందుకు ఇంట్రస్ట్​చూపిస్తున్నారు. దీంతో కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవగానే బల్దియా అమలు చేస్తోంది. స్కీమ్​తెచ్చినప్పటి నుంచి వసూలైన ట్యాక్స్ చూస్తే.. 2017-–18 ఆర్థిక సంవత్సరంలో రూ.362 కోట్లు, 2018–19లో రూ. 432 కోట్లు,  2019–-20లో రూ.535 కోట్లు, 2020–-21లో రూ.572 కోట్లు, 2021-–22లో రూ.541కోట్లు, 2022-–23లో రూ.748 కోట్లు వసూలైంది. ఇక ఇటీవల ముగిసిన 2023–24లో రూ.765 కోట్లు కలెక్ట్​అయింది. ఈసారి అంతకు మించి కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది.