
- ఆసిఫాబాద్ జిల్లాలో 151 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
- ప్రజల పునరావాసానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
- వైద్య, విద్యుత్, అగ్నిమాపక శాఖలకు కీలక ఆదేశాలు
- ఆయా శాఖల్లో హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు
ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు: వానాకాలం వచ్చిందంటే చాలు కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు వణికిపోతుంటారు. వరదల్లో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో అల్లాడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజలకు ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ చర్యలకు ఆదేశాలిచ్చారు.
వరదలు, వాగులు ఉప్పొంగితే రెస్క్యూ టీమ్‌లు
ఆసిఫాబాద్ జిల్లాలో 151 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రామాల మండలాల ఎంపీడీవోలు, ఎస్సైలు, తహసీల్దార్లు, మండల అధికారులు సమన్వయంతో గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆయా గ్రామాల్లో మూడు నెలలకు సరిపడా నిత్యవసరాలను ముందుగానే అందించాలని కలెక్టర్ వెంకటేశ్‌ధోత్రే ఆదేశాలిచ్చారు. వరదలు వస్తే గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. వరద కారణంగా పంట పొలాలు దెబ్బతినకుండా రక్షణ చర్యలు చేపట్టనున్నారు. రోడ్లు, వంతెనల రక్షణకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు. లైవ్ జాకెట్స్, చిన్న పడవలు, తాళ్లు, కటింగ్ పరికరాలు సిద్ధం చేస్తున్నారు.
నెల మొత్తం రేషన్ షాపులు తెరిచి ఉంచేలా ఆదేశాలు
గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి, వాటిని ఖాళీ చేయించనున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కుమ్రంభీం, వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై అప్రమత్తం చేయనున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో 10 మందితో రెస్క్యూ బృందాన్ని సిద్ధం చేసి చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నారు. నెల మొత్తం డీలర్లు రేషన్ షాపులను తెరిచి ఉంచేలా వారికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. వైద్య సేవలు , ఓఆర్ ఎస్, యాంటీబయాటిక్, అవసరమైన మందులు అందుబాటులో
ఉంచానున్నారు.
భారీ వర్షాలు.. ఆఫీసర్ల అలెర్ట్
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి సమస్యలున్నా సంప్రదించేందకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 18004251939కు సంప్రదించాలని సూచిస్తున్నారు. వైద్య, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులు సైతం హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. వైద్య సదుపాయాల కోసం ఆరోగ్య శాఖ కంట్రోల్ రూం నంబర్ 7670904306 కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాల్లో సమస్య, హై లోవోల్టేజీ, కరెంట్ తీగలు తెగిపడటం వంటివి జరిగితే వెంటనే సమాచారం అందించేందుకు ఆదిలాబాద్ సర్కిల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్9440811700 లేదా 1912కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు
అత్యవసర పరిస్థితుల్లో 18004251939
వైద్య సదుపాయానికి 7670904306
విద్యుత్‌సమస్యలు ఏర్పడితే.. 9440811700
లేదా 1912
అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలి. ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై ఆరా తీయాలి. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ఐరన్ విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్ల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఆపదమిత్ర శిక్షణ పొందిన వలంటీర్లను వినియోగించుకోవాలి. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలి. - రాజర్షి షా , కలెక్టర్ ఆదిలాబాద్