ఇద్దరు వృద్ధుల ఓటు కోసం.. అడవుల్లో 107 కి.మీ. ప్రయాణం

ఇద్దరు వృద్ధుల ఓటు కోసం.. అడవుల్లో 107 కి.మీ. ప్రయాణం
  • ఇద్దరు వృద్ధుల ఓటు కోసం అడవుల్లో 107 కి.మీ. ప్రయాణం
  • మహారాష్ట్రలో ఎన్నికల సిబ్బంది సాహసం

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్నికల సిబ్బంది పెద్ద సాహసం చేశారు. ఇద్దరు వృద్ధుల ఓట్ల కోసం సిబ్బంది ప్రమాదకరమైన అడవుల్లో 107 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఎన్నికల అధికారులు శుక్రవారం తెలిపారు. 85 ఏండ్లు దాటిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులకు లోక్​సభ ఎన్నికల్లో ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. 100 ఏండ్లు, 86 ఏండ్ల వయసు గల ఇద్దరు ఓటర్లు గడ్చిరోలి- చిమూర్ నియోజకవర్గంలో ఉన్నారు. వీరు ఇంటి దగ్గర నుంచి ఓటు వేసేందుకు ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. 

ఇక్కడ ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుంచి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏండ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏండ్లున్న కిష్టయ్య కొమెర ఇండ్లకు వెళ్లి వారితో ఓటు వేయించారు. గడ్చిరోలి- చిమూర్ నియోజకవర్గంలో 85 ఏండ్లు పైబడిన ఓటర్లు 1,037 మంది, దివ్యాంగుల 338 మంది ఇంటి వద్దనే ఓటు వేసేందుకు దరఖాస్తు చేశారని ఆఫీసర్లు తెలిపారు. వీరిలో ఇప్పటి వరకు 1,205 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.