పాతకారు రెన్యువల్​@ 15వేలు

పాతకారు రెన్యువల్​@ 15వేలు
  •                రెన్యువల్ ఫీజులు భారీగా పెంపు
  •                 పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకే..
  •                 త్వరలోనే వెహికిల్స్ స్క్రాపింగ్ పాలసీ

పాత వెహికిల్స్‌‌ను తగ్గించి.. కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజుల బాదుడు ప్రారంభించబోతుంది. 15 ఏళ్లకు పైబడిన వెహికిల్స్‌‌ రెన్యువల్​ రిజిస్ట్రేషన్‌‌ ఫీజులను భారీగా పెంచనున్నట్టు ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్‌‌ ఒకరు చెప్పారు. ఈ ప్రతిపాదిత పెంపు 2020 జూలై నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్ కారు రీ–రిజిస్ట్రేషన్ ఫీజును 25 రెట్లు పెంచనున్నట్టు చెప్పారు. అంటే రూ.600 నుంచి రూ.15,000కు ఈ రిజిస్ట్రేషన్ ఫీజులు పెరగనున్నాయి. అదే కమర్షియల్ కారు అయితే దీని రీ–రిజిస్ట్రేషన్ ఫీజు వెయ్యి రూపాయల నుంచి రూ.20 వేలకు పెరగనున్నట్టు తెలిసింది. మీడియం కమర్షియల్ ఫోర్ వీలర్ వెహికిల్స్‌‌కు అయితే రిజిస్ట్రేషన్రెన్యువల్​ ఫీజు రూ.1,500 నుంచి రూ.40 వేలకు పెరగనున్నట్టు వెల్లడైంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పాత వెహికిల్స్ రీ–రిజిస్టర్ చేయకపోతే, ఆటోమేటిక్‌‌గా ఆ వెహికిల్స్‌‌ను డీ–రిజిస్టర్ చేయనున్నారు. రవాణా మంత్రిత్వ శాఖ రూపొందించిన వాలంటరీ వెహికిల్ స్క్రాపింగ్ పాలసీకి చెందిన అంతరాష్ట్రాల కన్సల్టేషన్ త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. ప్రస్తుతం ఇది ప్రొగ్రెస్‌‌లో ఉందని, త్వరలోనే దీన్ని కేబినెట్‌‌కు పంపించి ఆమోదించనున్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. పాత వెహికిల్స్ వాడకాన్ని తగ్గించి, కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ఈ స్క్రాపింగ్ పాలసీ ఉపయోగపడనుందని ప్రభుత్వ అధికారి తెలిపారు. అంతేకాక ప్రతి నగరంలో కూడా పాత వెహికిల్స్ స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఈ ప్రతిపాదిత పాలసీలో సూచిస్తున్నారు. ప్రతిపాదిత వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ, ఆటో మొబైల్ తయారీ కంపెనీలకు అమ్మకాలను పెంచనుంది.  దీంతో కంపెనీల ఉత్పత్తి కూడా పెరగనుంది.

పెరగనున్న అమ్మకాలు

ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో స్లోడౌన్ నెలకొన్న నేపథ్యంలో ఈ స్క్రాపింగ్ పాలసీని తీసుకురానున్నారు. ఇప్పటికే ఆటోమొబైల్ సెక్టార్ తీవ్రంగా కుదేలై ఉంది. అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. దేశీయ ప్యాసెంజర్ వెహికిల్ అమ్మకాలు ఆగస్ట్ నెలలో 31.6 శాతం తగ్గి 1,96,524 యూనిట్లుగా నమోదైనట్టు సియామ్ డేటాలో వెల్లడైంది. ఆటో మొబైల్ అమ్మకాలను పెంచడానికి గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు చర్యలను ప్రకటించారు. వీటిలో పాత వెహికిల్స్‌‌ను తప్పనిసరిగా ప్రభుత్వ ఏజెన్సీలు, డిపార్ట్‌‌మెంట్లు రీప్లేస్ చేయాలని, బ్యాంక్‌‌లు ఆటో రుణాలను చవకగా అందించాలని, నాన్ బ్యాంక్ లెండర్స్‌‌కు క్రెడిట్ సౌకర్యాన్ని పెంచాలని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.  అమ్మకాలను పెంచడానికి ఈ స్క్రాపింగ్ పాలసీ కూడా దోహదం చేయనుంది. 2008లో గ్లోబల్‌‌గా సంక్షోభం ఏర్పడిన సమయంలో కూడా పలు యూరోపియన్ దేశాలు ఈ స్క్రాపింగ్ పాలసీని ప్రవేశపెట్టాయి.