బీబీసీ డాక్యుమెంటరీపై ఆగని దుమారం

బీబీసీ డాక్యుమెంటరీపై ఆగని దుమారం

కేంద్రం బ్లాక్ చేసినా.. కేరళలో షోలు వేసిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ

తిరువనంతపురం/న్యూఢిల్లీ : గుజరాత్ లో 2002 నాటి అల్లర్లపై, ప్రధాని నరేంద్ర మోడీపై బ్రిటన్ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై మంగళవారం దేశవ్యాప్తంగా మరింత దుమారం రేగింది. ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ పేరుతో రెండు పార్ట్ లుగా తీసిన ఈ డాక్యుమెంటరీని దేశంలో ప్రసారం చేయకుండా కేంద్రం బ్యాన్ చేసినప్పటికీ, దీనిని ప్రదర్శించి తీరుతామంటూ కేరళలోని ప్రతిపక్ష కాంగ్రెస్, రూలింగ్ సీపీఎం పార్టీలకు చెందిన అనుబంధ సంస్థలు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ప్రకటించాయి. ఢిల్లీలోని జేఎన్​యూ స్టూడెంట్ యూనియన్ కూడా డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామంటూ ప్రకటన చేసింది. 

కేరళలో బీజేపీ ఆందోళనలు 

కేరళలో ఎస్ఎఫ్ఐ, తదితర సంస్థలు మంగళవారం బీబీసీ డాక్యుమెంటరీని ప్రత్యేక షోలు వేసి చూపించడంతో పెనుదుమారం రేగింది. పాలక్కడ్, ఎర్నాకుళం టౌన్​లలో డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ఎస్ఎఫ్ఐ ప్రకటించిన వెంటనే బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. రెండు చోట్లా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ ప్రకటించింది. కేరళ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రిపబ్లిక్ డే నాడుడాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని కేపీసీసీ మైనార్టీ సెల్ ప్రకటించింది. డాక్యుమెంటరీ ప్రదర్శనలపై బీజేపీతో పాటు ఆ పార్టీ యువ మోర్చా, ఏబీవీపీ తీవ్రంగా ఖండించాయి. కేరళలో నిరసన ర్యాలీలు నిర్వహించారు.  

బీజేపీకి ఏకే ఆంటోనీ కొడుకు సపోర్ట్ 

బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. బ్రిటన్​కు చెందిన మీడియా సంస్థ అభిప్రాయాలతో ఇండియన్ సంస్థలను, దేశ సార్వభౌమత్వాన్ని తక్కువ చేయడం సరికాదన్నారు.  

ఇదీ వివాదం.. 

గుజరాత్ అల్లర్లకు మోడీయే బాధ్యుడని బీబీసీ ఇటీవల ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందిం చింది. ఫస్ట్ పార్ట్​ను వారం కింద ఇండియా లో తప్ప మిగతా దేశాల్లో విడుదల చేసింది. ఇది పక్షపాతంతో, కావాలనే దుష్ప్రచారం చేసేలా ఉందంటూ కేంద్రం మండిపడింది. ఐటీ రూల్స్, 2021 కింద ఎమర్జెన్సీ పవర్స్ ను ఉపయోగిస్తూ దేశంలో యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్లలో ఈ డాక్యుమెంటరీని బ్యాన్ చేసింది.