వంద కుటుంబాలకు ఒక కౌంటర్..​ గ్రామ సభల నిర్వహణ తీరు ఇది

వంద కుటుంబాలకు ఒక కౌంటర్..​ గ్రామ సభల నిర్వహణ తీరు ఇది
  • గ్రామసభలకు చాటింపు వేసి.. దరఖాస్తుల స్వీకరణ 
  • అప్లికేషన్​కు ఆధార్​ కార్డు, తెల్లరేషన్​ కార్డు జత చేయాలి
  • అసెంబ్లీ నియోజకవర్గానికో స్పెషల్​ ఆఫీసర్​.. మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు
  • గ్రామాల్లోని దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్​ ప్రిన్సిపల్​ సెక్రటరీకి చేరవేత
  • పట్టణాల్లోని డేటా జీహెచ్​ఎంసీ, మున్సిపల్​కమిషనర్ల వద్దకు..

హైదరాబాద్​, వెలుగు:  అర్హులైనవాళ్లకు సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలను అమలు చేయడమే లక్ష్యంగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ఈ సభలు నిర్వహించి అప్లికేషన్లు తీసుకోనున్నారు. గ్రామ పంచాయతీ దగ్గర, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్​ వార్డులో ఈ ప్రజా పాలన గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు. ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకం, చేయూత పథకానికి అప్లికేషన్లు తీసుకుంటారు. ఆధార్​ కార్డుతో పాటు, తెల్ల రేషన్​ కార్డును అప్లికేషన్​కు జత చేయాల్సి ఉంటుంది. మండల స్థాయిలో అవసరమైనన్ని అధికార బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలను నిర్వహిస్తుంది. ఈ సభలకు సర్పంచ్​, కార్పొరేటర్​, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తారు. వచ్చే నెలలో 6వ తేదీ నాటికి అన్ని గ్రామాలలో సభలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్​ ఉండేలా గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామసభలు, అప్లికేషన్లకు సంబంధించి గ్రామాల్లో చాటింపు వేస్తారు. గ్రామ సభల సమన్వయం కోసం నియోజకవర్గానికి ఒక స్పెషల్​ ఆఫీసర్​ చొప్పున 119 నియోజకవర్గాలకు 119 మంది స్పెషల్​ ఆఫీసర్లను  నియమించనున్నారు.  

మరిన్ని వివరాలు

రెవెన్యూ డిపార్ట్ మెంట్ గ్రామ సభలను నిర్వహిస్తుంది. పోలీసు డిపార్ట్ మెంట్ వీటిని స్ట్రీంలైన్  చేస్తుంది. మండలంలో రెండు టీంలు ఉంటే ఒక టీంకు ఎమ్మార్వో, మరో టీంకు ఎంపీడీవో బాధ్యత తీసుకుంటారు. ఈ టీంలు ప్రతి రోజు రెండు సభలు, రెండు గ్రామాల్లో నిర్వహిస్తాయి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మరొక గ్రామంలో సభ ఉంటుంది. ఇందులోనే అప్లికేషన్లు తీసుకుంటారు. పోలీసు డిపార్టుమెంట్ తో పాటు స్పెషల్ ఆఫీసర్ స్థానికంగా సమన్వయం చేస్తారు. గ్రామ సభల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటారు. పురుషులకు, మహిళలకు విడివిడిగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు.గ్రామ సభ మొదలు పెట్టే ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపిస్తారు.  నిరక్షరాస్యుల దరఖాస్తులను అంగన్ వాడీ, ఆశావర్కర్ల వంటి చదువుకున్న వాళ్లు నింపుతారు.  

గ్రామ సభల్లో అప్లికేషన్లు అందిస్తే గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. అందుకే రెండు రోజుల ముందుగా గ్రామాలకు అప్లికేషన్లు చేరుతాయి. వాటిని గ్రామ కార్యదర్శులు, ఇతర వ్యవస్థలు ప్రజలకు అందుబాటులో ఉంచుతాయి. వీటిని ముందుగా ప్రజలు నింపే చాన్స్​ ఉంటుంది. అలా నింపిన దరఖాస్తులను సభల్లో సమర్పించడం ద్వారా సభలు సాఫీగా సాగుతాయి.  

ప్రతి గ్రామంలో, వార్డులో, మున్సిపాలిటీల్లో సభలు, అప్లికేషన్లపై చాటింపు వేయాలి.  రోజువారీ దరఖాస్తులను టీం లీడర్​ ఆధీనంలో ఉంటాయి. గ్రామాల్లోని అప్లికేషన్ల వివరాలు పంచాయతీరాజ్  శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీకి, పట్టణ ప్రాంతాల్లోని అప్లికేషన్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​, మున్సిపల్  కమిషనర్లకు పంపుతారు. దరఖాస్తులను డిజిటలైజ్​ చేస్తారు.ఇందుకోసం అనువైన ఆఫీస్​ను కలెక్టర్లు సిద్ధం చేయనున్నారు. దరఖాస్తు కోసం ఆధార్​ కార్డు, తెల్లరేషన్​ కార్డు ఫొటో వంటి వాటి విషయాలు ప్రజలకు ముందే కమ్యునికేట్ చేస్తారు.అమరవీరులు, ఉద్యమకారులు ఉంటే వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్, కేసుల వివరాలు వంటి వాటివి తీసుకురావాల్సి ఉంటుంది.