సౌలతులు కల్పించలే..ఇండ్లళ్లకు పోనిస్తలే!

సౌలతులు కల్పించలే..ఇండ్లళ్లకు పోనిస్తలే!
  •     గ్రేటర్ సిటీలో నెరవేరని లక్ష డబుల్ ఇండ్ల హామీ
  •     అర్హులకు పంపిణీ చేసిన ఇండ్లు 70  వేలు
  •     సగం మందికి అందని ఇంటి తాళాలు
  •     గృహప్రవేశాలు చేసుకోలేని పరిస్థితి
  •     పంపిణీ చేసిన పట్టాల్లో దొర్లిన తప్పులు
  •     కరెక్షన్ కు ఆఫీసుల చుట్టూ లబ్ధిదారులు
  •     ఎన్నికల కోడ్ తో పక్కన పెట్టిన అధికారులు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లో లక్ష డబుల్ బెడ్రూమ్​ ఇండ్లను నిర్మించి ఇస్తామని గత అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.  111 ప్రాంతాల్లో బల్దియా వీటిని నిర్మాణాలు చేపట్టింది.  ఇందులో 49 మురికివాడల్లో 9,828 , 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్లను నిర్మిస్తుంది. 70వేల ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. ఇంకా కొన్నింటి నిర్మాణం కొనసాగుతుండగా.. ఇంకొన్ని పెండింగ్ పడ్డాయి. అయితే.. నిర్మాణాలు పూర్తయిన వెంటనే పంపిణీ చేయకుండా ఏండ్లుగా నాన్చి చివరకు ఎన్నికలకు ముందు హడావుడిగా అధికారులు పంపిణీ చేశారు. 70 వేల ఇండ్లలో గతేడాదిలోపు 5 వేలు విడతల వారీగా.. మిగతా 65 వేలను రెండు నెలల కిందట అందజేశారు.  

మూడో విడత ఇండ్ల పంపిణీ పూర్తి కాగానే ఎన్నికల కోడ్ పడింది. అత్యధికంగా కొల్లూరులో 15,660 ఇండ్లు నిర్మించగా.. ఇక్కడ సగానికిపైగా పట్టాలు పొందినవారు ఇంకా ఇండ్లలోకి వెళ్లలేదు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో గృహప్రవేశాలు చేసుకోలేని పరిస్థితి ఉంది. నిర్మాణాలు పూర్తయి ఎక్కువ రోజులు ఖాళీగా  ఉంచడంతో కొన్ని రిపేర్లు కూడా చేయాల్సి ఉంది. మరోవైపు లిఫ్ట్ లు, వాటర్, ఎలక్ర్టిసిటీ తదితర పనులు పూర్తికాకపోగా ఇండ్లను పూర్తిగా అందించలేదు. కొల్లూరులోనే కాకుండా గ్రేటర్ లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

7 లక్షల్లో 95వేల మందే అర్హులు 

గ్రేటర్ లో డబుల్ బెడ్రూమ్​ ఇండ్లకు పేదల నుంచి 7.10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2017 నుంచి 2019 వరకు పలు దశల్లో అప్లై చేసుకోగా.. 95 వేల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి అధికారులు ఇండ్లను పంపిణీ చేశారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 12 శాతం మందిని మాత్రమే లబ్ధిదారులుగా తేల్చింది. లక్ష ఇండ్లలో ఇంకా 25వేల మందికి కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వం ముందుగా మురికివాడల్లో నిర్మించినప్పుడు 1,450 మాత్రమే  ఉన్నాయని తెలిసినప్పటికీ కేవలం గొప్పులు చెప్పుకోడానికి కొన్నిచోట్ల నిర్మించినట్లు కనిపిస్తుంది. ఇంకా చాలా మురికివాడల్లో ఇండ్లను నిర్మించి ఇవ్వాలని జనం నుంచి డిమాండ్లు వస్తున్నాయి.  

లక్ష ఇండ్లను కట్టిస్తామని  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో 70వేలతోనే సరిపెట్టారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి లక్ష ఇండ్లు అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా డబుల్ ఇండ్ల స్థానంలో గృహలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుందని, హైదరాబాద్ లో మాత్రం గృహలక్ష్మితో పాటు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రస్తుత ఎన్నికల మేనిఫెస్టోలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. 

పట్టాల్లో తప్పులతో ఆఫీసుల చుట్టూ..  

పట్టాలు ఇచ్చారనే సంతోషం లబ్ధిదారుల్లో ఉండగా..  ఇండ్లలోకి పోనివ్వకపోతుండగా..తమ సొంతింట్లోకి ఇంకెప్పుడు వెళ్తామనే ఆందోళన నెలకొంది. పట్టాలు ఇచ్చే ముందు అన్నిపనులు పూర్తిచేసి అప్పగించి ఉంటే బాగుండేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.  పట్టాలు ఇచ్చినప్పటికీ కొందరి పట్టాల్లో తప్పులు ఉండటంతో వాటిని సరిచేసుకోడానికి తహశీల్దార్ , ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరి పట్టాల్లో కులం, ఆధార్ నంబర్, పేర్లు లాంటి తప్పులు రావడంతో వాటిని పంపిణీ చేయలేదు.

కొందరికి తప్పులతో ఉన్న పట్టాలను ఇచ్చినా.. ఇండ్లలోకి అనుమతించడంలేదు. అని సరిచేసుకొని వచ్చిన తర్వాతనే అప్పగిస్తామని అధికారులు స్పష్టంచేస్తున్నారు. తప్పుల సవరణకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.