కేవలం మ్యానిఫెస్టోలే ఓట్లు రాలుస్తయా?

కేవలం మ్యానిఫెస్టోలే ఓట్లు రాలుస్తయా?

‘అట్టపర్వతం ఎత్తి పట్టుకున్నవాడు ఆంజనేయుడూ కాదు, నెత్తిలో నెమలీక పెట్టుకున్నోడు క్రిష్ణపరమాత్ముడూ కాదు అదంతా ఎన్నికల ‘అట్ట’హాసం!’ అం టాడు అలిశెట్టి ప్రభాకర్‌‌. చూడ్డానికి అన్ని పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలూ బాగుంటాయి. అందులో పేర్కొన్న అంశాలన్నీ గొప్పగా, ప్రజాస్వామ్యయుతంగా, సర్వజనహితంగా, ఒకింత పేదల పక్షపాతంగా.. ఇంకా చెప్పాలంటే ఎంతో ప్రేమాస్పదంగా కూడా ఉంటాయి. మరి, ఎన్నికల సమరంలో మ్యానిఫెస్టోలే ఓట్లు రాలుస్తాయా? అంటే, సమాధానం మాత్రం ‘నో’ అనే వస్తుంది. అట్లా ఎట్లా? అంటే, అదంతే! ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఇతరేతర అంశాలతో పాటు మ్యానిఫెస్టో కూడా ఓ అంశం కావచ్చు! అదీ కొంత ప్రభావం చూపొచ్చు! కానీ, మ్యానిఫెస్టోల్లో ఏం చెప్పినా సదరు పార్టీకి ప్రజాక్షేత్రంలో ఉన్న ఆదరణ, వారి పట్ల ప్రజల్లో ఉండే విశ్వసనీయత, ఎన్నికల వ్యవహార దక్షత వంటివి మాత్రమే ప్రామాణికం. అవే ఓటింగ్‌‌ సరళిని ప్రభావితం చేస్తాయి. వాటిని బట్టే రాలే ఓట్లు, అంతిమంగా లభించే సీట్లు! తద్వారా దక్కే అధికారం. ఇదీ క్రమం.

నచ్చి, నమ్మకం కుదిరితేనే..!

అందమైన మ్యానిఫెస్టోలు జనాభిప్రాయన్ని ఓట్ల కిందకు మార్చాలి అంటే, ఆయా పార్టీలకు విశ్వసనీయత ఉండాలి. ‘చెప్పిందే చేస్తరు, చేసేది-చేయగలిగేది మాత్రమే చెబుతారు’ అనే నమ్మకం ప్రజల్లో ఉన్నపుడే ఆయా పార్టీల మ్యానిఫెస్టోలకు విలువ, ఆదరణ, అర్థం ఉంటాయి. అఖిల భారత కాంగ్రెస్‌‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్‌‌ వేదికగా యువత ఉద్యోగ, ఉపాధి, నిరుద్యోగ భృతి వంటి అంశాలతో ‘యూత్‌‌ డిక్లరేషన్‌‌’ ప్రకటించారు. అంతకు ముందు రాహుల్‌‌ గాంధీ వరంగల్‌‌ నుంచి ‘రైతు డిక్లరేషన్‌‌’ ప్రకటించారు. రైతుకు ఒకే దఫా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, ఏటా ఎకరాకు15 వేల రూపాయల పెట్టుబడి సాయం వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఇలాంటి డిక్లరేషన్స్‌‌లో చెప్పే హామీలు, ఇచ్చే వాగ్దానాలే అంతిమంగా ఆయా పార్టీల మ్యానిఫెస్టోల్లోకి ఒదిగిపోతాయి. ప్రజాక్షేత్రంలో వారికి ఉండే అవసరాలు, ఆయా ప్రకటనల్లోని సరుకు-సత్తా, హామీలను అమలు చేయడంతో సదరు పార్టీలకుండే నిబద్ధత, ట్రాక్‌‌ రికార్డును బట్టి ఆయా మ్యానిఫెస్టో క్లిక్‌‌ అయ్యేదీ లేనిదీ వెల్లడవుతుంది. వాటిని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకువెళతారు, ఎంతగా నమ్మకం, విశ్వాసం కలిగిస్తారన్నదే అవి విజయవంతం అవడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

 

పార్టీ ప్రకటించిన డిక్లరేషన్స్‌‌ ఎంతగా ప్రజల్లోకి వెళ్లాయి? జనం ఏమనుకుంటున్నారు? ఇంకా, అదనంగా ఏమైనా కోరుతున్నారా? మార్పులేమైనా సూచిస్తున్నారా? వంటి విషయాల్లో అధ్యయనం జరగాలి. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇస్తామంటున్న ప్రయోజనాలతో పాటు, ఆ ఇబ్బందుల్ని తీర్చేలా ఇప్పుడేం చేస్తారు అన్నదీ ముఖ్యమే! గంజిలేక ఇవాళ కడుపు మాడిపోతుంటే, రేపెప్పుడో బిర్యానీ తినిపిస్తామంటే ఎలా? అనే ప్రశ్న వస్తుంది. యువతరం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, రైతులు ఎదుర్కొంటున్న ప్రతికూల వ్యవసాయ పరిస్థితులపై ప్రజాందోళనలూ ప్రజలు గమనిస్తుంటారు. ప్రతి రైతుకూ లక్ష వరకు రుణమాఫీ అన్న పాలకపక్షం ఎన్నికల హామీ తెలంగాణలో అమలుకాలేదని విమర్శించే కాంగ్రెస్‌‌, ఆ విషయంలో రైతును ఆదుకునే విధంగా ఏం పోరాడింది అనేది కూడా ప్రజల్ని, వారి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది.

అమలుపై నిఘా తప్పదు

మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు గురయ్యాక రాష్ట్ర శాసనసభలో సంతాప తీర్మానం, దానిపై చర్చ జరిగింది. చాలా మందే మాట్లాడారు. చివర్లో తమ్మినేని వీరభద్రం ఒక మాటన్నారు. ‘...... అందరూ మాట్లాడారు, రవిని గొప్పగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తామని మాత్రం ఏ ఒక్కరూ పేర్కొనలేదు’ అన్న ఆయన పరిశీలన, పలువురిలో ఆలోచనలు రేకెత్తించింది. తాజాగా బుధవారం పోలింగ్‌‌ ముగిసిన కర్నాటక ఎన్నికల్లో కూడా వింతయిన హామీలు తెరపైకి వచ్చాయి. వాటిపై విమర్శలూ అదే స్థాయిలో ఎన్నికల వాతావరణాన్ని ఘాటెక్కించాయి. ప్రతి ఇంటికీ ఏటా 3 గ్యాస్‌‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ అంటే, ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కర్నాటకను దేశంలో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. మరి, మిగతా రాష్ట్రాలనేం చేస్తారో తెలియదు. కాంగ్రెస్‌‌ ఎన్నికల ప్రచారంలో గృహిణికి నగదు, పరిమిత ఉచిత విద్యుత్తు, పేదలకు అదనపు బియ్యం, నిరుద్యోగ భృతి వంటి నిర్దిష్ట హామీలిచ్చింది. ‘వారెంటీ కాలం చెల్లిపోయిన వాళ్లు గ్యారెంటీ ఇస్తున్నారు’ అని కాంగ్రెస్‌‌ను మోడీ ఎద్దేవా చేశారు.

ప్రతి ఒక్కరు ఓటు వేస్తూ ‘జై భజరంగ్‌‌బలి’ అనాలని ప్రధాని, తాము అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో  ‘హనుమాన్‌‌ మందిర్‌‌’లు నిర్మిస్తామని కాంగ్రెస్‌‌ చెబితే ‘అసలీ పార్టీలు లౌకిక రాజ్యంలోనే ఉన్నాయా?’ అని మజ్లీస్‌‌ పార్టీ నేత అసదుద్దీన్‌‌ ఒవైసీ ప్రశ్నించారు. ఇవన్నీ విన్న కన్నడిగులు తమ తీర్పును బ్యాలెట్‌‌ బాక్స్‌‌(ఈవీఎం)లలో భద్రపరిచారు. రేపు తెలుస్తుంది, వారు ఎవరిని నమ్మారో! ఇక్కడ చెబుతున్న మాటలు ఇంకెక్కడైనా అమలు చేశారా? ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న వారిలో వస్తుంది. ప్రజలు నిఘా పెడతారు. నిజాలనే నమ్ముతారు, నమ్మకం కలుగకుంటే నిలదీస్తారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ లోగడ అన్నారు. ఎలా సాధ్యమని వారి పార్టీలో చర్చిస్తారో లేదో కానీ, జనం మాత్రం ఆలోచిస్తారు. ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నోళ్లు ఎక్కడా ఇవ్వనిది. ఇక్కడ మాత్రం ఎలా ఇస్తారు? అనే సందేహం వారికి రాకుండా ఉంటుందా?

జనం కండ్లు తెరిస్తేనే...

బొంక‌‌రా రంగా అంటే.. ‘తాండూరు మిరియాలు తాటికాయంత’ అన్నాట్ట! జనం చెవుల్లో పూలు పెట్టడానికి అందమైన డిక్లరేషన్లు, ఆదర్శ మ్యానిఫెస్టోలు రూపొందించగానే సరిపోదు. వాటి అమలుకు చిత్తశుద్ధి ఉండాలి. ఆ నిబద్ధతను జనం కోరుకోవాలి. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే వాళ్లను జనం ముందే పసిగట్టాలి. ప్రజాస్వామ్య ఫలాలు దక్కాలంటే, నిరంతర అప్రమత్తతే ప్రజలు చెల్లించే ఫీజు అంటారు పెద్దలు. ఎన్నికలప్పుడు ఆ నిఘా మరింత అవసరం!

శైలి మారింది

మ్యానిఫెస్టోల శైలి మారింది. ఒకప్పటిలా పెద్ద కమిటీలు, సుదీర్ఘకాలం చర్చలు-, సమీక్షలు జరిపి, ఓ యాభై -అరవై పేజీల మ్యానిఫెస్టోలిచ్చే పద్ధతి పోయింది. రైతుబంధు, -దళిత బంధు అనో(తెలంగాణ), నవరత్నాలనో(ఏపీ), పంచ హామీలనో(కర్నాటక) రెండే రెండు విద్య, -వైద్యం(ఢిల్లీ) అనో.. నిర్దిష్టంగా కొన్ని హామీలతో పేజీ, రెండు-మూడు పేజీలకు మించని మ్యానిఫెస్టోల పద్ధతి మామూలైపోయింది. అది పౌరులకూ తేలికగా ఉంది. సిద్ధాంత రాజకీయాలు పలుచబడి, అవకాశవాద రాజకీయాలు బలపడ్డ తర్వాత.. మానిఫెస్టోల్లో సూటిగా, నిర్దిష్టంగా ఉండే హామీలకే పెద్దపీట లభిస్తోంది. టీఆర్‌‌ఎస్‌‌ దేశవ్యాప్త విస్తరణ కోసం బీఆర్‌‌ఎస్‌‌గా మారిన నేపథ్యంలో ‘అబ్‌‌ కీ బార్‌‌.. కిసాన్‌‌ సర్కార్‌‌’ నినాదం నెత్తికెత్తుకుంది. రేపు ఇదే వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో కీలకాంశం కావచ్చు. దానికి తెలంగాణలో వ్యవసాయరంగాన్ని ఆదర్శంగా, రైతు జీవితాన్ని రోల్‌‌మాడల్‌‌గా చూపిస్తామంటారు.

దేశ ప్రజలు దాన్ని నమ్మాలి. అందుకు నిదర్శనాలు కావాలి. అంత ఆదర్శప్రాయమైన రైతు జీవితం తెలంగాణ వ్యవసాయరంగంలో ఉందా? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఢిల్లీలో అధికారంలో ఉండి, సర్కారీ విద్య, సర్కారీ వైద్యం విషయంలో ఆప్‌‌ గొప్ప విజయాలు నమోదు చేసింది. ఇదే విషయాన్ని ఎన్నికల హామీగా పంజాబ్‌‌లో చెప్పుకున్నపుడు వారికి సానుకూలత లభించింది. జనం వారిని గెలిపించారు. మరి, అదే నినాదం గుజరాత్‌‌లో జనానికి నమ్మకం కలిగించలేకపోయింది. 2009 ఎన్నికల్లో, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా మొత్తం ప్రచారాన్ని భుజాలకెత్తుకున్న  వైఎస్సార్‌‌ నిర్దిష్టంగా రెండు మాటలు తప్ప కొత్త హామీలేమీ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు మ్యానిఫెస్టోయే లేదు. పేదలకిచ్చే బియ్యం మరికొన్ని కిలోలు పెంచుతామని, వ్యవసాయానికి పగటిపూట ఇచ్చే విద్యుత్తు మరిన్ని గంటలు పొడిగిస్తామని మాత్రమే చెప్పారు. వాటితోనే అధికారం తిరిగి నిలబెట్టుకున్నారు.

- దిలీప్‌‌ రెడ్డి,పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ