
ఆకాశమంత అరుగు, బూదేవంత పందిరి. పందిట్లో పెళ్లి కొడుకు – పెళ్లికూతురు. పంతులు మంత్రాలు చదువుతున్నాడు. బంధువులందరూ పెళ్లి తతంగాన్ని చూస్తున్నారు. మధ్య మధ్యలో పందింట్లో ఉన్న జంట ఎంతబాగుందో అంటూ పెళ్లికొచ్చిన అమ్మలక్కలు గుసగుసలాడుతున్నారు. మరో ఐదు నిమిషాల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుపై..పెళ్లికొడుకు పెళ్లి కూతురిపై జీలకర్ర బెల్లం పెట్టాలి. దీంతో పెళ్లి తంతు సగం ముగుస్తుందని అనుకుంటూ పంతులు మంత్రాలు స్పీడ్ గా చదువుతున్నారు. అంతలోనే పెళ్లి కూతురు సినీఫక్కీలో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా ప్రియుడు ఇక్కడికి వచ్చి నన్నుతీసుకొని వెళతాడంటూ బాంబు పేల్చింది.
తమిళనాడులోని నీలగిరి జిల్లా ఉదగ గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. ప్రియదర్శిని అనే యువతికి, ఆనంద్ వివాహం జరగాల్సి ఉంది. కానీ జరగలేదు. పంతులు మంత్రాలు చదువుతుండగా పెళ్లి కూతురు నాకు ఈ పెళ్లి ఇష్టంలేదంటూ పెళ్లి పీఠమీద నుంచి పైకి లేచింది. దీంతో పెళ్లికొచ్చిన బంధువులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో ఆమెను కొట్టబోయారు. అయినా సరే నా ప్రియుడు వస్తాడు కొంచెం సేపు ఆగండి అంటూ అందర్ని నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. ఆమె చెప్పినట్లుగానే అందరూ ఎదురు చూశారు. కానీ ప్రియుడు మాత్రం రాలేదు. దీంతో ప్రియదర్శనీపై ఆనంద్ పాటు కుటుంబసభ్యులు పరువు తీసిందంటూ తిట్టిపోశారు.
కాగా కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు ప్రియదర్శనిని బలవంతంగా అరేంజ్ మ్యారేజ్ చేయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మ్యారేజ్ నచ్చకనే పెళ్లి కూతురు పెళ్లిపీటలపై నుంచి లేచిందని స్థానికులు చెబుతున్నారు.